లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌ : రక్తంలో 20 శాతం పెరిగిన షుగర్ లెవల్

10TV Telugu News

కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్‌ మన జీవితాలను చాలా రకాలుగా మార్చేసింది. లాక్‌డౌన్‌ విధించడంతో చాలా కంపెనీలు వర్క్‌ ఫ్రం హోం ప్రకటించాయి. దీంతో ఇంట్లోనే ఎక్కువసేపు కూర్చోవాల్సి రావడం, బాడీకి వ్యాయామం లేకపోవడంతో జీవక్రియ వ్యవస్థ గందరగోళంగా మారింది. ఫలితంగా మధుమేహం, ఇతర దీర్ఘకాలిక ఆరోగ్య వ్యాధులతో బాధపడేవారికి ప్రమాదం ఎక్కువైంది. నిజానికి లాక్‌డౌన్‌ సమయంలో డయాబెటిక్ రోగుల రక్తంలో గ్లూకోజ్‌ స్థాయి 20% వరకు పెరిగినట్లు ఓ ఆరోగ్య సంస్థ నివేదిక విడుదల చేసింది.

దేశవ్యాప్తంగా 8,200 మంది డయాబెటిక్ రోగులను బీటో అనే ప్రైవేట్ హెల్త్‌కేర్ సంస్థ సర్వే చేసింది. పరిశోధనల ప్రకారం, మార్చి వరకు సగటు రీడింగ్‌ 135 mg / dL వరకు ఉండగా, ఏప్రిల్ మధ్య నాటికి 165 mg / dL వరకు పెరిగాయని సంస్థ వెల్లడించింది. ఒత్తిడి, ఆందోళన, జీవనశైలిలో మార్పులు, నిశ్చల అలవాట్లు, పరిమిత శారీరక శ్రమ వల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరిగి ఉండొచ్చని సంస్థ తెలిపింది. ముఖ్యంగా ఉత్తర, పశ్చిమ, ఈశాన్య భారతదేశంలోని ప్రజల్లో ఎక్కువగా చక్కెర స్థాయి పెరిగినట్లు సూచించింది.

ఒత్తిడి, ఆందోళన పెరగడం, జీవనశైలిలో మార్పులు ఆరోగ్యాన్ని దెబ్బతీశాయని, ఇది దీర్ఘకాలిక సమస్యలకు దారితీస్తుందని సంస్థ తెలిపింది. రక్తంలో గ్లూకోజ్‌ స్థాయిని సకాలంలో గుర్తించి తగిన ఆరోగ్య సంరక్షణ చర్యలు చేపట్టకపోతే ఊబకాయం, మంట వంటి కొత్త సమస్యలకు దారితీస్తుందని తెలిపింది. లాక్‌డౌన్‌లో చాలామంది ఇంట్లోనే రకరకాల వంటలు, స్వీట్లు తయారు చేసుకొని తిన్నారు. తీపి వస్తువుల వినియోగం కూడా పెరిగిందని బీటో సంస్థ తెలియజేసింది.

అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లను అనుసరించి, జీవనశైలిలో మార్పులు చోటు చేసుకోవడంతో డయాబెటిక్‌ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరిగినట్లు తెలిసింది. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడాన్ని ఎప్పుడూ తేలికగా తీసుకోకూడదు. ఇది శరీరానికి పోషకాలను సద్వినియోగం చేసుకోవడాన్ని కష్టతరం చేస్తుంది. శరీరాన్ని అనేక ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది. రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. దీర్ఘకాలిక ప్రమాదాలు వచ్చే అవకాశం ఉంది.

రక్తంలో చక్కెరస్థాయి తగ్గించడానికి చిట్కాలు

  • కూరగాయలు, పండ్లు, ధాన్యాలు, పప్పుధాన్యాలు, యాంటీ ఆక్సిడెంట్లు, తక్కువ కార్పోబైడ్రేట్లు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలి
  • సరైన ఆహార షెడ్యూల్‌ను తయారు చేసుకోవాలి
  • మీ రోజువారి ప్రణాళికలో శారీరక శ్రమ కలిగిన పనిని చేర్చుకోవాలి. ప్రతిరోజు వ్యాయామం చేయాలి
  • తేనె, బెల్లం వంటివి ఆరోగ్యానికి మంచిది
  • ఆహారం, వ్యాయామంతో పాటు నిద్ర కూడా చాలా ముఖ్యం. తప్పకుండా 7 నుంచి 8 గంటల పాటు నిద్రపోవాలి
  • నీరు బాగా తాగాలి
  • మధుమేహం ఉన్నవారు గ్లూకోజ్‌ స్థాయిని ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించుకొని, తగిన మందులు వాడుతుండాలి

Read:రూటు మార్చిన పతాంజలి.. కరోనాకు మందు కనిపెట్టలేదు