బర్డ్ ఫ్లూ భయం : తగ్గిన చికెన్.. పెరిగిన మటన్ రేట్..!

బర్డ్ ఫ్లూ భయం : తగ్గిన చికెన్.. పెరిగిన మటన్ రేట్..!

Chicken Prices Down: బర్డ్‌ఫ్లూ ప్రభావం చికెన్‌పై భారీగా పడింది. సంక్రాంతి సందర్భంగా గతంలో హైదరాబాద్‌లో భారీగా చికెన్ అమ్మకాలు జరిగేవి. కానీ ఈసారి బర్డ్‌ఫ్లూ భయాంతోళనలతో 80శాతం మంది చికెన్‌ కొనుగోలు చేయలేదని హైదరాబాద్ వ్యాపారులు చెబుతున్నారు. కిలో ధర 200 నుంచి 150 రూపాయలకు పడిపోయినా.. చికెన్‌ కొనేందుకు వినియోగదారులు ముందుకు రాలేదు. చికెన్‌ కొనేందుకు జంకుతున్న వారంతా మటన్‌ వైపు మళ్లుతున్నారు.

దీంతో మటన్‌కు డిమాండ్‌ పెరిగింది. వ్యాపారులు ఇప్పటికే ధరలు పెంచేశారు. మటన్‌ ధర కిలో 700 రూపాయలు ఉండగా… పండగ కారణంగా ఏకంగా కిలో 760 నుంచి 800 రూపాయల వరకు పెంచి అమ్మకాలు చేశారు. సాధారణ రోజుల్లో మటన్‌ అమ్మకాలు రోజుకు లక్ష నుంచి రెండు లక్షల కిలోల వరకు ఉంటుంది. కానీ సంక్రాంతి కారణంగా గురువారం ఒక్క హైదరాబాద్‌లోనే దాదాపు మూడున్నర లక్షల కేజీల మటన్‌ అమ్మకాలు జరిగినట్టు వ్యాపారులు చెబుతున్నారు.

అయితే… తెలంగాణలో బర్డ్ ఫ్లూ ఆనవాళ్లు లేవని ప్రభుత్వం చెబుతోంది. పౌల్ట్రీ ఇండస్ట్రీకి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. చికెన్, గుడ్లు తినడం వలన ఎలాంటి నష్టం జరగదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 13వందల రాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లను ఏర్పాటు చేశామన్నారు. నల్గొండ, వరంగల్ , పెద్దపల్లి జిల్లాలలో మృతి చెందిన కోళ్ల శాంపిల్స్‌ను సేకరించి పరీక్షలు చేయించగా నెగెటివ్ రిపోర్ట్ వచ్చినట్లు తలసాని తెలిపారు