Covid 19 : యువ‌త‌ను టార్గెట్ చేసిన క‌రోనా సెకండ్ వేవ్.. కారణం ఏంటి? తప్పు ఎవరిది?

కరోనా సెకండ్ వేవ్ యువతను టార్గెట్ చేసిందా? మధ్య వయసులోనే ప్రాణాలు బలి తీసుకుంటోందా? ఇంటిని పోషించాల్సిన వారు కరోనా కాటుకు బలవుతున్నారా? ఆదుకునే వారు లేక కుటుంబాలు విచ్చిన్నం అవుతున్నాయా? అంటే, అవును అనే సమాధానం వినిపిస్తుంది. అసలు కరోనా యువతనే ఎందుకు టార్గెట్ చేసింది?

Covid 19 : యువ‌త‌ను టార్గెట్ చేసిన క‌రోనా సెకండ్ వేవ్.. కారణం ఏంటి? తప్పు ఎవరిది?

Covid 19 Second Wave

Covid – 19 Second Wave : కరోనా సెకండ్ వేవ్ యువతను టార్గెట్ చేసిందా? మధ్య వయసులోనే ప్రాణాలు బలి తీసుకుంటోందా? ఇంటిని పోషించాల్సిన వారు కరోనా కాటుకు బలవుతున్నారా? ఆదుకునే వారు లేక కుటుంబాలు విచ్చిన్నం అవుతున్నాయా? అంటే, అవును అనే సమాధానం వినిపిస్తుంది. అసలు కరోనా యువతనే ఎందుకు టార్గెట్ చేసింది?

ఫస్ట్ వేవ్ లో వృద్ధులపై ప్రతాపం చూపి కరోనా, సెకండ్ వేవ్ లో యువత, నడి వయసు వారి ప్రాణాలను హరిస్తోంది. కుటుంబానికి, దేశానికి వెన్నుముక అయిన యువతను బలి తీసుకుంటోంది. దీంతో మృతుల కుటుంబాలు చిన్నాబిన్నమై రోడ్డున పడుతున్నాయి. పాజిటివ్ కేసుల్లో 18 నుంచి 35ఏళ్ల లోపు వారే ఎక్కువగా ఉన్నారని చూపిస్తున్నాయి నివేదికలు. మొత్తం కేసుల్లో వీళ్లే 50 నుంచి 60శాతం ఉంటున్నారని చెబుతున్నారు. వైరస్ సోకిన వారిలో 10శాతం మంది శ్వాస సమస్యలతో ఇబ్బంది పడి ఆసుపత్రులకు సైతం వెళ్లాల్సి వస్తోందని వైద్య వర్గాలు చెబుతున్నాయి.

కరోనా యువతనే టార్గెట్ చేయడానికి వారి నిర్లక్ష్యమే కారణం అంటున్నారు డాక్టర్లు. శ్రీకాకుళం జిల్లాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. సెకండ్ వేవ్ లో దాదాపు 40వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. గాలి ద్వారా వైరస్ వ్యాప్తి పెరగడంతో భారీగా కేసులు నమోదవుతున్నాయి. మృతుల సంఖ్య పెరుగుతోంది. సెకండ్ వేవ్ మొదలైనప్పటి నుంచి 85మంది యువత వైరస్ తో మరణించారు. చాలామంది మార్కెట్లు, షాపుల్లో కోవిడ్ నిబంధనలు పాటించడం లేదు. గ్రామాలు, పల్లెల్లో గుంపులు గుంపులుగా తిరుగుతున్నారు. ఖాళీ దొరికితే కూర్చుని బాతాకానీ కొడుతున్నారు. ఇంకా లేదంటే సరదాగా క్రికెట్ ఆడుతున్నారు. ఎక్కడా నిబంధనలు పాటించడం లేదు. ఇదే.. యువత ఎక్కువగా వైరస్ బారిన పడటానికి కారణం అంటున్నారు వైద్య నిపుణులు. వీళ్లు అవసరం లేకుండా బయట తిరిగి, నిబంధనలు పాటిస్తూ ఇంట్లో ఉంటున్న పెద్దలకు వైరస్ అంటిస్తున్నారని చెబుతున్నారు.

యువత, 45ఏళ్ల లోపు వారికి కరోనా అధికంగా రావడానికి వ్యాక్సినేషన్ కూడా కారణంగా కనిపిస్తోంది. కేంద్రం నిబంధనలు మేరకు కేవలం 45ఏళ్లు దాటిన వారికే వ్యాక్సిన్ ఇస్తున్నారు. దీంతో వారిలో కొంతవరకు కరోనా తగ్గుముఖం పట్టింది. 45 సంవత్సరాల లోపు వారికి మాత్రం వ్యాక్సిన్ ఆశించిన స్థాయిలో అమలు కాకపోవడంతో వారు అధికంగా కరోనా బారిన పడుతున్నట్లుగా తెలుస్తోంది. బంగారు భవిష్యత్తు ఉన్న యువత కరోనా మహమ్మారి బారిన పడకుండా స్వీయ నియంత్రణ పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.