పేదలకు డబ్బులివ్వండి…మీడియాలో గొప్పలు చెప్పుకుంటే కష్టాలు తీరవు : రాహుల్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

మోడీ సర్కార్ పై మరోసారి విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ. మీడియా ద్వారా గొప్పలు చెప్పడం వల్ల పేదల కష్టాలు తీరవంటూ కేంద్ర ప్రభుత్వానికి చురకలంటించారు. పేదలకు డబ్బును పంచి, పారిశ్రామిక వేత్తలకు పన్నులను తగ్గించడం మానుకోవాలన్నారు.

ప్రస్తుత సమయంలో ప్రభుత్వం అధికంగా ఖర్చు చేయాలని, రుణాలను ఎక్కువగా ఇవ్వకూడదంటూ ట్విట్టర్ వేదికగా కేంద్రానికి రాహుల్ కొన్ని సూచనలు చేశారు. వినియోగంతో ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలోకి పెట్టాలని కేంద్రానికి రిక్వెస్ట్ చేశారు. కొన్ని నెలలుగా తాను చేస్తున్న హెచ్చరికలనే తాజాగా రిజర్వ్ బ్యాంకు తన వార్షిక నివేదికలో కూడా పేర్కొందని ఆయన తెలిపారు.

దేశ ఆర్థిక వ్యవస్థకు ఎదురుదెబ్బ తగిలిందని, కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్ విధింపు కారణంగా పేదలు ఎక్కువగా నష్టపోయారని ఆర్బీఐ తాజా నివేదికలో తెలిపింది. ఆర్థిక వ్యవస్థ తిరిగి పట్టాలెక్కడానికి చాలా సమయం పడుతుందని వ్యాఖ్యానించింది. తిరిగి వృద్ధి బాటలో పురోగమించాలంటే విస్తృతమైన సంస్కరణలు తప్పనిసరని ఆర్బీఐ మంగళవారం విడుదల చేసిన తన వార్షిక నివేదికలో పేర్కొంది.

కరోనా వైరస్ వ్యాప్తి నోట్ల సరఫరాను ప్రభావితం చేసిందని ఆర్‌బీఐ నివేదిక తెలిపింది. ప్రధానంగా కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్‌ కారణంగా 2019-20లో నోట్ల సరఫరా కూడా మునుపటి సంవత్సరంతో పోలిస్తే 23.3 శాతం తగ్గిందని పేర్కొంది. నకిలీ నోట్ల విషయానికొస్తే, గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం 2,96,695 నోట్లను గుర్తించగా, ఇందులో 2 వేల నోట్ల సంఖ్య17,020. 2018 మార్చి చివరి నాటికి 33,632 లక్షల రూ.2వేల నోట్లు వాడకంలో ఉండగా.. 2019 మార్చి చివరి నాటికి ఆ సంఖ్య 32,910 లక్షలకు తగ్గిందని ఆర్బీఐ తెలిపింది.

Related Posts