గుండె మార్పిడి శస్త్రచికిత్సకు సహకరిస్తున్న హైదరాబాద్ మెట్రోరైలు సంస్ధ

గుండె మార్పిడి శస్త్రచికిత్సకు సహకరిస్తున్న హైదరాబాద్  మెట్రోరైలు సంస్ధ

apollo hospitals use metro rail for heart transplantion surgery hyderabad : హైదరాబాద్ మెట్రో రైలు  అధికారులు మంగళవారం ఒక బృహత్కార్యానికి  శ్రీకారం చుట్టారు. హైదరాబాద్ లో  తొలిసారిగా ఒక వ్యక్తి ప్రాణం  నిలబెట్టటానికి తమ వంతు సహాయం అందిస్తోంది. గుండె మార్పిడి ఆపరేషన్  కోసం ఎల్బీనగర్ కామినేని ఆస్పత్రి నుంచి ఫిల్మ్ నగర్ అపోలో ఆస్పత్రికి తరలించాల్సిన గుండెను నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి జూబ్లీ చెక్ పోస్ట్ మెట్రో స్టేషన్  దాకా గ్రీన్  కారిడార్  ఏర్పాటు చేశారు.

మరికొద్దిసేపట్లో   నాగోల్ మెట్రో స్టేషన్ లో రైలు బయలు దేరబోతోంది. గుండె మార్పిడి శస్త్ర చికిత్స కోసం తొలిసారిగా హైదరాబాద్ లో మెట్రో రైలును వినియోగిస్తున్నారు. అపోలో హాస్పిటల్‌ వైద్యుడు గోఖలే  నేతృత్వంలో జరిగే శస్త్ర చికిత్స కోసం గుండెను  మెట్రో రైలులో తరలించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరుకు చెందిన రైతు వరంకాంతం నర్సి రెడ్డి ఆదివారం హైబీపీతో ఎల్బీ నగర్ కామినేని లో జాయిన్ అయ్యాడు. సోమవరాం బ్రెయిన్ డెడ్ అవటంతో అవయవాలు దానం చేయవచ్చని వైద్యులు కుటుంబసభ్యులకు సూచించారు. కుటుంబ సభ్యులుకూడా అందుకు అంగీకరించారు. అపోలో చికిత్స పొందుతున్న పేషెంట్ కు గుండె అమర్చేందుకు ఏర్పాట్లు చేశారు. నర్సిరెడ్డి శరీరం నుంచి 8 అవయవాలు వైద్యులు సేకరించారు. రెండు కిడ్నీలు, రెండు ఊపిరి తిత్తులు, లివర్, కార్నియా, గుండెను కుటుంబ సభ్యులు దానం చేశారు.

ఎల్బీనగర్ కామినేని నుంచి జూబ్లీ హిల్స్ అపోలో వరకు గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేసేందుకు వైద్యులు మెట్రో రైలు అధికారులను సంప్రదించారు. అందుకు సుముఖత తెలిపిన మెట్రో రైలు అధికారులు మంగళవారం అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశారు. మరో వైపు పోలీసు సిబ్బంది కూడా రెడీగా ఉన్నారు. జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి ఫిల్మ్ నగర్ అపోలో వరకు గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేసేందుకు అడుగడుగునా పోలీసులను ఏర్పాటు చేశారు.