Home » జీహెచ్ఎంసీ ఓటరు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ
Published
2 months agoon
By
sreehariGHMC voter verdict : ఈసారి బల్దియా పీఠంపై ఓటర్లు ఎవర్ని కూర్చోబెడతారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. అయితే.. గతంలో రెండు పర్యాయాలు ఓటర్లు భిన్నమైన తీర్పునిచ్చారు. ఓ సారి కాంగ్రెస్కు కట్టబెడితే.. మరోసారి టీఆర్ఎస్కు చాన్స్ ఇచ్చారు. 2016లో జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చేయనేది పరిశీలిస్తే.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ హవా కొనసాగింది. 2016లో జరిగిన బల్దియా పోరులో గులాబీ సైన్యం సత్తా చాటింది.
అందరి అంచనాలను తలకిందులు చేసింది. ఎవరి మద్దతూ లేకుండా మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంది. 150 డివిజన్లకు జరిగిన ఎన్నికల్లో.. తృటిలో సెంచరీని చేజార్చుకుంది. 99 స్థానాల్లో విజయం సాధించింది. టీఆర్ఎస్ తర్వాతి స్థానంలో ఎంఐఎం పార్టీ నిలిచింది. 50కిపైగా స్థానాల్లో పోటీ చేసిన ఎంఐఎం.. 44 చోట్ల విజయం సాధించింది. ఇక 2010 ఎన్నికల్లో సత్తా చాటిన టీడీపీ, కాంగ్రెస్.. 2016లో చతికిల బడ్డాయి. కాంగ్రెస్ రెండు స్థానాలకే పరిమితమైతే.. టీడీపీకి కేవలం ఒకే ఒక స్థానం లభించింది.
బీజేపీ నాలుగుచోట్ల విజయం సాధించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికలు ఉత్కంఠ భరితంగా సాగాయి. కాంగ్రెస్, టీడీపీ, ఎంఐఎం నువ్వానేనా అన్నట్లు పోటీ పడ్డాయి. ఉత్కంఠ భరితంగా సాగిన పోరులో కాంగ్రెస్ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంది. నాటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా 52సీట్లు గెలుచుకుంది. ఆ తర్వాత టీడీపీ 45 డివిజన్లలో విజయం సాధించింది. ఇక ఎంఐఎం 43 చోట్ల గెలుపొందగా.. బీజేపీ 5 స్థానాలకే పరిమితమైంది.
ఈ సారి ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ముఖ్యంగా బీజేపీ, టీఆర్ఎస్ సై అంటే సై అంటున్నాయి. ఎంఐఎం గతంలో కంటే తక్కువ స్థానాల్లో పోటీ చేస్తున్నప్పటికీ.. ఎక్కువ చోట్ల విజయం సాధించడంపై ఫోకస్ పెట్టింది. పార్టీలన్నీ ప్రజలను ఆకర్షిచేందుకు సర్వ శక్తులు ఒడ్డినా.. ఓటర్లు ఎవరిని కరుణిస్తారనేది ఉత్కంఠగా మారింది. ఈ సారి ఏ పార్టీ జెండా మేయర్ పీఠంపై రెపరెపలాడుతుందో తెలియాలంటే డిసెంబర్ 4వరకు ఆగాల్సిందే.