అరెస్ట్ సమయంలో… గ్యాంగ్ స్టర్ వికాస్ చెంప చెల్లుమనిపించిన ఎంపీ పోలీస్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని కాన్పూర్‌లో 8మంది పోలీసుల మృతికి కారణమైన కేసులో ప్రధాన నిందితుడు, మోస్టు వాటెండ్‌ క్రిమినల్‌ వికాస్‌ దూబే మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని ఉజ్జయిని మహాంకాళి ఆలయంలో గురువారం ఉదయం పోలీసులకు పట్టుబడిన విషయం తెలిసిందే.

అయితే వికాస్ ను అరెస్ట్ చేసే సమయంలో ఓ పోలీస్ కానిస్టేబుల్ అతడిని గట్టిగా పట్టుకున్నాడు. దీంతో స్వరం పెంచిన నిందితుడు… . ‘మై వికాస్ దూబే హూ.. కాన్పూర్ వాలా.. (నేను వికాస్ దూబే.. నాది కాన్పూర్)’ అని అరిచాడు. పోలీసులనే చంపేశాడుగా.. తన పేరు చెబితేనే గడగడలాడిపోతారని అనుకున్నాడేమో.. పట్టుబడేటప్పుడు కూడా అదే గాంభీర్యం ప్రదర్శించాడు. కానీ, అవతల పట్టుకున్న కానిస్టేబుల్ అంతకంటే మొండివాడిలా ఉన్నాడు. ‘చుప్.. ఆవాజ్ నహీ.. (అరవకు.. సౌండ్ వినపడొద్దు) అంటూ చెంప చెల్లుమనిపించాడు. వికాస్ దూబే నోట్లో నుంచి ఇంకా మాట బయటకు రాలేదు. ఆ తర్వాత మరికొంత మంది పోలీసులు వచ్చి అతడిని బంధించి పోలీసు వాహనంలోకి ఎక్కించి తీసుకెళ్లారు.

ఆ వీఐపీ పాస్ ఎక్కడిది? 
వికాస్ దూబే వీఐపీ పాస్‌తో మహాంకాళి ఆలయానికి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. అతడు వీఐపీ పాస్ ఎవరి ద్వారా పొందాడనే విషయాన్ని కనిపెట్టడానికి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆలయం ముందుకు వచ్చి అమ్మవారికి నమస్కారం చేస్తున్న వికాస్ దూబేను అక్కడే ఉన్న ఓ వ్యాపారి గుర్తించి ఆలయంలోని భద్రతా సిబ్బందిని అలర్ట్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో వాళ్లు వచ్చి అతడిని పట్టుకున్నారు. అనంతరం ఉజ్జయినీ పోలీసులు వచ్చి తీసుకెళ్లిపోయారు

జూన్‌ 3న కాన్పూర్‌ పోలీసులు హత్య కేసులో వికాస్‌ దూబేను అరెస్టు చేసేందుకు బిక్రూ గ్రామానికి వెళ్తుండగా వారి వాహనానికి దూబే అనుచరులు భూమిని చదును చేసే యంత్రాన్ని అడ్డుపెట్టి వాహనాల చాటు నుంచి‌ పోలీసులపైకి కాల్పులు జరిపారు. కాల్పుల్లో ఓ డిప్యూటీ ఎస్పీస్థాయి అధికారితోపాటు, ముగ్గురు ఎస్‌ఐలు, నలుగురు కానిస్టేబుళ్లు మృతి చెందారు. నాటి నుంచి వికాస్‌ దూబే పరారీలో ఉండగా పోలీసులు 40బృందాలుగా ఏర్పడి అతడి ఆచూకీ కనుగొనే పనిలో పడ్డారు. శుక్రవారం హర్యానాలో పోలీసుల కంటపడిన దూబే చిక్కినట్లే చిక్కి తప్పించుకున్నాడు. ఈ ఐదురోజులుగా సాగిన వేటలో వికాస్‌ దూబేకు చెందిన ఐదుగురు అనుచరులను పోలీసులు మట్టుబెట్టారు. చాలా మందిని విచారించి చివరకు గురువారం దూబేను పట్టుకున్నారు.

Related Posts