పండ్లు, కూరగాయలను ఇలా శుభ్రం చేస్తున్నారా? జాగ్రత్త.. ఈ తప్పు చేయొద్దు!

  • Published By: sreehari ,Published On : July 1, 2020 / 10:40 PM IST
పండ్లు, కూరగాయలను ఇలా శుభ్రం చేస్తున్నారా? జాగ్రత్త.. ఈ తప్పు చేయొద్దు!

ప్రపంచమంతా కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. భారత్ సహా ఇతర దేశాల్లో కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. కరోనా పీక్ స్టేజ్ లోకి వెళ్లిపోయింది. బయటకు వెళ్తే చాలు.. ముఖానికి మాస్క్ ధరించి వెళ్తున్నారు. చేతులను శానిటైజ్ చేసుకుంటున్నారు. షాపింగ్, కిరాణా సరుకులు, కూరగాయల మార్కెట్‌కు వెళుతుంటారు. నిత్యావసర వస్తువులను ఇంటికి తీసుకెళ్లే వారంతా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అసలు ఏయే జాగ్రత్తలు తీసుకోవాలి? అనే విషయంలో కొందరు తర్జనభర్జన పడుతుంటారు. కరోనా భయంతో బయట నుంచి ఏదైనా వస్తువులు, కూరగాయలను తీసుకెళ్లి శుభ్రం చేస్తుంటారు.

మరికొంత మంది నెలకు సరిపడా నిత్యావసరాలు, వారానికి కావాల్సిన కూరగాయలు, పండ్లను తెచ్చుకుంటున్నారు. అయితే ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. కూరగాయలను శుభ్రం చేసే విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. మీరు కూడా ఇంటికి తెచ్చిన కూరగాయలు, పండ్లను ఇలా మాత్రం శుభ్రం చేయొద్దని హెచ్చరిస్తున్నారు. కరోనా వైరస్ వెంటనే చనిపోతుందని ఎక్కువగా కెమికల్ లిక్విడ్ తో శుభ్రం చేయొద్దని సూచిస్తున్నారు. ఉప్పు, పసుపుతో కూరగాయలను 20 నిమిషాలు కడిగితే వాటిపై ఉండే క్రిములు, బ్యాక్టీరియా తొలిగిపోతుందని అంటున్నారు.

ముందుగా ఉప్పు, పసుపుతో కూరగాయలను కడిగేయండి. మళ్లీ మంచినీటితో శుభ్రం చేయాలని సూచిస్తున్నారు. ఇలా చేస్తే ఆరోగ్య సమస్యలు దరిచేరవని చెబుతున్నారు. చాలా మంది కూరగాయలను డెటాల్‌ లిక్విడ్, సబ్బు, శానిటైజర్లతో శుభ్రం చేస్తున్నారు. ఆ తర్వాత వాటిని తుడిచి అరగంట పాటు ఆరబెడతున్నారు. కూరగాయలు, పండ్లు శుభ్రపరచడానికి డిటర్జెంట్లు, సబ్బు లాంటివి అసలే వాడకూడదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలా చేస్తే.. పండ్లు, కూరగాయల్లో చేరిన కెమికల్ లిక్విడ్ అలానే పట్టేస్తుంది. సరిగా శుభ్రం చేయకపోతే.. కరోనా వైరస్ ఏమో గానీ, ఇతర ఆరోగ్య సమస్యలు మాత్రం తప్పక వస్తాయని అంటున్నారు. సో.. పండ్లు, కూరగాయలు శుభ్రం చేసేటప్పుడు జర జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.