జ్వరం ఉందా? అయితే కరోనా టీకా వేయించుకోవద్దు!

జ్వరం ఉందా? అయితే కరోనా టీకా వేయించుకోవద్దు!

Covid-19 vaccine should not given during fever : కరోనా వ్యాక్సిన్ వచ్చేసింది.. టీకాలు వేస్తున్నారు కదా అని తొందరపడకండి.. ముందుగా మీ ఆరోగ్య పరిస్థితి ఏంటో ఓసారి చెక్ చేసుకోండి.. ఆరోగ్యంగా ఉన్నారో? ఏదైనా అనారోగ్యంతో బాధపడుతున్నారో తెలుసుకోండి. జ్వరంగా ఉన్నప్పుడు మాత్రం కరోనా టీకాను వేయించుకోవద్దు అంటున్నారు వైద్యాధికారులు.. వైద్య, ఆరోగ్య శాఖ కూడా అదే చెబుతోంది. టీకా వేయించుకునే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో సూచిస్తోంది.

ప్రధానంగా వైద్య సిబ్బంది చేపట్టాల్సిన చర్యలపై కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. వచ్చే కొత్త ఏడాదిలో 2021లో దేశవ్యాప్తంగా కరోనా టీకా వేసేందుకు సన్నాహాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే కొన్ని డ్రగ్ కంపెనీలు దాదాపు 10 కోట్ల డోసులను రెడీ చేశాయి. వచ్చే నెలాఖరులోగా టీకాలను నిర్దేశిత ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లను ముమ్మరం చేస్తున్నాయి. టీకా వేసే సమయంలో వైద్య సిబ్బంది.. వేయించుకునే వారి వివరాలు సేకరించాలని ప్రభుత్వం సూచించింది. టీకా తీసుకునే వ్యక్తులు కూడా ముందే తమకున్న ఆరోగ్య సమస్యలను వైద్య సిబ్బందికి తెలియజేయాలని సూచించింది.

జ్వరముందా? అలర్జీలు, రక్తస్రావం వంటి సమస్యలు ఉంటే వెంటనే వైద్య సిబ్బందికి తెలియజేయాలి. అనారోగ్య సమస్యలకు ముందు నుంచే ఏమైనా మందులు వాడుతున్నారో చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే.. ఇలాంటి వారిలో మందుల వల్ల రోగ నిరోధక శక్తిపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది.. అలాగే మహిళల్లో ఎవరైనా గర్భిణీయా? ప్రెగ్నెన్సీకి ప్లాన్‌ చేస్తున్నారా? ఇంతకుముందు ఏదైనా వ్యాక్సిన్‌ తీసుకున్నారా? వంటి పూర్తి వివరాలను సేకరించాలని వైద్య, ఆరోగ్య శాఖ సూచించింది.

ఇలాంటి వారికి వ్యాక్సిన్ తాత్కాలికంగా నిలిపివేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒకవేళ వారిలో ఎవరికైనా జ్వరం ఉన్నా కూడా టీకా వేయరాదు.. జ్వరం పూర్తిగా తగ్గి కోలుకున్నాకే టీకా అందించాల్సి ఉంటుంది. అలర్జీలు ఉన్నా కూడా తగ్గాక మాత్రమే టీకా వేయాలని వైద్యులు సూచిస్తున్నారు. మొదటి డోస్ లో ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తే.. మాత్రం రెండో డోస్ ఇవ్వరాదని సూచించింది. వ్యాక్సిన్‌పై ఎలాంటి భయాందోళనలు వద్దని ప్రభుత్వం భరోసా ఇస్తోంది. అన్ని రకాల భద్రతా ప్రమాణాలు పాటించి వ్యాక్సినేషన్‌కు అనుమతినిచ్చినట్టు మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది.