గణనాథుడికి ‘కరోనా’ విఘ్నాలు

  • Published By: sreehari ,Published On : August 21, 2020 / 09:22 PM IST
గణనాథుడికి ‘కరోనా’ విఘ్నాలు

చిన్నా పెద్దా సందడిగా నిర్వహించుకునే వినాయకచవితి వచ్చిందంటే వీధులన్నీ మండపాలు, విగ్రహాలతో నిండిపోతాయి. పల్లె, పట్టణం అన్న తేడా లేకుండా డీజే, లౌడ్‌ స్పీకర్ల మోత మోగేది. దద్దరిల్లిపోయే డాన్స్‌లు లేనిదే నిమజ్జనం పూర్తయ్యే పరిస్థితి ఉండదు. చైనాలో పుట్టి సరిహద్దులు దాటి వచ్చిన కరోనా‌వైరస్‌ ఈ సందడి‌లేని సిట్యువేషన్ తెచ్చింది. అవిఘ్నమస్తు అంటూ తొలి పూజలందుకునే బొజ్జ గణపయ్యకే విఘ్నంలా మారింది.

ఉత్సవ కమిటీల మధ్య పోటీతో మరో స్థాయికి :
ఉత్సాహం నింపుకోవడానికే ఉత్సవాలంటూ అప్పుడెప్పుడో బాలగంగాధర తిలక్‌ పిలుపునిచ్చారు. ఆ పిలుపుతో దేశమంతటా విస్తరించిన గణేష్‌ నవరాత్రుల సంబురాలు ఉత్సవ కమిటీల మధ్య పోటీతో గత కొన్నేళ్లుగా మరో స్థాయికి వెళ్లాయి. మారుతున్న పరిస్థితులు, సాంకేతికతతో పాటే పండుగ నిర్వహించే తీరు కూడా మారింది.



ఈ మధ్య పర్యావరణహిత మట్టి విగ్రహాలు మండపాల్లో దర్శనమిచ్చాయి. నిమజ్జనంలో లౌడ్‌ స్పీకర్లకు డీజేల మోత చేరింది. అయితే కరోనా విజృంభణ.. ఈ ఆనందాన్ని కట్టడి చేసింది. వైరస్‌ వ్యాప్తి నియంత్రణకు 10మందికి మించి ఉండకుండా ఆలయాల్లో పూజలు నిర్వహించాలనే నిబంధన విధించారు. దీంతో చాలామంది ఇళ్లల్లోనే పూజలు చేసుకుని పరిస్థితి వచ్చింది.

వేలం పాటలో లక్షలు వెచ్చించేందుకు ఆసక్తి :
చవితి ఉత్సవాలపై అధికారులు అన్నిచోట్లా ఆంక్షలు విధించారు. కొవిడ్‌ నిబంధనలు తప్పకుండా పాటించాలని ఉత్సవ కమిటీలకు నిర్దేశించారు. సామూహిక ప్రతిష్ఠ, ప్రసాదాల పంపిణీకి దూరంగా ఉండాలన్నారు. మరోవైపు ఖైరతాబాద్ గణేశుడితో పాటు బాలాపూర్ వినాయకుడికి కూడ కరోనా సెగ తగిలింది. కేవలం ఆరు అడుగుల విగ్రహం మాత్రమే ఏర్పాటు చేశారు.



ఖైరతాబాద్‌ భారీ గణపయ్యకు కేరాఫ్‌ అయితే.. బాలాపూర్‌ వినాయకుడి లడ్డూ వేలానికి ఫేమస్‌. ఈ విగ్రహం దగ్గర నవరాత్రుల పాటు పూజలు చేసిన లడ్డు వేలం సాగుతోంది. ఈ లడ్డును లక్షల రూపాయాలు పెట్టి కొనుగోలు చేస్తుంటారు. అయితే కరోనా కారణంగా ఈ ఏడాది బాలాపూర్ లడ్డు వేలాన్ని రద్దు చేశారు. అంతేకాదు దర్శనానికి భక్తులకు అనుమతి లేదని ఉత్సవ కమిటీ స్పష్టం చేసింది.

బాలాపూర్‌లో 1994లో ప్రారంభమైన వేలంపాట :
తెలంగాణలో బాలాపూర్ గణేశ్‌ లడ్డు వేలం పాటకు చరిత్ర ఉంది. ఈ వేలం పాట 1994లో ప్రారంభమైంది. బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితిగా ఏర్పాటై బాలాపూర్ లో గణేష్ వినాయక విగ్రహన్ని ఏర్పాటు చేసి లడ్డు వేలం పాటను నిర్వహిస్తున్నారు. ఎక్కువగా కొలను కుటుంబం దక్కించుకుంటోంది.

ఇప్పటిదాకా 9సార్లు లడ్డూను కైవసం చేసుకుంది ఆ కుటుంబం. మొదట్లో 450 రూపాయలతో ప్రారంభమైన లడ్డూ వేలం.. గతేడాది 17లక్షల 60వేలు పలికింది. లడ్డూ వేలం ఎపిసోడ్‌ భారీ జనసందోహం మధ్య కోలాహలంగా ముగుస్తుంది. కానీ ఇప్పుడా సీన్మా ఆడకుండానే కరోనా ఎండ్‌ కార్డ్‌ వేసింది.

మండపాల దగ్గర వెల్లివిరిసే ఆధ్యాత్మికత :
నవరాత్రుల్లో ఒక్కొక్కరు ఒక్కో రోజు పూజలు చేసేందుకు ముందస్తుగానే బుకింగ్‌లు చేసుకుంటారు. ఫ్యామిలీ అంతా కలిసి వెళ్లి దేవుడ్ని దర్శించుకుని పూజాధి కార్యక్రమాలు చేస్తుంటారు. పూజారి మంత్రోచ్ఛారణలతో పరిసర ప్రాంతం ఆధ్యాత్మికత వెల్లివిరుస్తుంది.



ఇక మండపం ఏదైనా లడ్డూ వేలానికి ఉండే క్రేజే వేరు. వినాయకుడి లడ్డును దక్కించుకుంటే ఆ ఏడాదంతా తమకు బాగా కలిసివస్తుందని భావిస్తారంతా. అందుకే ధర ఎంతైనా లడ్డూను కైవసం చేసుకునేందుకు పోటీపడుతుంటారు. అలాగే శాలువాను దక్కించుకునేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తారు.

ఉత్సవాల్లో ఇలా ప్రతీ ఎపిసోడ్‌ దేనికదే ప్రత్యేకత సంతరించుకుంటుంది. కానీ కరోనా వీరవిహారంతో వీటన్నింటికి దూరం కావాల్సిన పరిస్థితి వచ్చింది. కరోనా ఎఫెక్ట్‌తో ప్రజల్లోనూ మంచి మార్పు కనిపిస్తోంది. ఎక్కడా హడావుడికి వెళ్లకుండా.. నిరాడంబరంగా ఉత్సవాలు జరుపుకునేలా ఏర్పాట్లు చేసుకున్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో ఇంట్లోనే పూజలు చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. ఆరోగ్యంగా ఉంటే వచ్చే ఏడాది మరింత రెట్టింపు ఉత్సాహంతో పండుగ చేసుకుంటామనే అభిప్రాయం ప్రజల్లో కనిపించింది.