కరోనా ఏయే అవయవాలపై ఎక్కువగా దాడి చేస్తుందంటే?

  • Published By: sreehari ,Published On : April 25, 2020 / 01:26 AM IST
కరోనా ఏయే అవయవాలపై ఎక్కువగా దాడి చేస్తుందంటే?

కరోనా వైరస్ చాప కింద నీరులా చేరుతోంది. తెలియకుండానే మనిషి ప్రాణాలను హరిస్తోంది. శరీరంలోని ప్రధాన అవయవాలపై ముప్పేట దాడి చేస్తోంది. ఒక్క ఊపిరితిత్తులపైనే కాదు.. శరీరంలో పలు అవయవాలపై కరోనా ప్రభావం ప్రమాదకర స్థాయిలో ఉంటుంది. ముందుగా కళ్లు, గొంతు, గుండె, కాలేయం, మూత్రపిండాలు (కిడ్నీలు), మెదడు.. ప్రతి అవయవంపై కరోనా దాడి చేస్తుంది. ఈ విషయాన్ని లండన్ కింగ్స్ కాలేజీ ఆస్పత్రికి చెందిన ప్రొఫెసర్ అజయ్ షా అంటున్నారు. కొంతమంది కరోనా రోగులను పరీక్షించిన ఆయన ఈ భయానక అంశాలను వెల్లడించారు. లక్షణాలు కనిపించని రోగుల నుంచి వ్యాధి నుంచి కోలుకున్నాక మళ్లీ తిరగబెట్టే సమయంలోనూ కరోనా ఒక్కసారిగా అవయవాలను లక్ష్యంగా ముప్పేట దాడి చేస్తోందన్నారు. అసలు.. కరోనా వైరస్ ఏయే మార్గాల్లో మనిషి శరీరంలోకి ప్రవేశిస్తుంది.. ఏ అవయవాలను లక్ష్యంగా చేసుకుని దెబ్బతిస్తుందో తెలుసుకుందాం..

ముక్కు నుంచి గొంతులోకి కరోనా వైరస్ ఈజీగా ప్రవేశించగలదు. ముక్కు ద్వారనే వైరస్ గొంతు లోపలికి వెళ్తుంది. అక్కడి నుంచి ఊపిరితిత్తుల్లోకి వెళ్లొచ్చు. ముక్కు లోపలికి వెళ్లగానే నాసికా రంధ్రాల్లో చేరుతుంది. అప్పుడే రోగి వాసన గ్రహించలేని స్థితికి చేరుకుంటాడు. ఆ తర్వాత మెల్లగా ముక్కు నుంచి గొంతులోకి ప్రవేశిస్తుంది. అక్కడ ఉండే ACE2 ప్రొటీన్ సమృద్ధిగా దొరకుతుంది. వైరస్ రెచ్చిపోతుంది. తన స్పైక్ ల సాయంతో ప్రోటీన్ గ్రహిస్తుంది. కణాల్లోకి చేరి పునరుత్పత్తి మొదలుపెడుతుంది. అప్పుడు రోగిలో వ్యాధి లక్షణాలు ఉండకపోవచ్చు. కానీ, ఇతరులకు వైరస్ వ్యాప్తి చేయగలదు. ఇదే కీలకమైన దశగా చెప్పవచ్చు. వైరస్ గొంతులోకి ప్రవేశించిన వెంటనే శరీరంలోని వ్యాధి నిరోధక శక్తి స్పందిస్తుంది. లేదంటే వైరస్ నేరుగా ఊపిరితిత్తుల్లోకి వెళ్లిపోతుంది.

* ఊపిరితిత్తుల్లోకి చేరగానే వైరస్ విజృంభిస్తుంది. అసలు ప్రాణాంతకమైన సమస్య ఇక్కడే.. మనిషి ప్రాణాలను తీసే దశగా చెప్పవచ్చు. ఊపిరితిత్తుల్లో లక్షల సంఖ్యలో శ్వాసకోశాలను ఆక్రమించేస్తుంది. న్యుమోనైటిస్ కు దారితీస్తుంది. ఊపిరితిత్తుల కండరాల్లో వాపు వస్తుంది. రోగి శ్వాస తీసుకోలేడు. ఊపిరితిత్తుల్లోకి నీరు చేరుతుంది. అక్యూట్ రెస్పిరేటరి డిస్ట్రెస్ సిండ్రోమ్ కనిపిస్తుంది. రక్తంలో ప్రాణవాయువు ప్రమాదకర స్థాయికి తగ్గిపోతుంది.

* వెంటిలేటర్లతో రోగి ప్రాణాలను కాపాడొచ్చు. వైరస్ వ్యాప్తిని ఆపలేమంటున్నారు. వ్యాధి నిరోధక కణాలు వైరస్‌ను ఎదుర్కొవాలి. ఒక్కోసారి రోగ నిరోధక కణాలు అదుపుతప్పుతాయి. శరీర భాగాలపై దాడిచేసేస్తాయి. గుండె వేగంగా కొట్టుకుంటుంది. రక్తనాళాల్లో వాపు వస్తుంది. 20 శాతం రోగుల్లో కిడ్నీలు దెబ్బతింటున్నాయి. ఐసీయూల్లో చనిపోయేవారు సైటోకైన్ స్ట్రామ్తో, పలు అవయవాలు దెబ్బతినడం కారణంగా చనిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది.

* గుండెపై ఒత్తిడి పెంచేస్తుంది.. ఈ వైరస్ గుండె, రక్తనాళాలపై ఎలా దాడి చేస్తోందనేది తెలియడం లేదు.రక్తనాళాల గోడలపై దాడి చేస్తోంది. గుండె జబ్బులకు దారితీస్తోంది. చైనాలోని వుహాన్లో 416 మంది కరోనా బాధితుల్లోనూ 20 శాతం మంది గుండె సమస్యలతో మరణించినట్లు జామా కార్డియాలజీ జర్నల్ పేర్కొంది. కొవిడ్ తీవ్ర స్థాయిలో ఉన్న రోగుల్లో రక్తనాళాల్లో వాపు ఎక్కువగా కనిపిస్తోందని వైద్యులు అంటున్నారు.

* డయాబెటిస్, గుండెజబ్బులు ఉన్న వారికి ప్రాణాంతకమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కాలేయం కూడా వైరస్ దెబ్బతిస్తుంది. ఆస్పత్రిలో చేరిన రోగుల కాలేయాల్లో ఎంజైమ్స్ శాతం ఎక్కువగా ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. కాలేయం పనితీరు దెబ్బతింటోంది. అసలు ఈ పరిస్థితికి కారణం ఔషధాలా? లేక వ్యాధినిరోధక శక్తి అతిగా స్పందించడమా? అనేది అంతుపట్టడం లేదు. దీనిపై పరిశోధనలు జరుపుతున్నారు.

* కరోనా వైరస్ వ్యాధి ముదిరితే మాత్రం కిడ్నీలకు ముప్పు తీవ్రంగా ఉంటుంది. వుహాన్ పరిశోధనలో 85 మందిపై పరిశోధన చేయగా 27శాతం రోగుల కిడ్నీలు దెబ్బతిన్నట్లు గుర్తించారు. కిడ్నీల్లో వైరస్ అనుకూల రిసెప్టర్లు ఎక్కువగా ఉండటమే కారణమా? అనేది తెలియడం లేదు. బ్లడ్ ప్రెజర్ పెరగడం కారణంగా దెబ్బతింటున్నాయా? ఇంకా తేలలేదని అంటున్నారు నిపుణులు.

* కరోనా వైరస్ మెదడుపై కూడా తీవ్ర ప్రభావం చూపిస్తుందని ఇటీవలే గుర్తించారు. మూర్ఛ, తలనొప్పి వంటి లక్షణాలు బయటపడుతున్నాయి. జపాన్ దేశంలో ఒక వ్యక్తిలో మెదడువాపు వ్యాధి లక్షణాలు కనిపించినట్టు అక్కడి పరిశోధకులు గుర్తించారు. వ్యక్తి మెదడులోని ద్రవాల్లోనూ కరోనా వైరస్ ఉన్నట్టు నిర్ధారించారు. కరోనా వైరస్ కేంద్రనాడీ వ్యవస్థలోకి కూడా ప్రవేశిస్తుందనే కోణంలో పరిశోధనలు చేస్తున్నారు.