డివోర్స్ ఎఫెక్ట్ : తండ్రికి దూరమైతే పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం!

  • Published By: sreehari ,Published On : January 16, 2020 / 03:59 PM IST
డివోర్స్ ఎఫెక్ట్ : తండ్రికి దూరమైతే పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం!

అమ్మ నాన్న.. ఈ పిలుపులో ఎంతో మాధుర్యం ఉంది. పిల్లలతో మమ్మీ డాడీ అని పిలుపించుకోవాలని పేరంట్స్ కు ఎలా ఆశగా ఉంటుందో అలాగే తల్లిదండ్రులు లేని పిల్లల్లో కూడా అదే భావన బలంగా ఉంటుంది. తల్లిదండ్రుల్లో ఏ ఒక్కరూ లేకున్నా ఆ లోటు పిల్లల్లో అలానే ఉంటుంది. అమ్మా నాన్న తమతోనే ఉండాలని, వారిద్దరూ కలిసి ఉండాలని పిల్లలంతా కోరుకుంటారు. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు.. అలాగే భార్యభర్తలిద్దరూ కలిసి తల్లిదండ్రులుగా తమ బాధ్యతను నిర్వర్తిస్తేనే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. అమ్మ దగ్గర పెరిగే పిల్లల్లో నాన్న లేని వెలితి కనిపిస్తుంది. అదే నాన్న దగ్గర పెరిగే పిల్లల్లో అమ్మ లేని లోటు స్పష్టంగా కనిపిస్తుంది. నాకు ఓ అమ్మ ఉంటే బాగుండు కదా? అని ఆ పసి హృదయాల్లో చెరగని బాధ జీవితాంతం దహించివేస్తూనే ఉంటుంది. 

పసి హృదయాల్లో మానని గాయం  :
పసిప్రాయంలోనే వారి మనస్సు దెబ్బతింటుంది.. మానసికంగా ఎంతో కృంగిపోతారు. పైకి నవ్వుతూ తోటి పిల్లలతో కనిపించినా లోలోపల మదనపడుతూనే ఉంటారు. తాము తీసుకునే నిర్ణయం తమ పిల్లలపై తీవ్ర ప్రభావం పడుతుందనే విషయాన్ని ప్రతి పేరంట్స్ ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం. ప్రస్తుత రోజుల్లో భార్యభర్తల్లో ప్రతి చిన్న విషయానికి గొడవ పడటం కామన్ అయిపోయింది. ఇద్దరిలో ఎవరి తప్పు ఉన్నప్పటికీ సర్దుకుపోయి సంసారాన్ని సాగించే వారు ఎందరో.. కానీ, చిన్నపాటి కలతలకు కుంగిపోయి తమ వైవాహిక బంధాన్నిసగంలోనే తుంచివేస్తున్నారు. విడాకులు అంటూ కోర్టు మెట్లు ఎక్కేవారు ఎందరో ఉన్నారు. 

పిల్లలు లేకుంటే పర్వాలేదు.. కానీ, అదే పిల్లలు ఉన్నవారు విడాకులు తీసుకుంటే వారి భవిష్యత్తు ఏంటి? అన్న ప్రశ్న వేసుకోవాల్సిన అవసరం ఉంది.. మరికొంత మంది మాత్రం తమ వైవాహిక జీవితం సంతృప్తిగా లేకపోయినా భాగస్వామితో గొడవలు ఉన్నప్పటికీ తమకు పుట్టిన పిల్లల కోసం ఇష్టం లేకపోయినా కలిసి జీవించేవారు లేకపోలేదు. పిల్లల కోసం ఆ మాత్రం చేయక తప్పదు.. లేదంటే ఆ పసి హృదయాలు దెబ్బతింటాయి… భవిష్యత్తులో వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని డిపార్ట్ మెంట్ ఆఫ్ గ్లోబల్ పబ్లిక్ హెల్త్ అండ్ కేర్, యూనివర్శిటీ ఆఫ్ బెర్గెన్ ప్రొఫెసర్ ఎవింద్ మిలాండ్ చెబుతున్నారు. 

ప్రత్యేకించి విడాకులు తీసుకున్న తల్లిదండ్రులు తమ పిల్లలతో అదే ప్రేమను కొనసాగించడం ఎంతో ముఖ్యమని, లేదంటే ఆ పసి మనస్సులు గాయపడతాయని అంటున్నారు. విడాకుల అనంతరం తల్లి దగ్గర ఉండే పిల్లలు తమ తండ్రితో మాట్లాడే అవకాశం పెద్దగా ఉండదు. దీంతో వారిలో తండ్రి లేడనే ఫీలింగ్ తీవ్ర స్థాయిలో ఉంటుంది. నాన్నతో మాట్లాడలని ఉన్నా.. మాట్లాడలేక తమలో తామే మదనపడుతుంటారు. మానసికంగా కృంగిపోయే అవకాశం ఉంది. తల్లిదండ్రులు విడాకుల అనంతరం 40 శాతం మంది టీనేజర్లు ఇలాంటి అనుభవాలను ఎదుర్కొన్నట్టు నార్వే ఇన్సిస్టూట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ తమ అధ్యయనంలో వెల్లడించింది. 

తండ్రితో కష్టంగా మాట్లాడటం.. ఆడపిల్లల్లోనే ఎక్కువ :  
విడాకుల తర్వాత తల్లిదండ్రులు, పిల్లలకు మధ్య కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది.. అది పిల్లలకు భవిష్యత్తులో వారి ఆరోగ్యంపై ఏ మేరకు ప్రభావం చూపిస్తుంది అనేదానిపై అధ్యయనం చేయాలనుకున్నాం’ అని మిలాండ్ వివరణ ఇచ్చారు. సాజన్ ఆఫ్ ఫ్ జోర్డాన్ ప్రాంతానికి చెందిన 1225 యువకులపై ఈ అధ్యయాన్ని కొనసాగించారు. ఇందులో భాగంగా వారు తమ తల్లిదండ్రులతో మాట్లాడానికి ఇబ్బందులు ఎదుర్కొన్నారా? లేదా అని టీనేజర్లను ప్రశ్నించినట్టు మిలాండ్ చెప్పారు. దీనికి వారి నుంచి వచ్చిన సమాధానాల్లో ‘చాలా ఈజీ నుంచి చాలా కష్టం లేదా అసలే మాట్లాడలేదు’ అని సమాధానాలే ఎక్కువగా ఉన్నట్టు గుర్తించామన్నారు. 

అంతేకాదు.. టీనేజర్లలో ఆత్మ గౌరవం, ఆరోగ్యకరమైన సమస్యలు ఏమైనా ఉన్నాయా? అని కూడా రీసెర్చర్లు అడిగారు. ఇందులో వివిధ భౌతిక, మానసిక పరమైన లక్షణాలతో పాటు తలనొప్పి, కళ్లు తిరగడం, కడుపులో నొప్పి, ఆందోళన, మానసిక ఒత్తిడి, నిద్రలేమి సమస్యలతో ఉన్నాయని చెప్పినట్టు పరిశోధకులు తెలిపారు. 2011, 2013లో కొంతమంది చిన్నారులను కూడా అడిగారు.

2011లో 213 మంది చిన్నారులు తమ తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నట్టుగా చెప్పుకొచ్చారు. రెండేళ్ల తర్వాత వీరి సంఖ్య 270కి పెరిగిందని రీసెర్చర్లు తెలిపారు. అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిల్లోనే తమ తండ్రులతో మాట్లాడటం చాలా కష్టంగా మారినట్టు అధ్యయనం వెల్లడించింది. అమ్మాయిల్లో ఎక్కువగా ఆరోగ్యకరమైన సమస్యలు తలెత్తినట్టు చెప్పుకొచ్చారు. కానీ, తండ్రితో మాట్లాడానికి పడిన ఇబ్బందుల విషయంలో అబ్బాయిలు, అమ్మాయిలకు ఒకే సమస్య ఎదురైనట్టుగా నివేదిక తెలిపింది.