లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Telangana

ఏజెంట్ల మోసాలకు చితికిపోతున్న గల్ఫ్ బాధితులు

Published

on

Gulf victims suffering from agents scams : గల్ఫ్ బాధిత కుటుంబాల్లో.. ఒక్కొక్కరిది ఒక్కో విషాద గాథ. ఒక్క గల్ఫ్ చావు.. ఎందరికో కనువిప్పు. ఎన్నో ఆశలతో అక్కడికి వెళ్లి.. తీరా అక్కడ పనిదొరక్క.. చేసిన అప్పులు ఎలా కట్టాలో తెలియక.. తనువు చాలించిన వాళ్లు చాలామందే ఉన్నారు. ఏళ్లు గడుస్తున్నా.. బాధిత కుటుంబాలు ఇంకా శోకసంద్రంలోనే ఉన్నాయి. ఆ విషాదం నుంచి ఇంకా కోలుకోవడం లేదు.

ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాల్లో నకిలీ ఏజెంట్లు ఎక్కువైపోయారు. గల్ఫ్ దేశాల్లో ఉద్యోగాలిప్పిస్తామని.. పాస్ పోర్టుల మొదలు, వీసాలు, టికెట్లు అందించే పేరుతో ఏర్పాటు చేసిన సంస్థల్లో.. బోగస్‌వే ఎక్కువ. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి ఏజెన్సీలు 3 వేలకు పైగా ఉంటే.. కేవలం 30 కంపెనీలకు మాత్రమే లైసెన్స్‌లు ఉన్నాయి. ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో.. కేవలం ఏడింటికి మాత్రమే అనుమతి ఉంది.

కరీంనగర్ జిల్లాకు చెందిన ప్రశాంత్, శ్రీకాంత్.. 3 నెలల క్రితం బోగస్ ఏజెంట్ మాటలు నమ్మి.. సౌదీ అరేబీయాలో డ్రైవర్ ఉద్యోగం చేసేందుకు వెళ్లారు. తీరా.. అక్కడి వెళ్లాక గాని వారికి అసలు విషయం అర్థంకాలేదు. శ్రీకాంత్, ప్రశాంత్‌ను.. వారి యజమాని ఒంటెల కాపరులుగా నియమించి.. ఎడారిలో పడేశాడు. ఆకలికి అలమటిస్తూ.. తమను కాపాడాలంటూ సెల్ఫీ వీడియో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అది వైరల్ అవడంతో.. అందరికీ వారి గల్ఫ్ కష్టాలేంటో తెలిశాయి. వీరిలాగే.. చాలా మంది ఉపాధి వేటలో పడి మోసాల పాలవుతున్నారు. నరకం అనుభవిస్తున్నారు.

ఇక.. జగిత్యాల జిల్లా వల్లంపల్లికి చెందిన సాయి రమణ కుటుంబానికొచ్చిన కష్టం మరెవరీ రాకూడదు. 2004లో గల్ఫ్ వెళ్లి సరైన పని దొరక్క.. అక్కడ కూడా అప్పులపాలయ్యాడు రమణ. దీంతో.. తిరిగి రాలేక సౌదీలోనే ఉరేసుకొని చనిపోయాడు. ఇప్పటికీ.. శవం మన దేశం చేరలేదు. మృతదేహం తిరిగి రప్పించేందుకు.. నరకయాతన పడుతున్నారు.

గల్ఫ్ మోసాలపై.. రెండేళ్ల కిందట రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ.. టామ్‌కామ్‌ అనే సంస్థను ఏర్పాటు చేసింది. ఇందులో అధికారికంగా.. 29 కంపెనీలకు మాత్రమే అనుమతి ఉంది. ఈ కంపెనీలు.. ఏజెంట్లను నియమించుకొని గల్ఫ్ దేశాలకు జనాలను పంపుతున్నారు. వీరి ముసుగులోనే.. నకిలీ ఏజెంట్లు పుట్టుకొస్తున్నారు.

ఒక్క జగిత్యాలలోనే 300 మంది ఏజెంట్లున్నారు. కరీంనగర్‌లో 250, సిరిసిల్లలో 200, నిర్మల్‌లో 150, నిజామాబాద్‌లో 350 మంది ఏజెంట్లు ఉన్నారు. ఇందులో సగానికి పైగా బోగస్ ఏజెంట్లే. వీళ్ల ద్వారా గల్ఫ్‌కు వెళ్లి.. కేసుల్లో ఇరుక్కొని.. తిరిగొచ్చిన బాధితుల సంఖ్య కూడా జిల్లాల్లో ఎక్కువగానే ఉంది. ఈ నకిలీ ఏజెంట్ల వ్యవస్థకు అడ్డుకట్ట వేయడంలో.. టామ్‌కామ్ విఫలమైంది.

గల్ఫ్ మోసాలపై.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కనీస స్పందన లేదు. 2016 జూన్‌లో గల్ఫ్‌లో తెలంగాణ ప్రవాసుల సంక్షేమానికి పాటుపడే సంస్థలు, సంఘాల ప్రతినిధులతో ఎన్ఆర్ఐ పాలసీ ముసాయిదా తయారీకి ప్రభుత్వం సదస్సు నిర్వహించినా.. ఆ ముసాయిదా ఇంకా బయటకు రాలేదు. వివిధ సంస్థల వినతులను కూడా ప్రభుత్వం అంతగా పట్టించుకోలేదు. నిజానికి రాష్ట్రంలో ప్రవాసీ సంక్షేమ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ప్రబలంగా ఉంది.

సచివాలయంలో.. జిల్లా కేంద్రాల్లో హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఎప్పుడో అటకెక్కింది. విదేశాల్లో చనిపోయిన వారి కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా, ఎయిర్‌పోర్టుల్లో హెల్ప్ డెస్క్‌లు, మృతదేహాలను ఇళ్లకు చేర్చే బాధ్యత, వివిధ కారణాలతో జైళ్లలో మగ్గుతున్న వారిని బయటకు తెచ్చే డిమాండ్లను కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని.. ఎన్జీవో సంస్థల ప్రతినిధులు చెబుతున్నారు.

ఇప్పటివరకు గల్ఫ్ దేశాలకు ఎందరు వెళ్లారో కూడా తెలియని అయోమయ స్థితులో ప్రభుత్వ లెక్కలున్నాయి. అందుకే.. జిల్లాల వారీగా ట్రావెల్ సంస్థల ముసుగులో సాగుతున్న దందాకు అడ్డుకట్ట వేయాలి. తాజాగా.. దుబాయ్‌కి వలసలు తగ్గినా ఇరాక్ దేశాలకు విజిట్ వీసాలపై ప్రజలను పంపిస్తున్నారు. వీటిని అరికట్టడంలో పోలీస్ శాఖ విఫలమవుతోందన్న విమర్శ ఉంది.