ఆ మాజీ జడ్పీ చైర్మన్ ఆశలు నెరవేరేనా? ఎమ్మెల్సీ స్థానం దక్కేనా?

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

తుల ఉమా.. కరీంనగర్‌ జిల్లా మాజీ జడ్పీ చైర్మన్. ఎమ్మెల్యేగా పోటీ చేసి అసెంబ్లీలో అధ్యక్షా అనాలని ఆశపడింది. అది నెరవేరకపోవడంతో కనీసం నామినేట్ పదవైనా దక్కుతుందని వేయి కళ్లతో ఎదురుచూస్తోంది. సామాజిక వర్గాల సమీకరణాలతో శాసన సభకు పోటీకి దూరంగా ఉండిపోయింది. టీఆర్‌ఎస్‌ అధిష్టానం హామీతో ఎన్నికల్లో వెనక్కి తగ్గింది. రేపో మాపో భర్తీ అయ్యే ఎమ్మెల్సీ స్థానం కోసం ఆశలు పెట్టుకుంది.

2014లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా జెడ్పీ చైర్మన్‌గా ఉమ :
తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన వారిలో ఉమా కూడా ఒకరు. ప్రజా సమస్యలపై నాడు జనశక్తి, ప్రజాసంఘాల్లో పనిచేశారు. జై తెలంగాణ అంటూ కేసీఆర్‌ ఇచ్చిన నినాదంతో ఉద్యమబాటపట్టారు.2014లో టీఆర్‌ఎస్‌ అధికారంలోకి రాగానే ఉమ్మడి కరీంనగర్‌జిల్లా జడ్పీ చైర్మన్‌గా ఉమకు అవకాశమిచ్చారు సీఎం కేసీఆర్‌. దీంతో రాజకీయాల్లో తనదైన ముద్రవేశారు. పదవీకాలం ముగియడంతో ఇప్పుడు నామినేటేడ్ పదవులకు గంపెడాశలు పెట్టుకున్నారు.

2018లో వేములవాడలో పోటీ చేయాలని ప్రయత్నం :
2009లో మెట్‌పల్లి పార్టీ టిక్కెట్ ఉమా ఆశించినప్పటికీ.. నియోజకవర్గాల పునర్విభజనతో విద్యాసాగర్‌ రావుకు కేటాయించారు. 2018లో వేములవాడ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావించారు. కానీ అప్పుడు కూడా అధిష్టానం మాటకి కట్టుబడి వెనక్కి తగ్గారు. భవిష్యత్‌లో నామినేటెడ్ పదవి ఇస్తామని పార్టీ పెద్దలు నచ్చజెప్పడంతో… పోటి నుంచి తప్పుకుంటూనే వస్తున్నారు. మంత్రి కేటీఆర్‌ హామీతో ఈసారైనా ఎమ్మెల్సీ దక్కుతుందని ధీమాతో ఉంది ఉమా.కర్నే ప్రభాకర్‌కు మళ్లీ అవకాశమిస్తారని టాక్ :
తెలంగాణలో నాలుగు ఎమ్మెల్సీ స్థానాలు భర్తీ చేయాల్సి ఉంది. నిజామాబాద్ ఎమ్మెల్సీ స్థానం మాజీ ఎంపీ కవితకు కన్‌ఫామ్ అయింది. కర్నే ప్రభాకర్ పదవీకాలం ఆగస్ట్‌లో ముగుస్తుండడంతో మళ్లీ ఆయనకు అవకాశమిస్తారని తెలుస్తోంది. ఖాళీ అయ్యే మరో స్థానంలో నాయిని, రాములు నాయక్‌ల పేర్లు వినిపిస్తున్నాయి.

ఇక నాలుగోస్థానం తనకే దక్కుతుందని ఆశాభావంతో ఉంది ఉమా. అయితే అధిష్టానం మనసులో ఏముందనేది అంతుపట్టడం లేదు. పార్టీకి విధేయులుగా ఉన్న వారికి పదవులిచ్చి న్యాయం చేశారు. ఇప్పుడు తనకు కూడా అవకాశం దక్కుతుందనే నమ్మకంతో ఉమా ఉంది. మరీ హైకమాండ్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.


Related Posts