కరోనా వైరస్ కు కొత్త ట్రీట్మెంట్ వచ్చేస్తోంది

  • Published By: venkaiahnaidu ,Published On : March 15, 2020 / 10:49 AM IST
కరోనా వైరస్ కు కొత్త ట్రీట్మెంట్ వచ్చేస్తోంది

ప్రంచదేశాలన్నీ వణికిస్తున్న కరోనా(COVID-19) మహమ్మారిని ఎదుర్కోగలిగే వాక్సిన్లు, మందులు లేని ప్రస్తుత పరిస్థితుల్లో పరిశోధకులు కొత్త ఆశను కలిగిస్తున్నారు. ఆ వ్యాధి బారి నుంచి కోలుకున్నవాళ్ల రక్తంలో కరోనా తీవ్రత తగ్గించేందుకు, ట్రీట్మెంట్ అందించే కీలకమైన అంశం ఉందని జాన్స్ హాప్ కిన్స్ యూనివర్సిటీకి చెందిన ఇద్దరు పబ్లిక్ హెల్త్ రీసెర్చర్లు చెబుతున్నారు. కరోనాను ఎదుర్కోనే మందు ‘కన్వాలెసెంట్ సీరమ్’లో ఉందని పరిశోధకులు అంటున్నారు.

వైరస్  ఇన్ ఫెక్ట్ అయిన వాళ్ల రక్తం నుంచి తీసిన సీరమ్ నే కన్వాలెసెంట్ సీరమ్ అంటారు. రక్తంలోని ప్లాస్మాలో ఉండే పదార్థమే సీరమ్. దీనిలోనే మన యాంటీబాడీలు ఉంటాయి. వైరస్ మన శరీరంలోకి ప్రవేశించినప్పుడు దానితో పోరాడడానికి యాంటిబాడీలు ఈ సీరమ్ లోనే విడుదల అవుతాయి. అందుకే కరోనా నుంచి కోలుకున్న వాళ్ల సీరమ్ నుంచి వైరస్ కు వ్యతిరేకంగా పోరాడగలిగే యాంటిబాడీల ద్వారా ఈ వ్యాధికి చికిత్స అందించవచ్చన్నది పరిశోధకుల భావన.

1918లో స్పానిష్ ఫ్లూ… కరోనా లాగే అంటువ్యాధిగా పుట్టుకొచ్చింది. అప్పుడు ఆ వ్యాధి నుంచి కోలుకున్న వాళ్ల రక్తంలోని అంశాలను ఎక్కించడం వల్ల తీవ్రస్థాయి అనారోగ్యంతో ఉన్న రోగుల మరణాలు 50 శాతానికి పడిపోయాయి. కొన్ని దశాబ్దాల క్రితం తట్టు, పోలియో లాంటి వ్యాధులను అరికట్టడంలో కూడా ఈ పద్ధతినే ఉపయోగించారు. అయితే 1950లలో ఆధునిక వ్యాక్సిన్లు, యాంటివైరల్ మెడిసిన్స్ డెలవలప్ అయిన తర్వాత ఈ తరహా చికిత్స మరుగున పడిపోయిందని జాన్స్ హాప్ కిన్స్ యూనివర్సిటీ…మాలిక్యులర్ మైక్రోబయాలజీ, ఇమ్యునాలజీ విభాగానికి చెందిన డాక్టర్ అర్ టురో కెసాడ్వాల్ చెప్పారు.

ఇప్పుడు కరోనా వైరస్ మహమ్మారి పెరుగుతుండడంతో మళ్లీ ఈ చికిత్సను అభివృద్ధి చేయడం మంచి ఫలితాలను ఇవ్వగలదని ఆయన తెలిపారు.  ఆ కాలంలో ఏ వ్యాక్సిన్లూ లేవు. కాని వ్యాధి నిరోధక వ్యవస్థ నుంచి తీసుకున్న కణాలే ఆయా సూక్ష్మజీవుల అంతు చూశాయి. ఇప్పుడు కూడా కరోనాకు ఎటువంటి మందులూ, వ్యాక్సిన్లూ అందుబాటులో లేవు. కాబట్టి ఆ చికిత్స ఇప్పుడు ఉపయోగపడుతుందంటున్నారు.

కరోనా వైరస్ చాపకింద నీరులా ప్రపంచ దేశాలకు విస్తరిస్తోంది. ఇప్పటివరకు 151 దేశాలకు వైరస్ పాకింది. ప్రపంచ వ్యాప్తంగా మృతుల సంఖ్య 5,821కి చేరింది. లక్షా 56 వేల 433 మంది బాధితులు హాస్పిటల్ లో ట్రీట్మెంట్ ఉన్నారు. 5 వేల 909 మందికి సీరియస్ గా ఉంది. మరోవైపు భారత్ లో కూడా కరోనా వైరస్ సోకినవారి సంఖ్య 107కి చేరింది. ఎక్కువగా మహారాష్ట్రలో 31పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

వైరస్ వ్యాప్తిని నిలువరించేందుకు భారత్ లోని చాలా రాష్ట్రాల్లో ఇప్పుడు స్కూల్స్,కాలేజీలు,థియేటర్లు,మాల్స్ మూసివేశారు. వీలైనంతవరకు ప్రజలు తమ ప్రమాణాలను వాయిదా వేసుకోవడమే మంచిదని,ప్రస్తుత సమయంలో ప్రయాణాలు చేయడం రిస్క్ తో కూడుకున్న పనేనని భారత ప్రభుత్వం చెబుతోంది.