కేరళలో రెండో కరోనా కేసు : అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం

  • Published By: chvmurthy ,Published On : February 3, 2020 / 03:04 AM IST
కేరళలో రెండో కరోనా కేసు : అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం

చైనాలోని వుహాన్‌లో మొదలైన కరోనా వైరస్‌ ప్రపంచ దేశాలకు పాకింది. అనేక దేశాల్లో ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. చైనాలో రోజురోజుకి వ్యాధిగ్రస్తులు పెరిగిపోతున్నారు. చైనాలో ఇప్పటి వరకు 361 మంది ఈ వ్యాధి బారినపడి మరణించినట్లు   ANI  వార్తా సంస్ధ తెలిపింది.   మరో 16 వేలమంది వ్యాధి సోకగా వారిలో 2 వేల మంది  పరిస్గితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.  చైనా వెలుపల ఫిలిప్పీన్స్‌లో తొలి మరణం సంభవించింది. వుహాన్‌ నుంచి∙ఫిలిప్పీన్స్‌కి వచ్చిన 44 ఏళ్ల చైనీయుడు ఈ వైరస్‌ కారణంగా మృతి చెందినట్టు ఫిలిప్పీన్స్‌ ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.   ఇక భారత్‌లోని కేరళలో రెండో కరోనా కేసు నమోదు కావడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా ఇప్పుడు 25 దేశాలకు విస్తరించింది.
 

కేరళలో మరో కరోనా కేసు
ఇటీవల చైనా నుంచి కేరళ వచ్చిన విద్యార్థికి కరోనా వైరస్‌ సోకినట్టు అధికారులు వెల్లడించారు. అతని బ్లడ్ శాంపిల్స్ పరీక్షల కోసం పంపారు. పుణేలోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ (ఎన్‌ఐవీ) నుంచి వచ్చే నివేదిక కోసం ఎదురు చూస్తున్నారు. వుహాన్‌ యూనివర్సిటీ నుంచి కేరళకు వచ్చిన ఆ విద్యార్థికి కరోనా వైరస్‌ సోకినట్టు అనుమానం రావడంతో వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. ఆ విద్యార్థి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆరోగ్య శాఖ మంత్రి కె.కె. శైలజ వెల్లడించారు. మరోవైపు వుహాన్‌ నుంచి వచ్చిన 323 మంది భారతీయులు, ఏడుగురు మాల్దీవుల వాసులకు  ఆర్మీ, ఐటీబీపీ ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆసుపత్రుల్లో ఉంచి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.  
 

చైనా ప్రయాణికులకు భారత్‌ ఇ–వీసా రద్దు
చైనా నుంచి వచ్చే ప్రయాణికులు, ఆ దేశంలోని ఇతర దేశస్తులకు ఇ–వీసా సౌకర్యాన్ని భారత్‌ తాత్కాలికంగా రద్దు చేసింది. ప్రత్యేక ఆరోగ్య పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు బీజింగ్‌లో భారత రాయబార కార్యాలయం ప్రకటించింది. ఇక అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ వంటి దేశాలు చైనా మీదుగా ప్రయాణించే వారిని కూడా తమ దేశంలోకి రానివ్వకూడదని నిర్ణయం తీసుకున్నారు.
 

అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం 
కరోనా వైరస్‌ ప్రపంచ దేశాలను వణకిస్తున్న నేపథ్యంలో అన్ని దేశాలు అప్రమత్తమయ్యాయి. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రం కూడా నగరంలోని గాంధీ, ఫీవర్‌, చెస్ట్‌ ఆస్పత్రుల్లో ప్రత్యేక ఐసొలేషన్‌ వార్డులను ఏర్పాటు చేసింది. చైనా నుంచి రాష్ట్రానికి వస్తున్న వారికి ఎయిర్‌పోర్టులోనే పరీక్షలు నిర్వహించి అనుమానితులను ఆయా ఆస్పత్రుల్లో చేర్చుతున్నారు. గత నెల 25 నుంచి ఫిబ్రవరి 2వతేదీ వరకు ఫీవర్‌ ఆస్పత్రికి 18మంది అనుమానితులు పరీక్షలు చేయించుకున్నారు. ఇటీవల చైనా నుంచి వచ్చినవారు కరోనా వైరస్‌ నేపథ్యంలో అనుమానంతో మాత్రమే నిర్దారణ పరీక్షల కోసం ఫీవర్‌ ఆస్పత్రికి వస్తున్నారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. 
 

ఆస్పత్రిలోని ఐసోలేషన్‌ వార్డులో కరోనా అనుమానిత కేసులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని అధికారులు పేర్కోన్నారు. మాస్క్‌లతోపాటు డిస్పోజబుల్‌ డ్రస్సులు కూడా అందుబాటులో ఉంచామన్నారు. కరోనా వైరస్‌ గాలి ద్వారా ఒకరి నుంచి మరొకరికి త్వరగా వ్యాపిస్తుందని, ఈకారణంగా వైద్య సిబ్బందిని తప్ప ఇతరులెవరిని ఆ వార్డులోకి అనుమతించడం లేదని అస్పత్రి అధికారులు చెప్పతున్నారు.