Corona Children : పిల్లలకు కరోనా సోకుతుందా? గుర్తించడం ఎలా? చికిత్సకు ఎప్పుడు వెళ్లాలి?

మూడో దశలో పిల్లలపై కరోనా ఎఫెక్ట్ 80శాతం పైనే ఉండొచ్చని అంచనా. మరి పిల్లల్లో వైరస్‌ వస్తే దాన్ని గుర్తించడం ఎలా.. వారికి ఎలాంటి లక్షణాలు ఉంటాయి.. ట్రీట్ మెంట్ కి ఎప్పుడు తీసుకెళ్లాలి?

Corona Children : పిల్లలకు కరోనా సోకుతుందా? గుర్తించడం ఎలా? చికిత్సకు ఎప్పుడు వెళ్లాలి?

Corona Children

Corona Children : కరోనావైరస్ మహమ్మారి దేశాన్ని వణికిస్తోంది. సెకండ్ వేవ్ లో కరోనా విశ్వరూపం చూపించింది. మహమ్మారి దెబ్బకు యావత్ దేశం గజగజలాడుతోంది. సెకండ్ వేవ్ లో యువతపై కరోనా తీవ్రమైన ప్రభావం చూపిస్తోంది. దీన్ని నుంచి కోలుకోకముందే థర్డ్ వేవ్ హెచ్చరికలు భయాందోళనకు గురి చేస్తున్నాయి. థర్డ్ వేవ్ లో చిన్నారులపై కరోనా మరింత తీవ్రంగా పంజా విసరనుందనే వార్తలు తల్లిదండ్రులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ క్రమంలో అనేక అనుమానాలు, సందేహాలు, భయాలు పిల్లల తల్లిదండ్రులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

పిల్లలకు కరోనా సోకుతుందా? లేదా?.. దీనిపై చాలా మందికి చాలా అపోహలు ఉన్నాయి. చిన్నారులకు వైరస్‌ సోకదని, ఒకవేళ వచ్చినా వారికేం కాదనే భావనా ఉంది. కానీ ప్రస్తుత పరిస్థితి అందుకు భిన్నం. రోజురోజుకీ విజృంభిస్తోన్న కొవిడ్‌ వైరస్‌.. రెండో దశలో చిన్నారుల మీదా విరుచుకుపడుతోంది. తొలి దశలో కేవలం 4శాతం చిన్నారులపై వైరస్‌ ప్రభావం ఉండగా.. ఇప్పుడు 15 నుంచి 20శాతం మంది పిల్లలే బాధితులుగా ఉంటున్నారు. మూడో దశలో ఇది 80శాతం పైనే ఉండొచ్చని అంచనా. మరి పిల్లల్లో వైరస్‌ వస్తే దాన్ని గుర్తించడం ఎలా.. వారికి ఎలాంటి లక్షణాలు ఉంటాయి.. చూద్దాం.

చిన్నారుల్లో వైరస్‌ లక్షణాలను ఎలా గుర్తించాలి.. ఎలాంటి చికిత్స అందించాలన్న దానిపై కేంద్ర ఆరోగ్య శాఖ ఇటీవల కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. మెజార్టీ పిల్లల్లో కరోనా సోకినప్పటికీ వారిలో ఎలాంటి లక్షణాలు ఉండట్లేదని, కొందరిలో స్వల్ప లక్షణాలు కన్పిస్తున్నాయని తెలిపింది.

లక్షణాలివే..
సాధారణంగా మామూలు జలుబు, జ్వరం ఉంటే పిల్లలు ఒకట్రెండు రోజుల్లో కోలుకుంటారు. అయితే రోజుల తరబడి అవే లక్షణాలుంటే మాత్రం ఆసుపత్రికి తీసుకెళ్లాలి.

వైరస్‌ సోకినప్పుడు పిల్లల్లో కన్పించే ప్రధాన లక్షణాలు..
* జ్వరం
* తలనొప్పి, ఒళ్లు నొప్పులు
* ముక్కుదిబ్బడ, దగ్గు, గొంతునొప్పి
* శ్వాస వేగంగా తీసుకోవటం
* వికారం, వాంతి, విరేచనాలు
* విడవకుండా కడుపునొప్పి
* ఆహారం సరిగా తినకపోవటం, ఆకలి లేకపోవటం.. రుచి, వాసన తగ్గటం

చికిత్సకు ఎప్పుడు వెళ్లాలి..
కరోనా సోకిన పిల్లల లక్షణాలను బట్టి మైల్డ్‌, మోడరేట్‌, సివియర్‌ అని మూడు కేటగిరీలు విభజిస్తారు.
> జ్వరం, జలుబు వంటి స్వల్ప లక్షణాలు ఉండి ఇతర ఆరోగ్య సమస్యలేమీ లేకపోతే ఇంట్లోనే ఉంచి చికిత్స అందించొచ్చు.
> ఆయాసం, వేగంగా శ్వాస తీసుకోవాల్సి రావడం, ఆహారం సరిగ్గా తీసుకోకపోవడం వంటి లక్షణాలుంటే మాత్రం అశ్రద్ధ చేయకుండా ఆసుపత్రికి తీసుకెళ్లాలి.
> తీవ్ర అస్వస్థతకు గురైన పిల్లలకు వెంటిలేటర్‌పై చికిత్స అందించాల్సి ఉంటుంది. తీవ్ర దశలో న్యుమోనియా ఎక్కువవుతుంది. ఆక్సిజన్‌ శాతం 90 కన్నా తక్కువగా పడిపోవచ్చు. ఆయాసం, శ్వాస తీసుకోలేకపోవడం వంటి లక్షణాలుంటాయి. విడవకుండా విరేచనాలు, వాంతులు, కడుపునొప్పి ఉన్నా వెంటనే ఆసుపత్రిలో చూపించాలి.
> కొందరు పిల్లల్లో కొవిడ్‌ మల్టీసిస్టమ్‌ ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్‌ సమస్యకు దారి తీస్తోంది. కాబట్టి ఎప్పుడూ మగతగా ఉంటున్నా.. తికమక పడుతున్నా, చర్మం, పెదవులు, గోళ్లు పాలిపోతున్నా తీవ్రమైన కడుపునొప్పి వేధిస్తున్నా వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలని నిపుణులు చెబుతున్నారు.

ఎలాంటి ఆహారం ఇవ్వాలి..
కొవిడ్‌ సోకిన పిల్లలకు మంచి ఆహారం అందించాలి. తాజా పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు ఎక్కువగా తినిపించాలి. విటమిన్లు, ఖనిజ లవణాలు పుష్కలంగా ఉండే ఆహారపదార్థాలు ఇవ్వాలి. నీరు ఎక్కువగా తాగించాలి. ఎక్కువ సేపు పడుకునేలా చూసుకోవాలి.