రొమ్ము కాన్యర్స్ కు ఉల్లి,వెల్లుల్లితో చెక్ 

  • Published By: chvmurthy ,Published On : September 25, 2019 / 03:30 AM IST
రొమ్ము కాన్యర్స్ కు ఉల్లి,వెల్లుల్లితో చెక్ 

ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని పెద్దలు  చెపుతుంటారు. రోజు మనం తీసుకునే ఆహారంలో ఉల్లిపాయతో కలిపి చేసిన వివిధ రకాలైన వంటకాలు చేసుకుంటూ ఉంటాం. అలాగే కొన్ని వంటకాల్లో వెల్లుల్లి కూడా వాడుతూ ఉంటాం. పొద్దున్నే పరగడుపున పచ్చి వెల్లుల్లి పాయ ఒకటి నమిలి గ్లాసుడు గోరు వెచ్చని నీరు తాగితే కొన్ని రోగాలు దరిచేరవని  అంటుంటారు. మిగిలిన విషయాల మాటెలా ఉన్నా రొమ్ము కేన్సర్‌ విషయంలో మాత్రం ఉల్లి, వెల్లుల్లి  చేసే మేలు ఎంతో ఉందంటున్నారు శాస్త్రవేత్తలు.  రొమ్ము క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధి రాకుండా ఉండేందుకు ఉల్లితో పాటు వెల్లుల్లి కూడా ఎంతో మేలు చేస్తుందంటున్నారు బఫెలో, ప్యూర్టరికో యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. ప్యూర్టరికోలోని కొంతమందిపై  ఉల్లి,వెల్లులి ప్రయోగించి నిశితంగా పరిశీలించిన తర్వాత తాము ఈ అంచనాకొచ్చామని అధ్యయనంలో పాల్గొన్న శాస్త్రవేత్త గౌరీ దేశాయి తెలిపారు.

ఉల్లి, వెల్లుల్లితో ప్యూర్టరీకన్లు చేసే సోఫ్రిటో అనే వంటకం తయారు చేశారు. సోఫ్రిటో వంటకం తినే మహిళల్లో రొమ్ము కేన్సర్‌ వచ్చే ప్రమాదం 67 శాతం వరకు తక్కువగా ఉన్నట్లు తెలిసిందని చెప్పారు. అసలు  సోఫ్రిటో వంటకం తినని వారితో పోలిస్తే ఒకటి కంటే ఎక్కువ సార్లు తినే మహిళలకు కేన్సర్‌ నుంచి రక్షించేందుకు ఈ రెండు పదార్థాలు ఉపయోగపడతున్నాయని గత అధ్యయనాల ఆధారంగా తాము ఈ పరిశోధన చేశామని వారు చెప్పారు. 

యూరప్, అమెరికాల కంటే ప్యూర్టరికోలో ఉల్లి, వెల్లుల్లి వాడకం ఎక్కువని, ఈ కారణంగా ఇక్కడ రొమ్ము కేన్సర్‌ కేసులు కూడా తక్కువగా ఉన్నాయని వివరించారు. ఉల్లి, వెల్లుల్లిలో ఉండే ఫ్లేవనాల్స్, ఆర్గానోసల్ఫర్‌ పదార్థాలు కేన్సర్‌ నుంచి రక్షణ కల్పిస్తున్నట్లు భావిస్తున్నామని చెప్పారు. రోమ్ము కేన్సర్‌తో బాధపడుతున్న 314 మందితో పాటు లేని 346 మందిపై 2008– 2014 మధ్యకాలంలో ఈ అధ్యయనం జరిపినట్లు తెలిపారు.