వామ్మో కరోనా.. : ఇండియాకు పాకిందా..? కొత్త వైరస్! 

  • Published By: sreehari ,Published On : January 25, 2020 / 01:03 PM IST
వామ్మో కరోనా.. : ఇండియాకు పాకిందా..? కొత్త వైరస్! 

పాముల నుంచి కొత్త వైరస్ మనుషులకు సోకిందో కొత్త వైరస్.. అదే.. కరోనా వైరస్.. గాలిద్వారా వ్యాపించే శ్వాసకోస సమస్యలతో మెల్లగా ఫ్లూ లక్షణాలతో మొదలై.. ప్రాణాలు తీస్తోంది. చైనాలోని వుహాన్ సిటీలో ఈ వైరస్ ప్రభావం అధికంగా కనిపిస్తోంది. ఇప్పటివరకూ వందల సంఖ్యలో ఈ వైరస్ బారిన పడగా, పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు ఈ వైరస్ ఇతర దేశాలను కూడా పాకింది. చైనాలోని వుహాన్ సిటీ ప్రావిన్స్, హుబేయి ప్రావిన్స్ సహా థాయిలాండ్, దక్షిణ కొరియా, తైవాన్, మాకౌ, హాంగ్ కాంగ్, సింగపూర్, వియత్నాం, ఫ్రాన్స్, అమెరికా, సౌదీ దేశాల్లో సైతం ఈ వైరస్ పాకినట్టు అధికారులు హెచ్చరిస్తున్నారు.

చైనాతో పాటు ఇతర దేశాల నుంచి భారత్ కు వచ్చే విమాన ప్రయాణికుల్లో ఎవరికైనా ఈ వైరస్ సోకి ఉంటే.. దాని ప్రభావం తీవ్రమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రపంచ దేశాలను హెచ్చరిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ లో ఈ వైరస్ ప్రభావం ఏమైనా ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. ఇండియా కూడా ఈ వైరస్ పాకిందా అనే వార్తలపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పందించింది.

9వేల మందికి స్ర్కీనింగ్ టెస్టులు :
చైనా నుంచి భారత్ కు వచ్చిన 9వేల 150 మంది ప్రయాణికులకు స్ర్కీనింగ్ టెస్టు నిర్వహించినట్టు వెల్లడించింది. ఇప్పటివకూ ఎలాంటి కరోనా కొత్త వైరస్ కేసులు నమోదు కాలేదని స్పష్టం చేసింది. చైనా నుంచి వచ్చిన ప్రయాణికుల్లో ఎవరికైనా ఆరోగ్యం బాగోలేదంటే వెంటనే దగ్గరలోని ఆస్పత్రికి వెళ్లి రిపోర్టు చేయాలని మంత్రిత్వ శాఖ సూచిస్తోంది. కరోనా వైరస్ ప్రభావం అధికంగా ఉన్న పరిస్థితుల్లో.. చైనా నుంచి ఇండియాకు వచ్చే ప్రతి ఫ్లయిట్ లోని ప్రయాణికులను కరోనా వైరస్ లక్షణాలు ఏమైనా ఉన్నాయంటూ అధికారులు పరీక్షిస్తున్నారు.

ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీ సహా 7 ప్రధాన నగరాలైన ముంబై, కోల్ కత్తా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, కొచ్చి విమానాశ్రయాల్లో విమాన ప్రయాణికులకు కరోనా వైరస్ స్ర్కీనింగ్ టెస్టులు నిర్వహించాలని మంత్రిత్వ శాఖ విమానాశ్రయ అధికారులకు సూచించింది.

పాముల నుంచే వైరస్ వ్యాప్తి :
గబ్బిలాల నుంచి సంక్రమించే ఈ వైరస్.. పాముల్లోకి సంక్రమించి తద్వారా మనుషుల్లోకి చొరబడింది. చైనాలోని క్రాయిట్, కోబ్రా వంటి విషపూరిత పాములు అక్కడి గబ్బిలాలను వేటాడి తినడం ద్వారా గబ్బిలాల నుంచి ఈ కరోనా వైరస్ పాములకు సంక్రమించి ఉండొచ్చునని అధ్యయనాలు చెబుతున్నాయి. వుహాన్ సిటీలో మార్కెట్లలో ఎక్కువగా చేపలు, ఇతర జంతువుల మాంసంతో పాటు పాముల మాంసాన్ని కూడా అమ్ముతారు.

ఈ పాముల మాంసాన్ని తినడం ద్వారా వాటిలోని వైరస్ మనుషుల్లోకి పాకి ఉండొచ్చునని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారులు అనుమానిస్తున్నారు. దీనిపై పూర్తి స్థాయిలో పరిశోధనలు, ప్రయోగాలు జరిపి అసలు వైరస్ మూలం ఎక్కడో ఉందో తెలుసుకునే ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు.

ముగ్గురు భారతీయ విద్యార్థులకు కరోనా లక్షణాలు :
చైనాలోని వుహాన్ సిటీలో చదువుతున్న ముగ్గురు భారతీయ విద్యార్థులకు కరోనా వైరస్ లక్షణాలు ఉన్నట్టు ఢిల్లీలోని ఎయిమ్స్ వైద్యులు అనుమానిస్తున్నారు. ఈ ముగ్గురు ఇటీవలే చదువు నిమిత్తం చైనాకు వెళ్లారు. చైనాలోని వుహాన్ యూనివర్శిటీలో దాదాపు 23వేల మంది భారతీయ విద్యార్థులు చదువుతున్నారు.

ఇటీవలే చైనా నుంచి ఇద్దరు వ్యక్తులు ముంబైకి రాగా వారిద్దరికి కరోనా వైరస్ లక్షణాలతో కస్తూర్భా ఆస్పత్రిలో చేరారు. దీంతో ముంబై నగరంలో కరోనా వైరస్ మరింత విస్తరించే అవకాశం ఉండటంతో ముందు జాగ్రత్త చర్యగా అధికారులు చర్యలు చేపడుతున్నారు. కొచ్చికి చెందిన మరో వ్యక్తి కూడా కాలామస్సేరీ మెడికల్ కాలేజీలో చేరాడు. ఇటీవలే అతడు చైనాకు వెళ్లి వచ్చాడని, అయితే ఇతడికి కూడా అలాంటి లక్షణాలే ఉండటంతో కరోనా వైరస్ సోకిందా? అనే అనుమానంతో వైద్యులు అతడిని ప్రత్యేక వార్డులో ఉంచి పరీక్షలు నిర్వహిస్తున్నారు. 
Read Also : ‘కరోనా’ కాటేస్తుంది జాగ్రత్త :  విదేశాలకు వెళ్తున్నారా? వాయిదా వేసుకోండి!