కరోనా వైరస్ నుంచి కోలుకున్నా… గుండె జబ్బులు వస్తున్నాయా?

  • Published By: naveen ,Published On : July 28, 2020 / 11:19 AM IST
కరోనా వైరస్ నుంచి కోలుకున్నా… గుండె జబ్బులు వస్తున్నాయా?

యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు చూపనుందా? ఆరోగ్య పరంగా కొత్త సమస్యలు తీసుకురానుందా? ఊపిరితిత్తుల మీద కన్నా గుండె మీదే ఎక్కువ ప్రభావం చూపనుందా? గుండె వైఫల్య రోగుల తరాన్ని సృష్టించనుందా? అంటే అవుననే అంటున్నారు పరిశోధకులు. ఇటీవల పబ్లిష్ అయిన రెండు అధ్యయనాలు ఈ విషయాన్ని తెలుపుతున్నాయి. కొవిడ్ నుంచి కోలుకున్నా తీవ్రమైన శ్వాస సంబంధ సమస్యలు ఉన్నవారిలో హార్ట్ ఫెయిల్యూర్ సమస్యలు రావచ్చొని అధ్యయనంలో తేలింది.

కరోనా వైరస్ తో గుండె జబ్బులు:
జర్నల్ ఆఫ్ ద అమెరికన్ మెడికల్ అసోసియేషన్ లో కొత్త అధ్యయనం వెలువడింది. ఇదొక మేలుకొలుపు లాంటిది అని అధ్యయనకర్తలు అన్నారు. కరోనా ప్రభావం కేవలం ఊపిరితిత్తులకు మాత్రం పరిమితం అని భావిస్తున్న వైద్య నిపుణులకు ఇదొక వేకప్ కాల్ అని అధ్యయనకర్తలు చెప్పారు. కరోనా కారణంగా అంతకుమించి ఆరోగ్య సమస్యలు ఉత్పన్నం కానున్నాయని హెచ్చరించారు. ముఖ్యంగా గుండె జబ్బులు ఎక్కువ అవుతాయన్నారు.

కార్డియాక్ సమస్యలు, గుండెలో మంట:
కరోనా కారణంగా ఊరితిత్తులు దెబ్బనడం, న్యూమోనియా సంభవించడం తెలిసిందే. కానీ కరోనా బారిన పడ్డ రోగుల్లో హార్ట్ కూడా డ్యామేజ్ అయ్యే చాన్స్ ఉందని పరిశోధకులు చెప్పారు. కరోనా నుంచి కోలుకున్న పేషెంట్స్ లో కార్డియో వాస్కులర్ సమస్యలు గుర్తించామన్నారు. కొందరు కొన్ని వారాల పాటు మరికొందరు కొన్ని నెలల పాటు కార్డియో వాస్కులర్ సమస్యలతో బాధపడుతున్నారని చెప్పారు. 100మంది జర్మన్ పేషెంట్లలో సుమారు 60మందిలో(49ఏళ్ల వయసు వారు) కార్డియాక్ అసమతుల్యతలు గుర్తించడం జరిగిందన్నారు. ఇంకొందరు గుండెలో మంటతో బాధపడుతున్నారు. కరోనా వైరస్ గుండెపైనా ప్రభావం చూపుతోందన్నారు.

హార్ట్ ఫెయిల్యూర్ కు దారితీయొచ్చు:
జర్మన్ ఫిజీషియన్లు జరిపిన మరో స్టడీలో ఇంకో విషయం వెలుగుచూసింది. గుండెలో మంట కలగడానికి కారణంపై అధ్యయనం చేశారు. కరోనా కారణంగా వచ్చిన న్యూమోనియా మరణాలకు దారితీస్తోందన్నారు. కొందరు రోగుల్లో కరోనా వైరస్, హార్ట్ మజిల్ కణాల వరకు వెళ్లి వాటిని డ్యామేజ్ చేస్తోందన్నారు. ఇటీవల న్యూజెర్సీలో 63ఏళ్ల వృద్ధుడు కరోనా బారిన పడ్డాడు. ట్రీట్ మెంట్ తర్వాత కోలుకున్నాడు. అయితే అతడి కాలిలో వాపు మొదలైంది. అది హార్ట్ ఫెయిల్యూర్ కి చిహ్నం అని డాక్టర్లు తెలిపారు. కాగా కరోనా సోకడానికి ముందు వరకు ఆ వ్యక్తికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు. కాలు వాపు రావడంతో ఆ వ్యక్తిని ఆసుపత్రిలో చేర్చి టెస్టులు చేశారు. హార్ట్ బీట్ లో మార్పులను స్పష్టంగా గమనించారు.

కరోనాతో గుండె కండరాల్లో వాపు:
కరోనా నుంచి కోలుకున్న కొందరు వ్యక్తులు, వైరస్ కారణంగా మయోకార్డిటిస్ తో(హృదయ కండరముల వాపు), గుండెలో మంట వంటి సమస్యలతో బాధపడుతున్న డాక్టర్లు గుర్తించారు. దీంతో కరోనా వైరస్, గుండెని కూడా దెబ్బతీస్తోందని తెలుసుకున్నారు. ఇప్పటికే గుండె సంబంధ వ్యాధులతో బాధపడుతున్న వారికి కరోనా వైరస్ సోకితే మరణించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. మరో వ్యక్తి విషయంలోనూ ఇలానే జరిగింది. కరోనా నుంచి కోలుకున్న తర్వాత అనారోగ్యానికి గురయ్యాడు. మయోకార్డిటిస్ తో(హృదయ కండరముల వాపు) బాధపడుతున్నాడు. దీని గుండెలో మంట అని కూడా అంటారు. ఇది కరోనా వైరస్ వల్ల జరిగిందని వైద్యులు తెలిపారు. న్యూయార్క్ లోని ఆసుపత్రుల్లోనూ ఇలాంటి కేసులు వెలుగుచూశాయి. కరోనా నుంచి కోలుకున్న వ్యక్తులకు గుండెపోటు వచ్చింది.

కరోనా వైరస్ కి, గుండెకి సంబంధం ఏంటి?
ఈ అధ్యయనాలు ఆందోళన కలిగించే విధంగా ఉన్నాయని అధ్యయనకర్తలు అంటున్నారు. ఇది వైద్య నిపుణులు మేలుకోవాల్సిన సమయం అన్నారు. అసలు కొవిడ్ 19 వైరస్ కు, గుండెకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? ఆ రెండింటి మధ్య ఉన్న లింక్స్ ను అర్థం చేసుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు. పరిస్థితి చేయి దాటకమునుపే మేల్కోవాలన్నారు. లేదంటే పరిస్థితి మరింత తీవ్ర రూపం దాల్చవచ్చని హెచ్చరించారు.