పొగాకులోని నికోటిన్ తో కరోనా వైద్యం, ఫ్రాన్స్‌లో తాజా అధ్యయనంలో వెల్లడైన కొత్త విషయం

పొగాకులోని నికోటిన్ తో కరోనా వైద్యం, ఫ్రాన్స్‌లో తాజా అధ్యయనంలో వెల్లడైన కొత్త విషయం

కంటికి కనిపించని సూక్ష్మజీవి కరోనా వైరస్‌ మానవాళి మనుగడను ప్రశ్నార్థకం చేస్తోంది. చాపకింద నీరులా ప్రబలుతూ లక్షలాది మంది ప్రాణాలు బలిగొంటోంది. ఇంతవరకు కోవిడ్‌-19 జన్యుక్రమానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కాకపోవడంతో పూర్తిస్థాయిలో వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చేందుకు మరికొన్ని నెలల సమయం పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వ్యాక్సిన్ తయారీ దిశగా ముమ్మరంగా ప్రయోగాలు జరుగుతున్నాయి.

నికోటిన్ లో వైరస్‌ ప్రభావాన్ని తగ్గించే శక్తి:
ఇదిలా ఉంటే, ఓ కొత్త విషయం వెలుగు చూసింది. ప్రాణాంతక కరోనా వైరస్‌ సోకకుండా.. దాని ప్రభావాన్ని తగ్గించే శక్తి పొగాకులోని నికోటిన్‌కు ఉందని తేలింది. పొగతాగని వారితో పోలిస్తే సిగరెట్లు తదితర పొగాకు ఉత్పత్తులు సేవించే వారిపై మహమ్మారి తక్కువ ప్రభావం చూపిస్తుందట. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమే అంటున్నారు ఫ్రాన్స్‌ పరిశోధకులు. మేజర్‌ పారిస్‌ ఆస్పత్రిలో ఈ మేరకు తాము జరిపిన పరిశోధనల్లో పొగాకులోని నికోటిన్‌ కరోనా సోకకుండా అడ్డుపడుతున్న విషయం వెల్లడైందని అధ్యయనంలో తెలిపారు. ఆరోగ్య శాఖ నుంచి ఆమోదం లభిస్తే పేషెంట్లతో పాటు వైద్య సిబ్బందికి కూడా నికోటిన్‌ ప్యాచులు(నికోటిన్‌ నింపిన బ్యాండేజ్‌ వంటి అతుకు) ఉపయోగించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. కేవలం స్మోక్‌ చేసే అలవాటు ఉన్న వారిపై క్లినికల్‌ ట్రయల్స్‌ చేసే అవకాశం ఉందని తెలిపారు. అయితే కరోనా వ్యాప్తి నేపథ్యంలో పొగతాగమని ప్రజలను ప్రోత్సహించే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశారు. స్మోకింగ్‌ కారణంగా ఊపిరితిత్తులు పాడైపోయి చనిపోతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉందని తెలిపారు.

కరోనా వైరస్ రక్త కణాలకు అంటకుండా అడ్డుకుంటున్న నికోటిన్:
పొగాకులోని నికోటిన్ కరోనా వైరస్ శరీరంలోని రక్త కణాలకు అంటకుండా సమర్థవంతంగా పనిచేస్తోందని ఫ్రాన్స్ కు చెందిన రీసెర్చర్ల బృందం చెబుతోంది. తాము పరిశీలించిన గణాంకాలు దీన్నే నిరూపిస్తున్నాయని, అయితే, ఈ విషయంలో ఇప్పటికిప్పుడు ఓ నిర్ధారణకు రాకుండా, మరింత అధ్యయనం చేస్తున్నామని అధ్యయనకర్తల్లో ఒకరైన జహీర్ అమౌరా చెప్పారు. పారిస్ లోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో కరోనా చికిత్స నిమిత్తం చేరిన 343 మందితో పాటు, స్వల్పంగా వైరస్ లక్షణాలున్న 139 మందిని పరిశీలించామని, వీరిలో కేవలం ఐదుగురు మాత్రమే పొగతాగే వారున్నారని ఆయన తెలిపారు. ఫ్రాన్స్ లో 35 శాతం మంది ప్రజలు స్మోకర్లేనని గుర్తు చేసిన ఆయన, ఆ నిష్పత్తి ప్రకారం, పొగతాగే వారిలో 150 మందికి పైగా వ్యాధి సోకాలని, కానీ అది జరుగలేదని అన్నారు.

శరీరంలోకి వైరస్‌ ప్రవేశించకుండా అడ్డుకుంటున్న నికోటిన్:
ఈ విషయం గురించి ఫ్రెంచ్‌ న్యూరోబయోలజిస్ట్‌ జీన్‌ పెర్రె చాంగెక్స్‌ మాట్లాడుతూ… కరోనా వైరస్‌ శరీరంలోకి ప్రవేశించకుండా పొగాకులోని నికోటిన్‌ అడ్డుకునే అవకాశాలు ఉన్నట్లు తమ పరిశోధనలో తేలిందన్నారు. నికోటిన్‌ సెల్‌ రెసెప్టార్స్‌ను అంటిపెట్టుకుని ఉండటం వల్ల శరీరంలో వైరస్‌ను ప్రవేశించకుండా అడ్డుకుంటోందని చెప్పారు. కాగా మార్చిలో ప్రచురించిన చైనీస్‌ అధ్యయనంలో కూడా పరిశోధకులు ఇదే తరహా అభిప్రాయాలు వ్యక్తం చేశారు. కరోనా సోకిన ప్రతీ వెయ్యి మందిలో పొగతాగేవారు 12.6 శాతం ఉండగా… ధూమపానం చేయని వారు 28 శాతంగా ఉన్నట్లు తేలింది.

కరోనా బాధితుల్లో ఎక్కువమంది పొగతాగని వారే:
ఇక ఫ్రాన్స్‌ గణాంకాల ప్రకారం పారిస్‌లో కరోనాతో ఆస్పత్రిపాలైన 11 వేల మంది రోగుల్లో 8.5 శాతం మంది స్మోకర్లు కాగా… దేశవ్యాప్తంగా వీరి సంఖ్య 25.4 శాతంగా ఉంది. ఈ గణాంకాలను బట్టి నికోటిన్‌ తీసుకునే వారిపై కరోనా ప్రభావం తక్కువగా ఉన్నట్లు అంచనా వేసినట్లు తాజా అధ్యయనం తెలిపింది. ఇదిలా ఉండగా.. పొగతాగడం వల్ల ఫ్రాన్స్‌లో ఏడాదికి సగటున దాదాపు 75 వేల మంది మృత్యువాత పడుతున్నారు. ఇక కరోనాతో ఇప్పటి వరకు ఫ్రాన్స్‌లో దాదాపు 21 వేల మంది మరణించారు.

మొత్తంగా పొగ తాగేవారికి కరోనా త్వరగా సోకడం లేదని, పొగాకులోని నికోటిన్ కరోనా వైరస్ సోకకుండా వారిని కాపాడుతోందని శాస్త్రవేత్తలు చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. కరోనాను కట్టడి చేసేందుకు ‘నికోటిన్ పాచెస్’ అనే కొత్త వైద్య విధానాన్ని ఫ్రాన్స్ శాస్త్రవేత్లలు అభివృద్ధి చేయడం చర్చకు దారితీసింది.