కరోనా వైరస్ ను రాష్ట్ర విపత్తుగా ప్రకటించిన కేరళ

  • Published By: venkaiahnaidu ,Published On : February 3, 2020 / 07:18 PM IST
కరోనా వైరస్ ను రాష్ట్ర విపత్తుగా ప్రకటించిన కేరళ

చైనాలోని వూహన్ సిటీలో వెలుగులోకి వచ్చి ప్రపంచదేశాలకు పాకుతున్న కరోనా వైరస్ గురించి ప్రపంచదేశాలు టెన్షన్ పడుతున్నాయి. గడిచిన నాలుగైదు వారాల్లో కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా 20దేశాలకు పైగా పాకింది. గడిచిన నాలుగురోజుల్లోనే చైనాలో 350మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.ఇప్పటికే వరల్డ్ హైల్త్ ఆర్గనైజేషన్ దీనిని గ్లోబల్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. దీంతో ఎక్కడికక్కడ అన్ని దేశాలు అలర్ట్ అయ్యాయి. వైరస్ కు వ్యాక్సిన్ కనిపెట్టేందుకు ప్రపంచంలోని సైంటిస్టులు కృషి చేస్తున్నారు.

మరోవైపు ఇప్పటికే ఈ వైరస్ భారత్ లోకి ప్రవేశించింది. ఇప్పటికే కేరళలో ముగ్గురికి ఈ వైరస్ సోకినట్లు డాక్టర్లు నిర్ధారించారు. వీరందరూ వూహాన్ సిటీ నుంచి తిరిగివచ్చిన విద్యార్థులే. వారు కలిసి ప్రయాణించడంతో సహా ఒకరితో ఒకరు శారీరక సంబంధం కలిగి ఉన్నారని అధికారులు తెలిపారు. ఈ సమయంలో కేరళ ప్రభుత్వం కరోనా వైరస్ ను “రాష్ట్ర విపత్తు” గా ప్రకటించింది.

ఇది ప్రజలను భయపెట్టాలన్న ఉద్దేశ్యంతో చేసిన ప్రకటన కాదని,వైరస్ వ్యాప్తిని నివారించే చర్యలను ముమ్మరం చేయడానికి చురుకైన చర్యలు తీసుకోవడంలో ఇది సహాయపడుతుందని రాష్ట్ర ఆరోగ్య మంత్రి కెకె శైలజా అన్నారు. ఇప్పటివరకు కేరళ నుంచి 140 మంది బ్లడ్ శాంపిల్స్‌ను పుణేలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపించగా,ఇందులో 46మందికి కరోనా వైరస్ లేదని తేలింది. ముగ్గురికి వైరస్ సోకినట్లు తేలింది. మిగిలిన శాంపిల్స్ రిపోర్టులు ఇంకా రాలేదు.

ధృవీకరించబడిన కేసులతో ప్రత్యక్ష సంబంధం ఉన్న 80 మందిని రాష్ట్ర ఆరోగ్య శాఖ పర్యవేక్షణలో ఉంచారు. కేరళలో మొదటి కరోనా వైరస్ కేసు త్రిసూర్ జిల్లాలో బయటపడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కొద్దిరోజులకే చైనా నుంచి తిరిగొచ్చిన అలప్పుజాకు చెందిన వ్యక్తికి కరోనా వైరస్ సోకినట్టు తేలింది. తాజాగా మూడో కేసు కూడా నిర్దారణ కావడంతో కేరళ ప్రభుత్వం అప్రతమత్తమైంది. ప్రస్తుతం 2వేల మందిని వారి వారి ఇళ్లల్లోనే ప్రభుత్వం వైద్య పర్యవేక్షణలో ఉంచింది. రాష్ట్రవ్యాప్తంగా మరో 70మంది ప్రస్తుతం ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు.