కోవిడ్ నుంచి కోలుకున్నా వాసన తెలియడం లేదా?.. 5 నెలల సమయం పట్టొచ్చు!

కోవిడ్ నుంచి కోలుకున్నా వాసన తెలియడం లేదా?.. 5 నెలల సమయం పట్టొచ్చు!

5 Months for Sense of Smell to Return : ప్రపంచవ్యాప్తంగా చాలామంది కరోనా బాధితుల్లో వైరస్ నుంచి కోలుకున్నాక కూడా వారిలో వాసన కోల్పోయిన భావన అలానే ఉంటోంది. కోవిడ్ నుంచి కోలుకున్న వారిలో ఈ తరహా లక్షణం కనిపిస్తోంది. దీనికి సంబంధించి ఇటీవల కొత్త అధ్యయనం నిర్వహించారు. అందులో కోవిడ్ తో వాసన కోల్పోయిన భావన తిరిగి రావడానికి 5 నెలలపైనే పట్టొచ్చునని తేలింది. సాధారణంగా కరోనా లక్షణాల్లో ఎక్కువమందికి వాసన కోల్పోవడంతో పాటు రుచి కూడా కోల్పోతారు. ఏ ఆహారం తిన్నా రుచి తెలియదు. ఈ పరిస్థితి చాలామందిలో కరోనా తగ్గిన తర్వాత కూడా కొనసాగినట్టు గుర్తించారు. స్వల్ప కరోనా కేసుల్లో కూడా ఈ తరహా లక్షణాలు కనిపించినట్టు నిపుణులు చెబుతున్నారు.

కోలుకున్నాక తగ్గని కరోనా లక్షణాలు :
న్యూరాలజీ అమెరికన్ అకాడమీలో ఈ అధ్యయనాన్ని ప్రచురించారు. కరోనా నుంచి కోలుకుంటున్న అనేక మంది ఇప్పటికీ 5 నెలల తరువాత కూడా ఇదే భావనలను అనుభవించారని కనుగొన్నారు. కరోనా సోకిన 813 మంది హెల్త్ కేర్ వర్కర్లు అధ్యయనంలో పాల్గొనగా.. వారిలో 580 మందిలో వైరస్ ప్రారంభంలో వాసన, రుచి కోల్పోయారు. ఈ గ్రూపులో 300 మందిలో 51శాతం వరకు 5 నెలల వరకు తిరిగి వాసన భావనను పొందలేకపోయారు. 527 మందిలో రుచి కోల్పోగా, 200 మందిలో 38శాతం వరకు 5 నెలల తర్వాత కూడా రుచిని పొందలేదని నిపుణులు పేర్కొన్నారు.

బాధితుల్లో 10మందిలో 8 ఎనిమిది మాత్రం కోల్పోయిన వాసన భావనను తిరిగి పొందినట్టు నిర్ధారించారు. తాత్కాలికంగా వాసన, రుచి కోల్పోవడాన్ని అనోస్మియా అని పిలుస్తారు. ఇదొక న్యూరోలాజికల్ లక్షణం.. కరోనా వచ్చినవారిలో వాసన కోల్పోవడానికి కారణం వారిలోని నరాలు దెబ్బతింటాయి. అవి తిరిగి నయం కావడానికి కొన్ని నెలల సమయం పడుతుంది. అందుకే వాసన కోల్పోయిన భావన తిరిగి పొందడానికి ఎక్కువ సమయం పట్టొచ్చునని అంటున్నారు. పూర్తిగా కోలుకోవడానికి కొన్నిసార్లు నెలలు లేదా 1 నుంచి 2 సంవత్సరాల సమయం కూడా పడుతుందని నిపుణులు చెబుతున్నారు.