అప్పు చెల్లించలేదని గిరిజన మహిళను ట్రాక్టర్ తో తొక్కించి చంపేశారు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

భూమిని తాకట్టు పెట్టి తీసుకున్న అప్పు చెల్లించలేదని కట్టలేదని ఓ మహిళను దారుణంగా ట్రాక్టర్ తో తొక్కించి చంపేసిన ఘటన ఏపీలోని గుంటూరు జిల్లా శివాపురం తండాలో చోటుచేసుకుంది. నకరికల్లు శివారు శివాపురం తండాకు చెందిన రమావత్‌ మంత్య్రానాయక్‌, మంత్రుభాయి అనే 55 ఏళ్ల మహిళ ఆమె భర్తా కలిసి అటవీ భూములను సాగు చేసుకుంటూ 2 ఎకరాల 70 సెంట్ల భూమిని సాగుచేసుకుంటున్నారు. ఆ భూమిపై న్యాయపరంగా హక్కులు కూడా సాధించుకున్నారు. పంటసాగుతో పాటు ఇతర అవసరాల కోసం నర్సింగపాడుకు చెందిన బోనముక్కల శ్రీనివాసరెడ్డి వద్ద రెండేళ్ల క్రితం పొలం తాకట్టు పెట్టి రూ.3.80 లక్షల అప్పు తీసుకున్నారు.కాలం కలిసి రాక పంటసాగులో నష్టం వచ్చింది. దీంతో ఆ దంపతులు అప్పు తిరిగి చెల్లించలేకపోయారు. దీంతో వడ్డీతో సహా తన అప్పు చెల్లించాలని శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి (అతను రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తికూడా) కొంతకాలంగా వారిపై ఒత్తిడి తెస్తున్నాడు. ఈ విషయంపై కొన్నాళ్లుగా వారి మధ్య వివాదం కొనసాగుతోంది. అప్పు తీర్చకపోతే తనఖా పెట్టిన భూమిని స్వాధీనం చేసుకుంటానని శ్రీనివాసరెడ్డి బెదిరింపులకు దిగాడు. కానీ అప్పు తిరిగి కట్టే పరిస్థితుల్లో లేని ఆ దంపతులు సోమవారం (ఆగస్టు 3,2020) మంత్య్రానాయక్‌, మంత్రుభాయి పొలానికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారని తెలుసుకున్న అతడు ట్రాక్టర్‌తో గ్రామానికి వచ్చాడు.

నా అప్పు చెల్లించకుండా పొలంలో కాలు పెడితే ఊరుకోనని చంపేస్తానని హెచ్చరించాడు. కానీ ఈ భూమి తప్ప మాకు మరో జీవనాధారం లేదనీ..పంట సాగు చేసుకుని ఎలాగోలా అప్పు తీర్చేస్తానమని బతిమాలుకున్నారు. కానీ అతను ఒప్పుకోలేదు. డబ్బన్నా కట్టండి లేదా పొలం స్వాధీనం చేయండి అంటూ ఖరాఖండీగా చెప్పాడు.అలా రెండు వర్గాల మధ్య వాగ్వాదం పెరిగడంతో శ్రీనివాసరెడ్డి విచక్షణ కోల్పోయి ట్రాక్టర్‌తో మంత్రుభాయిను తొక్కించుకుంటూ వెళ్లిపోయాడు. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. తరువాత శ్రీనివాస రెడ్డి అక్కడ నుంచి ట్రాక్టర్‌తో సహా పరారయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.

Related Posts