నామినేషన్ నుంచి ఫలితాల వరకు అంతా ఆన్‌లైన్‌.. అధునాతన టెక్నాలజీతో జీహెచ్ఎంసీ ఎన్నికలు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ghmc elections: జీహెచ్ఎంసీ ఎన్నికలకు సన్నాహాలు మొదలయ్యాయి. అయితే.. ఎన్నికలు ఎలా జరుగుతాయి? ఈవీఎంలు ఉపయోగిస్తారా? లేక బ్యాలెట్‌ విధానంలో ఎన్నికలుంటాయా? ఉన్నతాధికారుల సమావేశంలో ఏఏ అంశాలపై చర్చిస్తారు? తెలంగాణలో త్వరలో జరగనున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు ఇప్పటి నుంచే హడావుడి ప్రారంభమైంది. ఎన్నికల అధికారులు త్వరలోనే ఎలక్షన్స్ నిర్వహించాలని భావిస్తున్నారు. దీంతో.. అధికార పార్టీతో పాటు అన్ని పార్టీలు జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం కసరత్తు ప్రారంభించాయి.

ఈవీఎంలా? బ్యాలెట్టా?
అటు పార్టీలు ఎన్నికల ప్రిపరేషన్ ప్రారంభిస్తే… నిర్వహణకు సంబంధించి అంశాలపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ దృష్టి పెట్టింది. ఎన్నికల నిర్వహణపై జీహెచ్ఎంసీ కమిషనర్‌కు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ లేఖ రాశారు. గ్రేటర్ ఎన్నికలు ఈవీఎంలతో నిర్వహించాలా.. లేక బ్యాలెట్‌‌తో నిర్వహించాలో.. అభిప్రాయం చెప్పాలన్నారు. మరోవైపు… గురువారం(అక్టోబర్ 1,2020) రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కార్యాలయంలో ఉన్నతాధికారుల సమావేశం జరగనుంది. ఎన్నికల నిర్వహణ, సిబ్బంది శిక్షణ ,సాంకేతిక పరిజ్ఞానంపై అధికారులు చర్చించనున్నారు.

ఆన్ లైన్ లో ఓటర్ లిస్ట్, పోలింగ్ కేంద్రం:
అక్టోబర్ 3న జీహెచ్ఎంసీ కార్యాలయంలో అఖిలపక్ష సమావేశం జరగనుంది. వార్డుల విభజన, ఓటర్ల జాబితా, లాంటి అంశాలపై చర్చించనున్నారు. కరోనా సమయం కావడంతో.. పోలింగ్ టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాలపై జీహెచ్ఎంసీ అధికారులు చర్చించనున్నారు. ఇక.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అధునాతన టెక్నాలజీని వినియోగిస్తామ‌ని రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు చెబుతున్నారు.

ఓటర్ లిస్ట్‌తో పాటు, పోలింగ్ కేంద్రాన్ని ఆన్ లైన్‌లో పొందుపర్చాలని నిర్ణయించారు. నామినేషన్ నుంచి ఫలితాల వరకు మొత్తం ప్రక్రియను ఆన్ లైన్ లోనే నిర్వహిస్తామ‌ని చెప్పారు. టెక్నాల‌జీతో తక్కువ సమయంలో.. తక్కువ సిబ్బందితో ఎన్నికల ను నిర్వహించవచ్చని భావిస్తున్నారు.

నవంబర్ 11 నుంచి ఎన్నికలుంటాయని నేను అనలేదు:
జీహెచ్ఎంసీ ఎన్నికలను బ్యాలెట్‌ పద్ధతినే నిర్వహించాలని ఎన్నికల సంఘాన్ని టీఆర్‌ఎస్ కోరింది‌. కొవిడ్ నేపథ్యంలో ఈవీఎంలైతే ఇబ్బందులు వస్తాయి కాబట్టి.. బ్యాలెట్ అయితేనే బెటరని స్పష్టం చేసింది. మరోవైపు.. నవంబర్ 11 నుంచి ఎన్నికలుంటాయంటూ తాను చెప్పినట్లు జరిగిన ప్రచారంలో వాస్తవం లేదని క్లారిటీ ఇచ్చారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. GHMC యాక్ట్‌ ప్రకారం నవంబర్‌ రెండో వారం తర్వాత ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చని.. పార్టీ నేతలు సిద్ధంగా ఉండాలని మాత్రమే తాను సూచించానన్నారు.

ఎన్నికల షెడ్యూల్‌, నిర్వహణ బాధ్యత పూర్తిగా ఎన్నికల కమిషన్‌ పరిధిలోని అంశమని చెప్పారు. కొందరు తాను అనని మాటలను తనకు ఆపాదించారని.. అది సరికాదని ట్వీట్‌ చేశారు కేటీఆర్.Related Posts