లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

National

చిన్నమ్మ శపథం నెరవేరుతుందా ? ఆమె ఎదుట నాలుగు ఆప్షన్లు

Published

on

v k sasikala : చిన్నమ్మ శశికళ జైలు గోడలు దాటి బయటకొచ్చేసింది. జైలుకు వెళ్లే ముందు ఆమె చేసిన శపథం.. ఇప్పుడు నెరవేరుతుందా.? మారిన రాజకీయ పరిస్థితులతో.. శశికళ ముందున్న ఆప్షన్స్ ఏంటి? ఇప్పుడు.. తమిళనాడు అడుగుతున్నది కూడా ఇదే.. చిన్నమ్మ దారెటని? జైలు నుంచి రిలీజ్ అవటానికి కొన్నిరోజుల ముందు.. శశికళ కోవిడ్ బారిన పడ్డారు. ప్రస్తుతానికి.. ఆమె బెంగళూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. చెన్నై రావటానికి మరికొన్నిరోజుల సమయం పడుతుంది. తమిళనాడు మొత్తం శశికళ నెక్ట్స్ స్టెప్ ఎలా ఉండబోతుందన్న దానిపై చాలా ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

రాజకీయాల్లో భారీ మార్పులు : –
శశికళ జైల్లో ఉన్న సమయంలో తమిళనాడు రాజకీయాల్లో చాలా మార్పులొచ్చాయి. ఆమె జైలుకు వెళ్లటానికి ముందు.. తమిళనాడు సీఎంగా బాధ్యతలు చేపట్టాలనుకున్నారు. పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఆమెను లెజిస్లేచర్ పార్టీ లీడర్‌గా ఎన్నుకున్నారు. కానీ.. రెబల్ లీడర్ అయిన పన్నీర్ సెల్వం.. సీఎంగా శశికళను వ్యతిరేకించారు. తిరిగి ఆయన కూడా పార్టీలో చేరిపోయారు. శశికళ సీఎంగా ఎంపిక చేసిన.. పళనిస్వామి కూడా పన్నీర్ సెల్వంతో చేతులు కలిపి.. శశికళను పార్టీ అత్యున్నత పదవి నుంచి బహిష్కరించారు. దీంతో.. తిరిగి ఆమె అన్నాడీఎంకేలోకి వెళ్లటానికి చాన్స్ లేకుండా పోయింది. అయితే.. జైలు నుంచి విడుదల అవటానికి ముందే.. వివిధ రాజకీయ శిబిరాలతో చర్చలు జరిపిన ఆమె సన్నిహితులు, బంధువుల ప్రకారం.. శశికళకు 4 ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి.

మొదటి ఆప్షన్ : –
తమిళనాడులో అడుగుపెట్టాక శశికళకు ఉన్న మొదటి ఆప్షన్ ఏమిటంటే.. తిరిగి అన్నాడీఎంకేలో చేరడం. ప్రస్తుతం పార్టీని.. ప్రభుత్వాన్ని లీడ్ చేస్తున్న పళనిస్వామి, పన్నీర్ సెల్వంతో ఒప్పందం కుదుర్చుకొని మళ్లీ పార్టీలో చేరటం ఆప్షన్‌గా కనిపిస్తోంది. పళనిస్వామి, పన్నీర్ సెల్వం ప్రభుత్వాన్ని నడిపితే.. పార్టీ బాధ్యతలు తనకు అప్పగించేలా ఒప్పందం చేసుకునే అవకాశం ఉంది. సీఎం పళనిస్వామి ఇందుకు సిద్ధంగా లేరని పార్టీలోని సీనియర్ నేతలు చెబుతున్నారు. ఎందుకంటే.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో.. అన్నాడీఎంకే ఓడిపోతే.. తాను శశికళ కింద పనిచేయాల్సి వస్తుందనే భయంలో ఉన్నారని.. శశికళకు, పళనిస్వామికి సన్నిహితంగా ఉన్న సీనియర్ పార్టీ నేత ఒకరు తెలిపారు.

రెండో ఆప్షన్ : –
అన్నాడీఎంకేలోని కొందరు నేతలు చెబుతున్న దాని ప్రకారం.. పార్టీ నుంచి శశికళను బహిష్కరించాక.. ఆమె మేనల్లుడు టీటీవీ దినకరన్.. ఏఎంఎంకే పార్టీని స్థాపించారు. ఆ పార్టీ ద్వారా.. అన్నాడీఎంకే పొత్తు పెట్టుకొని ఎన్నికలకు వెళ్లడం శశికళకు ఉన్న రెండో ఆప్షన్‌గా కనిపిస్తోంది. అన్నాడీఎంకేలోని చాలమంది నాయకులు కూడా ఈ ప్రతిపాదనకు మద్దతిస్తున్నప్పటికీ.. ఎవరూ బహిరంగ ప్రకటనలు చేయడం లేదు. ఏఎంఎంకేతో పొత్తు సక్సెస్ అవ్వాలంటే.. రెండు పార్టీలకు చాలా కారణాలున్నాయి. ఇది వర్కవుట్ అయితే.. దినకరన్ పార్టీ కూడా మనుగడలోకి రావడంతో పాటు తిరిగి అన్నాడీఎంకేలోకి ఎంటర్ అయ్యేందుకు సహాయపడుతుంది. మిత్రపక్షాలతో కలిసి.. తమిళనాడులో బలమైన ప్రతిపక్షంగా ఉన్న డీఎంకేకు ఉన్న అవకాశాలను కొల్లగొట్టడంలోనూ.. అన్నాడీఎంకేకు ఈ పొత్తు ఉపయోగపడుతుందనే చర్చ జరుగుతోంది.

మూడో ఆప్షన్ : –
తాజా రాజకీయ పరిణామాలను బట్టి చూస్తే.. వచ్చే ఎన్నికల్లో అన్నాడీఎంకేను ఓడించాలంటే.. శశికళకు ఉన్న మూడో ఆప్షన్.. ఏఎంఎంకే థర్డ్ ఫ్రంట్ లీడ్ చేయడం. గత లోక్‌సభ ఎన్నికల్లో.. దినకరన్ పార్టీకి 4 శాతం ఓట్ షేర్ వచ్చింది. ఇది.. అన్నాడీఎంకే ఓట్లలో 15 శాతంగా ఉంది. అన్నాడీఎంకేలో ఉన్న ద్రోహులను ఓడించేందుకు.. ఏఎంఎంకే థర్డ్ ఫ్రంట్ లీడ్ చేయడం బెస్ట్ ఆప్షన్‌గా కనిపిస్తోందని పార్టీలోని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు. 2016 ఎన్నికల్లో.. ప్రతిపక్షాన్ని ఓడించేందుకు.. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చడానికి ఈ థర్డ్ ఫ్రంట్ ఐడియాను వర్కవుట్ చేశారు. ఈసారి.. ఏఎంఎంకే లీడ్ చేయబోయే థర్డ్ ఫ్రంట్.. ప్రభుత్వ అనుకూల ఓట్లను చీలుస్తుందని భావిస్తున్నారు. ఎస్ రామదాస్‌కు చెందిన పీఎంకే, కెప్టెన్ విజయకాంత్‌కు చెందిన డీఎండీకేతో పాటు మిగతా పార్టీలు కూడా ఏఎంఎంకే థర్డ్ ఫ్రంట్‌లో చేరబోయే చాన్స్ ఉందంటున్నారు. సీట్ షేరింగ్ విషయంలో.. డీఎంకేకు దాని మిత్రపక్షాలకు మధ్య విభేధాలు, వివాదాలు తలెత్తితే.. థర్డ్ ఫ్రంట్‌లో మరిన్ని పార్టీలు చేరేందుకు అవకాశం ఉంటుంది. ఇదే జరిగి.. ఎన్నికల్లో అన్నాడీఎంకే ఓడిపోతే.. అప్పుడు పార్టీ మొత్తం శశికళ నియంత్రణలోకి వస్తుందని శశికళ కుటుంబానికి సన్నిహితంగా ఉన్నవాళ్లు చెబుతున్నారు. పళనిస్వామికి గానీ, పన్నీర్ సెల్వంకు గానీ పార్టీపై సంపూర్ణ నియంత్రణ లేదని.. ప్రభుత్వాన్ని నడపటానికి మాత్రమే వారి దగ్గర మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారని శశికళ వర్గం చెబుతోంది.

నాలుగో ఆప్షన్ : –
ఇవన్నీ పక్కనబెడితే.. శశికళకు ఉన్న నాలుగో ఆప్షన్.. రాజకీయాల నుంచి దూరమవడం. తమిళనాడులో చాలామంది.. శశికళ తిరిగి రాజకీయాల్లోకి రాకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రజనీకాంత్ తీసుకున్న నిర్ణయమే.. శశికళ కూడా తీసుకుంటుందని భావిస్తున్నారు. రజనీకాంత్‌తో పోలిస్తే.. రాజకీయాలకు దూరంగా ఉండటానికి.. శశికళకు మరిన్ని నమ్మదగిన ఆరోగ్య కారణాలున్నాయని చెబుతున్నారు. కానీ.. ఆమెతో సన్నిహితంగా పనిచేసిన వాళ్లు మాత్రం.. శశికళ రాజకీయాలకు దూరం కాదని గట్టిగా చెబుతున్నారు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే.. జైలుకి వెళ్లటానికి ముందు.. జయలలిత సమాధి దగ్గర.. నేలపై మూడుసార్లు కొట్టి మరీ శశికళ శపథం చేశారు. అందువల్ల.. శశికళ రాజకీయాల నుంచి తప్పుకునే చాన్సే లేదంటున్నారు.