దేశ చరిత్రలో ఓ సువర్ణాధ్యాయం…రాముని అడుగుజాడల్లో నడిస్తే అభివృద్ధి తథ్యం

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

రామ జన్మభూమి స్థలంలో జరిగిన భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని… దేశం మొత్తం రామమయం అయిందని అన్నారు. వందల ఏళ్ల నిరీక్షణ ఇవాళ ఫలించిందన్నారు. అయోధ్యలో సువర్ణ అధ్యయనాన్ని భారత దేశం సృష్టించనుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఎన్నో ఏళ్లు టెంటులో ఉన్న రాముడికి.. దేశం అత్యద్భుతమైన ఆలయాన్ని నిర్మించనుందని పేర్కొన్నారు. దేశ ప్రజల సంకల్ప బలంతోనే రామాలయ నిర్మాణం సాధ్యమవుతోందన్నారు.

దేశ చరిత్రలో ఇవాళ ఓ సువర్ణాధ్యాయం అన్నారు మోడీ. అయోధ్యలో రామాలయ నిర్మాణానికి సంబంధించిన భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత మోదీ ప్రసంగించారు. జై శ్రీరామ్ అంటూ ప్రసంగం ప్రారంభించిన మోడీ … కోట్ల మంది హిందువులకు రామాలయ నిర్మాణం అత్యంత ముఖ్యమైనదని అన్నారు. జై శ్రీరామ్ నినాదాలు ప్రపంచమంతా వినిపిస్తున్నాయని చెప్పారు.

స్వాతంత్ర్యం కోసం దేశమంతటా పోరాటం జరిగిందన్న ప్రధాని మోదీ… వారి త్యాగాల ఫలితంగానే ఆగస్ట్ 15న స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నామన్నారు. అలాగే రామ మందిరం కోసం కూడా ఎంతో మంది పోరాటం చేశారని తెలిపిన మోదీ… రామ మందిర నిర్మాణం కోసం బలిదానాలు కూడా జరిగాయని వివరించారు. అనేక మంది ప్రాణ త్యాగలకు ఫలితమే ఈ ఆలయ నిర్మాణమని వెల్లడించారు. 130 కోట్ల మంది భారతీయుల తరపున వారందరికీ వందనం చేస్తున్నానని మోడీ అన్నారు. మందిర నిర్మాణానికి భూమిపూజ చేయడం మహద్భాగ్యమని వెల్లడించారు. ఇంతటి అదృష్టాన్ని రామమందిర ట్రస్టు తనకు కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

హనుమంతుడి ఆశీస్సులతో ఇవాళ రామాలయ నిర్మాణానికి భూమిపూజ జరిగిందన్నమోడీ … అయోధ్య రామ జన్మభూమి ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారని అన్నారు. వాళ్ల హృదయం ఆనందంతో నిండిపోయిందన్నారు. రాముడు భారత దేశ మర్యాద అన్న మోడీ … రాముడి కార్యక్రమాలన్నీ హనుమంతుడే చేస్తాడని అన్నారు.

రాముడు ప్రతి చోటా ఉన్నాడని, రాముడు అందరివాడని తెలిపిన ప్రధాని.. భారత సంప్రదాయానికి రామాలయం ప్రతీకగా నిలుస్తుందని స్పష్టం చేశారు. భవిష్యత్తు తరాలతో పాటు యావత్​ మానవజాతికే ఈ ఆలయం గొప్ప స్ఫూర్తిదాయకమని అభిప్రాయపడ్డారు.రామమందిర నిర్మాణానికి ప్రేమ, సోదర భావంతో ముందుకు రావాలని ప్రధాని పిలుపునిచ్చారు. మనిషి రాముడిని అనుసరించినప్పుడల్లా.. అభివృద్ధి జరిగిందని అభిప్రాయపడ్డారు. అదే సమయంలో అందరి మనోభావాలను దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగాల్సిన అవసరాన్ని గుర్తుచేశారు.

Related Posts