డ్యుయల్ ఫ్లూ-కోవిడ్ నాజల్ స్ప్రే వ్యాక్సిన్.. వచ్చే నెలలోనే ట్రయల్

  • Published By: sreehari ,Published On : October 9, 2020 / 09:11 PM IST
డ్యుయల్ ఫ్లూ-కోవిడ్ నాజల్ స్ప్రే వ్యాక్సిన్.. వచ్చే నెలలోనే ట్రయల్

Dual Flu-Covid Nasal Spray Vaccine : ప్రపంచాన్ని పట్టిపీడుస్తోన్న కరోనా వైరస్ మహమ్మారితో పాటు ఇన్ ఫ్లూయింజా వైరస్ రెండింటి నిర్మూలన కోసం డ్యుయల్ వ్యాక్సిన్ రాబోతోంది. ఈ ప్రయోగాత్మక డ్యుయల్ వ్యాక్సిన్ కోసం వచ్చే నెల నవంబర్ లో హాంకాంగ్ లో హ్యుమన్ ట్రయల్స్ ప్రారంభం కానుంది. ఈ డ్యుయల్ వ్యాక్సిన్ నాజల్ స్ప్రే (ముక్కు ద్వారా) ఇస్తారని పరిశోధక నిపుణుల్లో ఒకరు వెల్లడించారు.



ఇటీవలే ఈ క్లినికల్ ట్రయల్ కోసం 100 మంది నమోదు చేసుకున్నారని యూనివర్శిటీ హాంగ్ కాంగ్ లోని మైక్రోబయోలజీ డిపార్ట్ మెంట్ వైద్యులు Yuen Kwok-Yung వెల్లడించారు. ఇప్పటికే మార్కెట్లో ఉన్న నాజల్ స్ప్రే ఫ్లూ ఇమ్యూనైజేషన్ మాదిరిగానే ఈ వ్యాక్సిన్ ఉంటుందని చెప్పారు. శరీరంలోకి వైరస్ ప్రవేశించే ప్రధాన మార్గమైన ముక్కు ద్వారా ఈ వ్యాక్సిన్ ఇచ్చేలా డిజైన్ చేశారు.



అందుకే ఫ్లూ influenza వైరస్ తోపాటు కరోనా వైరస్ నుంచి ఒకే సమయంలో రక్షణ కోసం ఈ డ్యుయల్ నాజల్ స్ప్రే వ్యాక్సిన్ అభివృద్ధి చేస్తున్నామని Yuen పేర్కొన్నారు.నార్వే, హాంకాంగ్ ప్రభుత్వాలతో పాటు Epidemic Preparedness Innovations సంయుక్తంగా ఈ డ్యుయల్ వ్యాక్సిన్ రీసెర్చ్ కోసం నిధులను సమకూర్చాయి.



ప్రపంచవ్యాప్తంగా డజన్ల కొద్ది క్లినికల్ ట్రయల్స్ లో ఈ వ్యాక్సిన్ కూడా చేరనుంది. గత నెలలోనే చైనా కూడా నాజల్ స్ప్రే కరోనా వ్యాక్సిన్ క్లినియల్ ట్రయల్స్ ప్రారంభించింది. దీన్ని Xiamen University, హాంగ్ కాంగ్ యూనివర్శిటీ రీసెర్చర్లు సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్నారు.