బెజవాడలో తల్లిదండ్రులు జాగ్రత్త, మీ పిల్లలపై ఓ కన్నేయండి, లేదంటే భారీ మూల్యం తప్పదు.. విజయవాడలో జోరుగా గంజాయి, డ్రగ్స్ విక్రయాలు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ganja drugs vijayawada: బెజవాడలో విద్యార్థుల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇది. తమ పిల్లలు చదుకుంటున్నారనో, ఫ్రెండ్స్‌తో కంబైన్డ్‌ స్టడీ చేస్తున్నారనో భావించి లైట్ తీసుకుంటే చాలా పెద్ద పొరపాటే అవుతుంది. మీ పిల్లలు మత్తు ఊబిలో కూరుకుపోయినట్లే. ఏపీ రాజధాని కేంద్రంగా సాగుతున్న గంజాయి, మాదక ద్రవ్యాల విక్రయాలపై 10 టీవీ స్పెషల్‌ స్టోరీలో పరిస్థితి ఎంత భయానకంగా ఉందో అర్థమవుతోంది.

మత్తుకు బానిసలుగా విద్యార్థులు:
బెజవాడ గంజాయితో గజగజా వణికిపోతోంది. విద్యార్థులు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులు గమనించకపోతే అంతే సంగతులు. చదువుకునే వయస్సులో విద్యార్థులు..మత్తుకు బానిసలవుతున్నారు. ఆ దమ్ముకు పరి తపిస్తున్నారు. అందుకోసం ఎంతైనా ఖర్చు చేస్తున్నారు. ప్యాకెట్‌ మనీనే కాదు.. అప్పులు చేసి మరీ గంజాయి పీలుస్తున్నారు. బీటెక్‌, మెడికల్‌ స్టూడెంట్స్‌ మాత్రమే…కాదు డిగ్రీ, ఇంటర్‌, చివరకు టెన్త్‌ విద్యార్థులను కూడా టార్గెట్‌ చేశారు గంజాయి స్మగ్లర్లు. దీంతో విజయవాడ కేంద్రంగా…గంజాయి, డ్రగ్స్‌ వ్యాపారం మూడు ప్యాకెట్లు, ఆరు లక్షలుగా సాగుతోంది.

నిన్నటివరకు బ్లేడ్ బ్యాచులు, ఇప్పుడు గంజాయి బ్యాచ్ లు:
బెజవాడ నగరంలోకి జోరుగా గంజాయి అక్రమరవాణా జరుగుతోంది. మొన్నటివరకు నగరంలో బ్లేడ్‌ బ్యాచ్‌లు కలకలం సృష్టిస్తే…ఇప్పుడు గంజాయి బ్యాచ్‌లు రెచ్చితున్నాయి. విజయవాడ ఏపీకి నడి మధ్యలో ఉండడానికి తోడు రైలు, రోడ్డు మార్గాలకు జంక్షన్‌. ఎయిర్‌పోర్ట్‌ కూడా ఉంది. దీంతో గంజాయి స్మగ్లింగ్‌ ఈజీ అవుతోంది. ఉన్నత విద్యా సంస్థలకు కేంద్రంగానూ విరాజిల్లుతోంది. దీంతో విద్యార్థులను టార్గెట్‌గా చేసుకుని అక్రమార్జన చేస్తున్నారు స్మగ్లర్లు.

సిగరెట్లలో పెట్టుకుని పీలుస్తూ మత్తులో జోగుతున్న యువత:
గంజాయి, ఇతర మాదకద్రవ్యాలను సిగరెట్లలో పెట్టుకుని పీలుస్తూ మత్తులో జోగుతోంది యువత. అటు గుంటూరు జిల్లాకు గంజాయి అక్రమరవాణా జోరుగా సాగుతోంది. విజయవాడ, గుంటూరు నగరశివార్లలో పేదలు గంజాయికి బానిసలవుతున్నారు. మధ్యతరగతి ప్రజానీకం గంజాయి మత్తు రుచి చూస్తోంది. ఆ తర్వాత దానికి దాసోహమంటోంది. ఉన్నత ఆదాయ వర్గాలకు గంజాయి అందుతోంది. దాంతో పాటు ఇతరత్రా డ్రగ్స్‌ సరఫరా అవుతోంది.

విశాఖ ఏజెన్సీ ప్రాంతాల నుంచి విజయవాడకు గంజాయి స్మగ్లింగ్‌:
విశాఖ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల నుంచి విజయవాడకు గంజాయి స్మగ్లింగ్‌ అవుతోంది. అటు పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంతో పాటు ఇటు తెలంగాణలోని ఇల్లందు పరిసర ప్రాంతాల నుంచి కూడా గంజాయి అక్రమరవాణా చేస్తున్నారు. విశాఖ, గోదావరి, ఖమ్మం జిల్లాల్లోని ఏజెన్సీలో గంజాయి సాగు జరుగుతోంది. ఆ గంజాయిని దళారులు అక్రమరవాణా చేస్తున్నారు. చెక్‌పోస్టులు, ప్రత్యేక తనిఖీల్లో పట్టుబడే గంజాయి కొంత మోతాదులో మాత్రమే ఉంటుంది. కానీ రహస్యంగా గమ్యస్థానానికి చేరేది పెద్ద మొత్తంలోనే ఉంటుంది.

వాసన రాకుండా మిర్చి బస్తాల నడుమ గంజాయి స్మగ్లింగ్:
సీక్రెట్‌ ప్యాకింగ్‌లో, వాసన కూడా పొక్కకుండా.. ఘాటుగా మిర్చి బస్తాల మధ్యలో ఉంచి గంజాయిని స్మగ్లింగ్‌ చేస్తున్నారు. సూట్‌కేసులు, స్టీల్‌ సామాన్ల సంచులు, మెడికల్‌ కిట్లలో కూడా గంజాయిని ఉంచుతున్నారు. గంజాయి వాసన రాకుండా.. ఘాటుగా ఉండే పౌడర్‌ కొడుతున్నారు. కొరియర్‌ పార్సిళ్లు కూడా జరిగిపోతున్నాయి. పెద్ద స్థాయిలో గంజాయి అంద చేయాలంటే కార్లను ఉపయోగిస్తున్నారు.

సిటీ ఎంట్రన్స్‌లలో తనిఖీ కేంద్రాలు లేకపోవడం, ఉన్నా పట్టించుకోకపోవడం:
కారులో గంజాయి స్మగ్లింగ్‌ చేస్తున్నప్పుడు అందులో ఉన్నవారు దర్జాగా కనిపిస్తారు. ఫ్యామిలీ మాదిరి వస్తారు. కానీ తనిఖీలు చేస్తే అసలు బండారం బయటపడుతుంది. గంజాయి దొరుకుతుంది. ఇలా ఎన్నో కేసులు వెలుగుచూశాయి బెజవాడలో. సిటీ ఎంట్రన్స్‌లలో తనిఖీ కేంద్రాలు లేకపోవడం, ఉన్నా పట్టించుకోకపోవడంతో గంజాయి సేల్స్‌కి బెజవాడ కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది.

ఆటోనగర్, కృష్ణలంక, నున్న, వన్ టౌన్, భవానీపురం కేంద్రాలుగా గంజాయి వ్యాపారం:
విజయవాడలోని.. ఆటోనగర్, కృష్ణలంక, నున్న, వన్ టౌన్, భవానీపురం కేంద్రాలుగా చేసుకుని కొంతమంది గంజాయి వ్యాపారం చేస్తున్నారు. రైల్వేస్టేషన్‌, బస్టాండ్‌, కృష్ణలంక కరకట్ట, భవానీపురం, చిట్టినగర్, రాజరాజేశ్వరిపేట, హనుమాన్‌పేట బ్యారేజీ, అజిత్‌సింగ్‌ నగర్‌, గురునానక్‌ కాలనీ, శివారు ప్రాంతాల్లో పలు కేసులు నమోదయ్యాయి. గతంలో ఓ ప్రైవేట్‌ వర్సిటీలో ఇంజనీరింగ్‌ చదువుతున్న నైజీరియా, ఉగాండా, ఆఫ్రికన్‌ స్టూడెంట్స్‌ డ్రగ్స్‌ సప్లయ్ చేసినట్లు గుర్తించారు. ఇద్దరు నైజీరియన్లతో పాటు వారికి సహకరించిన మరో ముగ్గురిని అరెస్ట్‌ చేసి జైలుకు పంపారు. అయినా సరే ఆ తర్వాత కూడా గంజాయి స్మగ్లింగ్‌ యధేచ్ఛగా జరుగుతోంది.

డబ్బు కోసం దాడులు:
విద్యార్థులే కాదు.. శివారు ప్రాంతాల్లోని పేదలు, కూలీలు, యాచకులు, సన్యాసులు అంతా గంజాయి కోసం ఎగబడుతున్నారు. రైల్వేస్టేషన్‌ పరిసరాల్లోని బ్లేడ్‌ బ్యాచ్ లైతే నిత్యం గంజాయి మత్తులో జోగుతూనే ఉంటారు. గంజాయికి డబ్బులు ఇవ్వాలని స్టేషన్‌ పరిసరాల్లో రాత్రి పూట నిద్రించేవారిని బెదిరించి గాయపర్చిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి.

వందల కిలోల గంజాయి అక్రమరవాణా:
రైల్వేస్టేషన్లు, బస్టాండ్‌లలో అడపాదడపా తనిఖీలు చేస్తున్నా వందల కిలోల గంజాయి అక్రమరవాణా జరుగుతూనే ఉంది. అటు ఒడిశాలోని బరంపురం నుంచి ఖమ్మం జిల్లా వరకు ఉన్న ఏజెన్సీల్లో సాగుచేస్తున్న గంజాయి బెజవాడకు చేరుతోంది. పోలీసులు అరెస్ట్‌లు చేస్తున్నా చిన్నవాళ్లే దొరుకుతున్నారు కానీ బడా స్మగ్లర్లను పట్టుకోలేకపోతున్నారు. విజయవాడ నుంచి గంజాయిని రైళ్లలో ఢిల్లీ, నాగ్‌పూర్‌, సూరత్‌, ముంబైకు స్మగ్లింగ్‌ చేస్తూ లక్షలు గడిస్తున్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో గంజాయి కిలో 20 వేల రూపాయల వరకు ఉంది. దీంతో చిన్న చిన్న ప్యాకెట్లుగా కట్టి.. 200 నుంచి 500 రూపాయలకు విక్రయిస్తున్నారు.

పోలీసులు ఏం చేస్తున్నారు?
విజయవాడలో విచ్చలవిడిగా గంజాయి క్రయవిక్రయాలు సాగుతుంటే…నియంత్రించాల్సిన పోలీసులు ఏం చేస్తున్నారు? ఇప్పుడిదే ప్రశ్నార్థకమవుతోంది. మద్యం మత్తులో చిత్తవుతున్న విద్యార్థులను రక్షించాల్సిన పోలీసు యంత్రాంగం.. మామూళ్ల మత్తులో జోగుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు.. ఈ గంజాయి అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.

ఇటీవల విజయవాడలో గంజాయి విక్రయాలు జోరందుకోవడం, బ్లేడ్‌ బ్యాచ్‌ దాడులు పెరిగిపోవడంతో.. పోలీసులు నిఘా పెంచారు. పలువురుని అదుపులోకి తీసుకున్న పోలీసులు …గంజాయి స్మగ్లింగ్‌పై కొరడా ఝులిపిస్తామన్నారు. బెజవాడలో గంజాయి మత్తులో జోగుతున్న వారిలో విద్యార్థులను గుర్తించారు పోలీసులు. వారికి కౌన్సిలింగ్‌ ఇచ్చి.. మత్తు వదిలించేందుకు డీ అడిక్షన్‌ సెంటర్‌కు తరలించారు.

Related Tags :

Related Posts :