లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Political

ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం అదే చేస్తుందా? బదులు తీర్చుకుంటుందా?

Published

on

రాజకీయ ప్రత్యర్ధులకు ముకుతాడు వేయటం రాజకీయాల్లో సహజంగా జరిగే తంతు. ఎవరు అధికారంలో ఉన్నా ప్రతిపక్ష పార్టీలను, ఆ పార్టీ నేతలను దెబ్బ తీయాలనుకోవటం రాజకీయాల్లో కామన్. గతంలో టీడీపీ ప్రభుత్వమైనా.. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వమైనా చేస్తున్నది అదేనంటున్నారు. జగన్ ప్రభుత్వం బదులు తీర్చుకోనే పనిలో పడ్డట్టుగానే కనిపిస్తోంది.

జగన్ ధాటికి తట్టుకోలేని కొందరు దేశం నేతలు, వైసీపీకి సరండరై పోతుండగా, మరికొందరు మాత్రం ఎదురొడ్డి పోరాడుతున్నారు. అలాంటి వారు ఒక్కొక్కరుగా ఏదో ఒక కేసులో ఇరుక్కోవటం, అవినీతి ఆరోపణలతో అరెస్ట్‌లు అవ్వడంతో టీడీపీ పరిస్థితి దారుణంగా తయారైంది.

టీడీపీ పార్టీకి చెందిన గ్రామస్ధాయి నేతల నుంచి రాష్ట్ర స్ధాయి నేతల వరకు ఎవరికీ ఈ ట్రీట్‌మెంట్‌లో మినహాయింపు లేకుండా పోయిందన్న చర్చసాగుతుంది. మిగిలిన నేతలు కూడా ఎప్పుడు తమ మీద ప్రభుత్వం పడుతుందోనని ఆందోళన చెందుతున్నారట. ఈ ఎపిసోడ్‌లో టీడీపీ నేతలే కాకుండా అప్పటి ప్రభుత్వంలో క్రియాశీలకంగా వ్యవహరించిన అధికారులు కూడా ఉన్నారు.

అసలు ప్రక్షాళన వారితోనే ప్రారంభించారు జగన్‌. అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావు, కేంద్ర సర్వీసు అధికారి జాస్తి కృష్ణకిశోర్, ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్ లాంటి అధికారులు ఇప్పటికే జగన్ చర్యలతో విలవిల్లాడిపోతున్నారు. మరికొందరు ఐఏఎస్ అధికారులు కూడా ఈ జాబితాలో ఉన్నప్పటికీ ముందుగానే మేల్కొని జగన్ సర్కారుకు సరండరై పోయారన్న వార్తలు వినిపిస్తున్నాయి.

అప్పుడు చంద్రబాబు చెప్పినట్లు చేశాం… ఇప్పుడు మీరు ఎలా చెబితే అలా నడుచుకుంటామంటూ బేరానికి రావడంతో వారి పేర్లను తొలగించారని వైసీపీ వర్గాలు అంటున్నాయి. అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర లాంటి టీడీపీ పెద్ద తలకాయలు కేసుల్లో ఇరుక్కోవటంతో ఒక్కసారిగా ఆ పార్టీ నేతలు స్వీయరక్షణలో పడ్డారు. ఇప్పుడే అసలు ఆట ప్రారంభించాలన్న యోచనలో జగన్ మోహన్ రెడ్డి ఉన్నారని అంటున్నారు. ఇప్పటివరకు కమ్మ సామాజికవర్గాన్ని మాత్రమే టార్గెట్ చేశారన్న విమర్శలు జగన్‌ను చుట్టుముట్టాయి. ఇప్పుడు దానిని తుడిచేసుకొనే ప్రయత్నాలను మొదలుపెడుతున్నారట.

జగన్ సర్కారుపై ఆ వర్గమంతా గరగరం :
రాజధాని తరలింపు నిర్ణయంతో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ప్రధాన సామాజికవర్గం వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహంతో ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు జగన్‌కు సమాచారాన్ని చేరవేశాయి. దీనికి తోడు కమ్మ సామాజికవర్గ పునాదులపై నిర్మితమైన టీడీపీని టార్గెట్ చేయడం, వరుస కేసులతో ఆ పార్టీ నేతలను ఉక్కిరిబిక్కిరి చేయటం, ప్రధానంగా అదే సామాజికవర్గమైన ముగ్గురు ముఖ్య అధికారులను ఇబ్బందులు పెట్టటంపై రాష్ట్రంలోని ఆ సామాజిక వర్గమంతా జగన్ సర్కారుపై గరంగరంగా ఉన్నారట.

ఎన్నికల సమయంలో జగన్ గెలుపు కోసం పనిచేసిన పీకే టీమ్ గత నెల రోజులుగా రాష్ట్రంలో జగన్ పాలనపై విభిన్న వర్గాల నుంచి సమాచారాన్ని సేకరించిందట. ఎన్నికల సమయంలో జగన్ అధికారంలోకి రావాలని పని చేసిన వైసీపీలోని కమ్మ సామాజికవర్గం లోలోపల జగన్ వ్యవహార శైలిపై రగిలిపోతున్నారని తెలిసింది. పైకి బాగా ఉంటూనే తెర వెనుక తెలుగుదేశం పార్టీ నేతలతో కలసి జగన్ ప్రభుత్వాన్ని అస్ధిరపరిచేందుకు చూస్తున్నారని జగన్‌కు పీకే టీమ్‌ తెలిపిందంట. దీంతో తక్షణమే దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే రానున్న రోజుల్లో మరికొన్ని వర్గాలు వైసీపీకి దూరమయ్యే అవాకాశాలు ఉన్నాయని సూచించిందంట.

ఆ వర్గంలో మరో మంత్రి పదవి :
పీకే టీమ్‌ ఇచ్చిన సమాచారంతో దిద్దుబాటు చర్యలు చేపట్టేందుకు జగన్‌ సిద్ధపడుతున్నారని అంటున్నారు. ఆ సామాజికవర్గాన్ని దగ్గర చేసుకునే ప్రయత్నాలు చేపడుతున్నారట. ఇప్పటికే ప్రభుత్వంలో రెడ్ల రాజ్యం నడుస్తుందన్న అపవాదును పోగొట్టుకునేందుకు ప్రభుత్వానికి సహకరించే కమ్మ సామాజికవర్గానికి చెందిన అధికారులకు కొన్ని కీలక శాఖల ముఖ్య అధికారులుగా నియమించటంతోపాటు, జిల్లాలో ఖాళీగా ఉన్న మార్కెటింగ్, దేవాదాయశాఖ, సహకార శాఖ వంటి నామినేటెడ్ పోస్టుల్లో పార్టీలోని కమ్మ సామాజికవర్గ నేతలతో భర్తీ చేయాలన్న కార్యాచరణను సిద్ధం చేశారట. అంతేకాదు మంత్రివర్గ విస్తరణలో ఆ వర్గానికి మరో మంత్రి పదవి ఇవ్వాలని జగన్‌ భావిస్తున్నారని పార్టీ వర్గాల్లో టాక్‌.

కమ్మ సామాజిక వర్గం ప్రధానంగా రాజధాని ప్రాంతమైన కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అధికంగా ఉంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి వెన్నుదన్నుగా నిలిచి అత్యధిక మంది ఎమ్మెల్యేలను గెలిపించిన ఈ రెండు జిల్లాల్లో ప్రస్తుతం రాజధాని తరలింపు వ్యవహారంతో ఆ వర్గం రగిలిపోతోంది.

కొడాలి నానికి మంత్రి పదవి ఇచ్చినా, అతని నోటి దురుసు కారణంగా ఆ వర్గం ఆయనను పట్టించుకోవటం లేదు. పార్టీకి తొలి నుంచి వెన్నంటి ఉంటూ, సౌమ్యుడిగా పేరున్న వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వాలన్న తలంపుతో జగన్ ఉన్నారట. ప్రస్తుతం అలాంటి వ్యక్తి కోసం పీకే టీమ్‌తోపాటు, జగన్ అన్వేషిస్తున్నారట.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *