గుండెపోటుకు వజ్రంతో చికిత్స

గుండెపోటుకు వజ్రంతో చికిత్స

Diamond Treatment to Heart Attack : వజ్రాలు.. సాధారణంగా ఆభరణాలకు వన్నె తెలుస్తుంటాయి. అలాంటి వజ్రాలు ఇప్పుడు గుండె పోటు చికిత్సకూ ఉపయోగపడుతున్నాయి. అవును మీరు వింటుంది నిజమే. సూరత్‌లో లభించే వజ్రాలు మనిషి ప్రాణాలను కాపాడుతున్నాయి. వజ్రంతో గుండెపోటుకు చికిత్స.. చెప్పడానికి..వినడానికి బాగానే ఉంది..మరి అసలు వజ్రంతో ఎలా చేస్తారు..? వజ్రాన్ని లోపలికి ఎలా పంపిస్తారు..? ఇప్పుడీ అంశం అసక్తికరంగా మారింది. రక్తనాళాల్లో కాల్షియం గడ్డలుగా పేరుకుపోవడం వల్ల రక్త ప్రసరణ నిలిచిపోతుంది. దీంతో గుండె పోటు తలెత్తుతుంది. ఇలాంటి ప్రతి వంద కేసుల్లో నాలుగు కేవలం హృద్ధమనుల్లో కాల్షియం గడ్డ కట్టడం వల్లే వస్తున్నాయి. అయితే..సూరత్‌కు చెందిన ప్రముఖ కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ అతుల్‌ అభ్యాంకర్‌ ఈ సమస్యను చాలా సులభంగా తొలగించేస్తున్నారు. రోటాబ్లాటర్‌ అనే బుల్లి డ్రిల్‌ యంత్రానికి సూరత్‌ వజ్రాన్ని అమర్చి, రక్తనాళంలోకి పంపుతారు.

అక్కడి కాల్షియం గడ్డలను ఈ యంత్రం సాయంతో అత్యంత లాఘవంగా పిండి చేసేస్తారు. సాధారణంగా హృద్ధమనుల్లో కాల్షియం అధికంగా పేరుకుపోయినప్పుడు శస్త్రచికిత్స ద్వారా బెలూన్‌ను అమర్చుతారు. అయితే కాల్షియం అధిక స్థాయిలో పేరుకుపోయినా, నాళంపై ఒత్తిడి పెరిగినా కాస్త ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో రోటాబ్లాటర్‌ను ఉపయోగించి కాల్షియంను తొలగిస్తున్నారు సూరత్‌కు చెందిన ప్రముఖ కార్డియాలజిస్ట్‌. ఈ రోటాబ్లాటర్‌ యంత్రం 500 ఓల్టు విద్యుత్‌తో నడుస్తుంది. దీని మెడభాగంలో అమర్చిన వజ్రం నిమిషానికి 1.60 లక్షల నుంచి 1.80 లక్షల సార్లు గిర్రున తిరుగుతుంది. తద్వారా రక్తనాళాల్లో గడ్డలా పేరుకుపోయిన కాల్షియం 5 మైక్రాన్ల మందంతో కూడిన పొడిగా మారిపోతుంది. తర్వాత ఆ పొడి రక్త ప్రవాహంలో సహజంగానే కొట్టుకుపోతుంది.

అత్యంత దృఢమైన రాళ్లలో డైమండ్‌ ఒకటి. ముల్లును ముల్లుతోనే తియ్యాలన్నది తెలుసు కదా. అందుకే…గుండెతో అనుసంధానమైన రక్తనాళాల్లో రాయిలా పేరుకుపోయిన కాల్షియం గడ్డలను వజ్రాన్ని ఉపయోగించి తొలగిస్తున్నారు. అయితే ఈ విధానంలో రక్తనాళాలను శుభ్రం చేయడానికి అదనంగా 50 వేలు ఖర్చవుతుంది. హృద్రోగులు చాలామంది డాక్టర్‌ అతుల్‌ వద్ద వజ్ర వైద్యం పొందడానికి ఆసక్తి చూపుతుంటారు. వజ్రం సాయంతో రక్తనాళాలను శుభ్రపరిచే ఈ విధానాన్ని తెలుసుకునేందుకు ఏకంగా…ఇరాన్‌ వైద్య బృందం ప్రత్యేకంగా సూరత్‌కు వచ్చిందంటే..ఈ వైద్యానికి ఎంతటి ప్రత్యేకత ఉందో అర్థం చేసుకొవొచ్చు.