అపోహలు.. వాస్తవాలు : non-veg తింటే.. కరోనా వైరస్ వస్తుందా? 

  • Published By: sreehari ,Published On : February 6, 2020 / 02:11 AM IST
అపోహలు.. వాస్తవాలు : non-veg తింటే.. కరోనా వైరస్ వస్తుందా? 

ప్రాణాంతక కరోనా వైరస్.. ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తోంది. చైనాలోని వుహాన్ సిటీ నుంచి ఉద్భవించిన ఈ వైరస్.. ప్రపంచ దేశాలకు పాకింది. భారత్ సహా దాదాపు 30 దేశాల్లోకి కరోనా వ్యాపించింది. కరోనా వైరస్ వ్యాప్తితో ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాలో అనేక పుకార్లు వ్యాప్తిస్తున్నాయి. వైరస్ కు సంబంధించి తప్పుడు సమాచారం సోషల్ ప్లాట్ ఫాంల్లో ఎక్కువగా వైరల్ అవుతున్నాయి.

దీనిపై స్పందించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని నియంత్రించాలని పిలుపునిచ్చింది. కరనో వైరస్ విషయంలో ఆందోళన పడాల్సిన అవసరం లేదని.. అసలు ఈ వైరస్ ఎలా వ్యాప్తి చెందుతుంది? అపోహలు.. వాస్తవాలు ఏంటో తెలియజేసేందుకు ఓ జాబితాను విడుదల చేసింది. ఆ అపోహాలు.. వాస్తవాలేంటో ఓసారి లుక్కేయండి.

అపోహ : కరోనా వైరస్ పెంపుడు జంతువుల ద్వారా వస్తుంది :
వాస్తవం :
WHO డేటా ప్రకారం.. జంతువులు లేదా పెంపుడు జంతువుల నుంచి కరోనా వైరస్ సోకుతుంది అనడానికి ప్రస్తుతానికి ఎలాంటి ఆధారాలు లేవు. ఇళ్లల్లో పెంచుకునే పిల్లులు, కుక్కల ద్వారా 2019-nCoV లేదా కరోనా వైరస్ వ్యాపిస్తుందనడానికి వైద్యపరంగా కచ్చితమైన ఆధారాలు లేవని తెలిపింది.

అపోహ : జంతువుల మాంసాన్ని తింటే వైరస్ వస్తుంది :
వాస్తవం :
ఈ కొత్త కరోనా వైరస్ అనేది శ్వాసకోశ వైరస్.. ఇది ప్రథమంగా వైరస్ సోకిన వ్యక్తి నుంచి మరొకరికి గాలి ద్వారా వ్యాపిస్తుంది. అతడు తుమ్మడం లేదా దగ్గడం చేసిన సమయంలో నోటిలోని లాలాజలం నుంచి లేదా ముక్కు నుంచి విడుదలైన నీటి అణువులు ద్వారా పక్కనే ఉన్న వ్యక్తికి సోకుతుంది. వారిలోని వైరస్ గాలిద్వారా ఇతరులకు ఈజీగా వ్యాపిస్తుంది.

corona virus

అపోహ : జంతువుల నుంచి 2019-nCoV మనుషులకు వైరస్ సోకింది :
వాస్తవం :
ఈ విషయంలో WHO ఏమంటుంది అంటే.. కరోనా వైరస్ అనేది జంతువుల్లో వ్యాపిస్తోందని చాలామందికి తెలుసు. కానీ, అది మనుషులకు ఇప్పటివరకూ సోకినట్టు దాఖలాలు లేవు. లైవ్ యానిమల్ మార్కెట్లోని జంతువుల మూలాల నుంచి కొంత వైరస్ వ్యాపించే అవకాశం ఉంది. మనుషులకు ఈ వైరస్ ఇన్ఫెక్షన్ సోకడానికి చైనాలోని సీఫుడ్ మార్కెట్ ఒక కారణంగా చెప్పవచ్చు.

అపోహ : ఒక వ్యక్తికి జ్వరం లేదా జలుబు ఉంటే అర్థం.. కరోనా వైరస్ ఉన్నట్టే :
వాస్తవం :
కరోనా వైరస్ సోకిన వ్యక్తికి కూడా జ్వరం లేదా జలుబుతో పాటు శ్వాసపరమైన సమస్యలు కూడా ఉంటాయి. దగ్గు, ముక్కు నుంచి తరచూ నీరు కారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఒకవేళ ఆ వ్యక్తికి 2019-nCov వైరస్ ఉందో లేదో ల్యాబరేటరీలో టెస్ట్ ద్వారా నిర్ధారించాల్సి ఉంది.

వాస్తవానికి.. WHO.. ఎవరికైనా దగ్గు, జ్వరం.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉంటే వెంటనే వైద్యసాయం తీసుకోవాలని సూచిస్తోంది. ఇలాంటి వ్యక్తులు తాము ఇటీవల ఎక్కడికి వెళ్లివచ్చారో వంటి వివరాలను వైద్యులకు తప్పక చెప్పాల్సి ఉంటుంది. లేదా 2019-nCoV లక్షణాలు కలిగిన వ్యక్తితో కలిసి ఉన్నా కూడా ఈ వైరస్ సోకే అవకాశాలు ఎక్కువ.

అపోహ : చైనా నుంచి లేదా వైరస్ ప్రభావిత ప్రాంతం నుంచి ఏదైనా ప్యాకేజీ తీసుకోవడం సురక్షితం కాదు :
వాస్తవం : అలాంటిది ఏమి ఉండదు.. సురక్షితమే.. ఇది పుకారు మాత్రమే. చైనా నుంచి లేదా కరోనా వైరస్ ప్రభావిత ప్రాంతం నుంచి వచ్చిన ఏదైనా ప్యాకేజీలను తీసుకుంటే వాటి నుంచి ఎలాంటి వైరస్ సోకదు. ఎందుకంటే.. కరోనా వైరస్ ఆయా లెటర్లు లేదా ప్యాకేజీల ఉపరితలంపై ఎక్కువ గంటలు జీవించలేవని డబ్ల్యూహెచ్ఓ స్పష్టం చేసింది.

అపోహ : 2019-nCoV వైరస్‌ను యాంటిబయోటిక్స్, ట్రీట్‌మెంట్‌తో సమర్థవంతంగా అడ్డుకోగలవు :
వాస్తవం : యాంటి బయోటిక్స్ వైరస్ లపై పనిచేయవు. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లపై మాత్రమే యాంటిబయోటిక్స్ పనిచేస్తాయి. నోవల్ కరోనావైరస్ అనేది ఒక వైరస్.. దీని నివారణ కోసం చికిత్స లేదా యాంటి బయోటిక్స్ తీసుకోవడం మంచిది కాదని గుర్తించుకోవాలి.

అపోహ : కరోనా వైరస్ పెద్దవాళ్లకే వ్యాప్తిస్తుంది.. చిన్న పిల్లలకు రాదు :
వాస్తవం : కరోనా వైరస్.. చిన్నాపెద్దా అనే తేడా ఉండదు.. అదో వైరస్.. గాలి ద్వారా వ్యాపిస్తుంది. ఎవరికైనా ఈ వైరస్ వ్యాప్తిస్తుంది. చిన్నారులు, పెద్దలు, పురుషులు, మహిళలు ఇలా అందరికి వ్యాపిస్తుంది. ఇక డయాబెటిస్, గుండె జబ్బులు ఉన్నవారికి ఈ వైరస్ సోకితేతీవ్ర ఆరోగ్యానికి గురికావొచ్చు.

అపోహ : కరోనా వైరస్ నివారణకు ప్రత్యేకమైన మందులు, చికిత్స అందుబాటులో ఉన్నాయి :
వాస్తవం : ఈ రోజు వరకు.. నోవల్ కరోనా వైరస్ నివారించేందుకు ఎలాంటి ప్రత్యేకమైన మెడిసిన్స్ గానీ ట్రీట్ మెంట్ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా అందుబాటులో లేదు. 2019-nCoV సోకిన వారికి లక్షణాలను బట్టి తీవ్రతను తగ్గించేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వైరస్ ప్రభావంతో తీవ్ర అనారోగ్యానికి గురైనవారికి ప్రత్యేకమైన వార్డులో ఉంచి వైద్యసాయం అందేలా చూడాలి.

కరోనా వైరస్ సోకకుండా ఉండేందుకు.. సాధారణ పద్దతులను అనుసరించాలి. చేతులు కడుక్కోవడం, ముఖానికి సురక్షితమైన మాస్క్ లు ధరించడం, శుభ్రమైన ఆహార పదార్థాలను తీసుకోవడం, దగ్గడం, తుమ్మడంతో పాటు శ్వాసకోస సమస్యల లక్షణాలు ఉంటే అట్టివారికి దూరంగా ఉండేందుకు ప్రయత్నించడం చేయాలి.