AIMS ఫ్రీ సర్జరీ : అతుక్కు పుట్టిన కవలలకు ఆపరేషన్ సక్సెస్!

  • Published By: sreehari ,Published On : January 28, 2020 / 01:04 AM IST
AIMS ఫ్రీ సర్జరీ : అతుక్కు పుట్టిన కవలలకు ఆపరేషన్ సక్సెస్!

రాజస్థాన్‌లో అతుక్కు పుట్టిన కవల పిల్లలను జోధాపూర్ ఎయిమ్స్ వైద్యులు విజయవంతంగా ఆపరేషన్ చేసి వేరుచేశారు. నాలుగు గంటల పాటు ఆపరేషన్ నిర్వహించిన అనంతరం ఉదరం, పొట్ట అతుక్కుని పుట్టిన కవల పిల్లలను విడదీశారు.

పుట్టిన ఇద్దరు పిల్లలు కలిపి మూడు కిలోల వరకు బరువు ఉండగా, ఒక్కొక్కరుగా కిలోన్నర బరువు వరకు ఉన్నారని వైద్యులు తెలిపారు. ఇలాంటి ఆపరేషన్లను నిర్వహించడానికి మూడు నుంచి ఆరు నెలల సమయం పడుతుందని ఎయిమ్స్ హెచ్ఓడీ డాక్టర్ అరవింద్ సిన్హా మీడియాకు వెల్లడించారు. 

‘ఇద్దరు కవలల్లో ఒక పసివాడికి గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీ సంబంధిత సమస్యలు ఉన్నాయని, బతికే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని ఆయన అన్నారు. ఒకవేళ అదే పరిస్థితి ఎదురైతే.. మరో పిల్లవాడికి కూడా ముప్పు ఏర్పడుతుందని చెప్పారు. అయినప్పటికీ తాము కవల పిల్లలను వేరు చేసేందుకు సర్జరీ చేశామని, నాలుగు గంటల పాటు శ్రమించిన అనంతరం విజయవంతంగా వారిద్దరిని ఆదివారం వేరుచేయగలిగామని ఆయన తెలిపారు. 

ప్రస్తుతం వేరు చేసిన ఇద్దరు కవలలను వెంటిలేటర్ పై ఉంచి చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. కవలల తల్లిదండ్రులు పేద కుటుంబం నుంచి వచ్చినవారు కావడంతో ఈ సర్జరీ ఎలాంటి ఫీజు తీసుకోకుండా ఉచితంగా చేసినట్టు అరవింద్ సిన్హా తెలిపారు.