డోంట్ కేర్.. కరోనా కోరలు విరిచేస్తాం.. క్యూబా కంట్రీ డాక్టర్ల సవాల్!

  • Published By: sreehari ,Published On : April 4, 2020 / 10:37 AM IST
డోంట్ కేర్.. కరోనా కోరలు విరిచేస్తాం.. క్యూబా కంట్రీ డాక్టర్ల సవాల్!

కరోనా ప్రళయానికి ప్రపంచ దేశాలు ఉక్కిరిబిక్కిరి అవుతుంటే.. దానికి ఎదురెళ్లుతోంది క్యూబా కంట్రీ. వైరస్ కోరలు విరిచేస్తామని.. రొమ్ము విరుచుకుని సవాల్ విసురుతున్నారు ఆ దేశ డాక్టర్లు. కోవిడ్-19 వైరస్‌ను మాత్రమే కాదు.. అంతకుమించి వ్యాధులొచ్చినా ఫికర్ నై అని బాధిత దేశాలకు భరోసానిస్తున్నారు. ఇంతకీ వైద్యుల ధీమా వెనుకున్న సత్తా ఏంటి..? క్లిష్ట సమయాల్లో వాళ్లందించే వైద్య సేవలేంటి..?

ఎంఎస్‌ బ్రాయిమార్‌ నౌక ఇది.. బ్రిటన్ నుంచి 682 మంది ప్రయాణికులతో బయలుదేరింది. ఇందులో ప్రయాణిస్తున్న కొంతమంది ప్యాసింజర్లలో కరోనా లక్షణాలు కనిపించాయి. కరీబియన్ దీవుల నుంచి వచ్చిన ఈ నౌకను నిలిపేందుకు ఏ దేశమూ అంగీకరించలేదు. కరోనా కరాళనృత్యం చేస్తున్న వేళ.. కొత్త తలనొప్పులెందుకని తిప్పి పంపాయి. కానీ క్యూబా మాత్రం అలా చేయలేదు. ధైర్యంగా ముందుకొచ్చింది.. మేమున్నామని భరోసానిచ్చింది. మరియల్ రేవులో ఓడకు లంగరు వేసి.. బాధితులకు ప్రాణం లేసొచ్చేలా చేసింది. 

కరోనా బాధితులు తమ దగ్గరికి వస్తే ఎలా అని క్యూబా కంగారుపడలేదు.. వైరస్ వ్యాప్తితో పరిస్థితి అల్లకల్లోలం అవుతుందని వెనకడుగు వేయలేదు. ముందుగా నౌకలో కరోనా సోకిన వాళ్లందర్ని వేర్వేరు ఆస్పత్రులకు తరలించింది. యుద్ధప్రాతిపదికన ట్రీట్‌మెంట్‌ కూడా మొదలెట్టింది. క్యూబా తీసుకున్న ఈ నిర్ణయం ఒక రకంగా సాహసోపేతమనే చెప్పాలి. కానీ వాళ్లకది చాలా చిన్న విషయం. వైద్య రంగానికే సవాల్‌ విసిరిన ఎన్నో రోగాలను నయం చేసి.. దటీజ్ క్యూబా అనిపించుకుంది. ఇప్పుడు కూడా కోరలు చాస్తున్న వైరస్‌పై సమరానికి సిద్ధమని సంకేతాలు పంపింది. 

హైదరాబాద్‌ కంటే తక్కువ జనాభా :
క్యూబా.. చాలా చిన్న దేశం. హైదరాబాద్‌ కంటే తక్కువ జనాభా ఉన్న దేశం. కేవలం కోటి మంది జనాభా మాత్రమే ఉంటుంది. కానీ ప్రపంచంలోనే డాక్టర్ల కార్ఖానాగా వెలుగొందుతోంది. వరల్డ్‌లోనే అత్యంత నాణ్యమైన వైద్యం ప్రజలందరికీ అందిస్తోంది. క్యూబాలో ఇప్పటిదాకా మూడు వందలలోపే కరోనా కేసులు నమోదు కాగా, ఆరుగురు
మాత్రమే చనిపోయారు. క్యూబాకు కూతవేటు దూరంలో ఉన్న అమెరికాలో మాత్రం చావు కేకలు వినిపిస్తున్నాయి. పాజిటివ్ కేసుల సంఖ్య రెండున్నర లక్షలు దాటితే.. మరణాలు ఏడువేలకు చేరువలో ఉన్నాయి. అగ్రరాజ్యాన్ని కొత్త వైరస్ కకావికలం చేస్తుంటే క్యూబా మాత్రం కరోనా కట్టడికి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టి ఆదర్శంగా నిలుస్తోంది. 

దేశంలోని వాళ్లందరికీ వైద్య పరీక్షలు :
వైరస్‌కు ముకుతాడు వేసేందుకు దేశంలోని పౌర, సైనిక ఆసుపత్రులు అన్నింటిలోనూ కరోనా రోగులకు చికిత్స అందించడానికి క్యూబా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. కొత్త వైరస్‌ ధాటికి అభివృద్ధి చెందిన దేశాలన్ని అతలాకుతలం అవుతుంటే.. క్యూబా మాత్రం కూల్‌గా చర్యలు చేపట్టింది.

దేశంలో ఉన్న వాళ్లందరికి పరీక్షలు నిర్వహించింది. వైద్య బృందాలను ఏర్పాటు చేసి స్వయంగా ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్లి టెస్ట్‌లు నిర్వహించింది. పాజిటివ్ అని తేలితే వారిని వెంటనే ఆస్పత్రులకు షిప్ట్ చేసింది. కరోనా కట్టడిలో ఇక్కడే మొదటి విజయం సాధించింది క్యూబా. క్లిష్ట పరిస్థితుల్లో ముందుగా ఏం చేయాలో, ఎలా వ్యవహరించాలో బాధిత దేశాలకు దిశానిర్దేశం చేసింది.

ప్రతి వెయ్యి మందికి 8 మంది డాక్టర్లు :
కొన్ని దశాబ్దాల కిందట క్యూబాలో ప్రబలిన అంటువ్యాధికి అనేకమంది బలయ్యారు. ఏ దేశమూ దీనికి వైద్య సాయం అందివ్వలేదు. దీంతో క్యూబా కమ్యూనిస్టు దిగ్గజం ఫిడెల్‌ క్యాస్ట్రో తమ దేశంలోనే పెద్దఎత్తున వైద్యుల్ని తయారుచేయాలని నిశ్చయించారు. దేశాన్ని డాక్టర్ల ఉత్పత్తి ఫ్యాక్టరీగా మలిచారు. క్యూబాలో ప్రతి 1000 మందికి సగటున 8 మంది డాక్టర్లున్నారంటే వైద్య రంగానికి ఈ దేశం ఎంత ప్రాధాన్యం ఇస్తుందో అర్థం చేసుకోవచ్చు. 

క్యూబా ప్రజలపై విప్లవ యోధులైన చేగువేరా, ఫిడెల్ క్యాస్ట్రోల ప్రభావం ఎక్కువ. ముఖ్యంగా గొప్ప వైద్యుడు, మానవతావాది అయిన చేగువేరా స్ఫూర్తి ఇక్కడి డాక్టర్లలో కనిపిస్తుంది. దేశ సేవ అంటే మనుషులకు సేవ చేయడమేననేది క్యూబా సోషలిస్టు ప్రభుత్వం నమ్మే సిద్ధాంతం. అందుకే.. ప్రపంచం మొత్తాన్నీ కరోనా అల్లకల్లోలం చేస్తున్న వేళ.. క్యూబా అధ్యక్షుడిగా క్యాస్ట్రో మాట్లాడిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. 

క్యాస్ట్రో దూరదృష్టితో చెప్పినట్టుగానే క్యూబా డాక్టర్ల డెన్‌గా తయారైంది. యుద్ధం చేసి ప్రాణాలు తీసే బాంబులను తయారు చేయబోమన్న క్యాస్ట్రో.. మనుషులకు ప్రాణం పోసే డాక్టర్లను తమ దేశం తయారు చేస్తుందన్నారు. కరోనా కారణంగా ఆరోగ్యం అనేది గాలిలో దీపమైపోయిన వేళ.. భవిష్యత్తు మొత్తం చీకటిగా కనిపిస్తున్న ప్రస్తుత సమయంలో
క్యూబా కళ్ల ముందు కనిపించే కాంతి రేఖగా మారింది. 

77దేశాల్లో పనిచేస్తున్న 37వేల మంది డాక్టర్లు :
ప్రపంచంలో ఎక్కడ విపత్తులు సంభవించినా.. మానవతా వాదానికి ప్రాధాన్యమిచ్చే క్యూబా పీడిత ప్రజల్ని కాపాడేందుకు ఎప్పుడూ ముందే ఉంటుంది. 2010లో హైతీ భూకంప బాధితులకు.. 2014లో ఎబోలా కోరల్లో చిక్కుకున్న పశ్చిమ ఆఫ్రికా ప్రజలకు అండగా నిలిచింది. జార్జిబుష్‌ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అమెరికాపై కత్రినా హరికేన్‌ విరుచుకుపడింది. అప్పుడు ఆపన్నహస్తం అందించేందుకు క్యూబా పెద్ద మనసుతో ముందుకొచ్చినా.. చిన్నతనంగా భావించిన అగ్రరాజ్యపు అధికారులు అందుకు నిరాకరించారు.  

వైద్య సదుపాయాల్లేక ఇబ్బందిపడుతున్న బ్రెజిల్‌లో క్యూబా వైద్యులు ఎన్నో ఏళ్లుగా స్వచ్ఛందంగా సేవలందిస్తున్నారు. 1960ల నుంచి క్యూబా డాక్టర్లు, స్పెషలిస్టులు డజన్లకొద్దీ వేర్వేరు దేశాల్లో సేవలు అందిస్తున్నారు. దాదాపు 77 దేశాల్లో 37,000 మంది క్యూబా డాక్టర్లు పనిచేస్తున్నారంటే వాళ్ల కమిట్‌మెంట్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. 

40శాతానికి పైగా సేవల నుంచి ఆదాయం :
సేవల ద్వారానే క్యూబాకు పెద్ద ఎత్తున ఆదాయం సమకూరుతోంది. విదేశాల నుంచి వచ్చే ఆదాయాల్లో 40శాతానికి పైగా వేద్య సేవల నుంచి వస్తున్నవే. డిసెంబర్‌లో చిగురుటాకులా వణికిపోయిన చైనాకు డాక్టర్లను పంపించింది క్యూబా. యాంటీ వైరల్‌ చికిత్సలు అందించడం, పెద్ద ఎత్తున మాస్క్‌ల తయారీతో వైరస్‌ను ఎదుర్కోవడంలో
ప్రపంచ దేశాలకు క్యూబా ఆదర్శంగా నిలుస్తోంది. 

Also Read | డేంజర్ బెల్స్, దేశంలోని 30శాతం జిల్లాలకు వ్యాపించిన కరోనా వైరస్