బహిరంగ ప్రదేశాల్లో విగ్రహాల ఏర్పాటుకు నో పర్మిషన్‌….గణేష్‌ ఉత్సవాలపై సందిగ్ధత

  • Published By: bheemraj ,Published On : August 20, 2020 / 04:12 PM IST
బహిరంగ ప్రదేశాల్లో విగ్రహాల ఏర్పాటుకు నో పర్మిషన్‌….గణేష్‌ ఉత్సవాలపై సందిగ్ధత

తెలంగాణలో గణేష్‌ ఉత్సవాల నిర్వహణపై సందిగ్దత నెలకొంది. కరోనా నేపథ్యంలో గణేష్‌ ఉత్సవాలు బహిరంగంగా నిర్వహించకూడదని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. ప్రజలు ఇళ్లల్లోనే గణపతి పూజ చేసుకోవాలని సూచిస్తోంది. ఈ నేపథ్యంలోనే… పోలీసులు బహిరంగ ప్రదేశాల్లో మండపాల ఏర్పాటుకు అనుమతి ఇవ్వడం లేదు. కరోనా రోజురోజుకు వ్యాప్తి చెందుతోందని.. ఈ ఒక్క ఏడాది బహిరంగ ప్రదేశాల్లో ఉత్సవాలు నిర్వహించుకోవద్దంటూ ప్రభుత్వం కోరుతోంది. కరోనా సమయంలో.. గణేష్ వేడుకుల బహిరంగం నిర్వహించడం ఏమాత్రం మేలుకాదని హెచ్చరిస్తోంది. అయితే గణేష్‌ ఉత్సవాలపై కొందరు ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని….. ఇది సరికాదని అన్నారు.



సర్కార్‌ తీరుపై హిందూ ధార్మిక సంస్థల ఆగ్రహం
ప్రభుత్వ తీరుపై హిందూ ధార్మిక సంస్థలు, వీహెచ్‌పీ, భజరంగ్‌దళ మండిపడుతున్నాయి. పరిమిత సంఖ్యలో భక్తులు మాస్క్‌లు ధరించి గణపతి ఉత్సవాలు నిర్వహించకోవచ్చని తొలుత చెప్పిన ప్రభుత్వం.. ఇప్పుడు మాట మార్చడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇప్పటికే భక్తులు అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత.. ఇంట్లోనే పూజ చేయాలంటూ చెప్పడమేంటని ప్రశ్నిస్తున్నాయి. ఉత్సవాల నిర్వాహకులను వేధింపులకు గురిచేస్తూ.. ఆంక్షలు విధించడం తగదని చెబుతున్నాయి. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చాయి.



వినాయక ఉత్సవాలపై పోలీసుల ఆంక్షలు
హైదరాబాద్‌లో ప్రతిఏటా గణేష్‌ ఉత్సవాలు హంగు ఆర్బాటాలు, తీన్మార్‌ డ్యాన్స్‌లతో జరుగుతాయి. కరోనా నేపథ్యంలో ఈసారి ఎలాంటి హడావుడి లేకుండానే ఉత్సవాలు జరుపుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. హైదరాబాద్‌లో కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతుండడంతో… గణపతి వేడుకలపై పోలీసులు ఈసారి ఆంక్షలు విధించారు. ప్రభుత్వం కూడళ్లు, బహిరంగ ప్రదేశాల్లో విగ్రహాలను పెట్టకూడదని నిర్ణయించడంతో… ఈసారి గణేష్‌ ఉత్సవాలు నామమాత్రంగా జరగనున్నాయి.



గణేష్‌ ఉత్సవాలపైనా కోవిడ్‌ ప్రభావం
హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 60 లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. వాస్తవానికి స్థానిక పోలీస్ స్టేషన్ లో నుండి మండపాల నిర్వాహకులు పోలీసుల అనుమతి తప్పనిసరిగా ఉంటుంది. కానీ ఈ ఏడాది అనుమతి నిరాకరించడంతో గణేష్ మండపాలు నిర్వహించడం కష్టతరంగా మారింది. మూడు పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇదే పరిస్థితి నెలకొంది. మొత్తానికి గణేష్‌ ఉత్సవాలపైనా కోవిడ్‌ ప్రభావం పడింది. ఎప్పుడూ ఎంతో ఆర్భాటంగా జరిగే గణేష్‌ వేడుకలు ఈసారి పోలీసుల ఆంక్షల మధ్య కొనసాగనున్నాయి.