సీరమ్ కోవిడ్ వ్యాక్సిన్ 4 కోట్ల డోస్‌లతో రెడీ.. వచ్చే జనవరిలోనే అందుబాటులోకి!

  • Published By: sreehari ,Published On : November 12, 2020 / 07:46 PM IST
సీరమ్ కోవిడ్ వ్యాక్సిన్ 4 కోట్ల డోస్‌లతో రెడీ.. వచ్చే జనవరిలోనే అందుబాటులోకి!

Serum covid vaccine to January : సీరమ్ ఇన్సిస్ట్యూట్ ఆఫ్ ఇండియా (SII) నాలుగు కోట్ల కరోనా వ్యాక్సిన్ డోస్‌లను సిద్ధం చేసింది. ఇప్పటికే SII సంస్థ 40 మిలియన్ల డోస్‌ల కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి చేయగా.. DCGI నుంచి లైసెన్స్ ఆమోదం కోసం ఎదురుచూస్తోంది.



ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడిసిన్ రీసెర్చ్ (ICMR) సహకారంతో భారతదేశంలో సీరమ్ తమ కరోనా వ్యాక్సిన్‌ను వచ్చే ఏడాది 2021 జనవరి నాటికి అందుబాటులోకి తీసుకురానుందని సీరమ్ సంస్థ సీఈఓ అదార్ పూనవాలా ఒక ప్రకటనలో వెల్లడించారు.

భారత్, యూకేలో ట్రయల్స్ ఫలితాల ఆధారంగా రెగ్యులేటరీల నుంచి ఆమోదం కోసం ఎదురుచూస్తున్నామని అన్నారు. అన్ని అనుకున్నట్టుగా జరిగితే.. జనవరి 2021 నాటికి భారత్ లో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నట్టు తెలిపారు.



భారత్‌లో కరోనా వ్యాక్సిన్ Covishield మూడో దశ క్లినికల్ ట్రయల్స్ నమోదు పూర్తి అయిందని SII, ICMR ప్రకటించాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా SII, ICMR కంపెనీలు 15 వేర్వేరు ప్రదేశాల్లో Covishield వ్యాక్సిన్ పై 2/3వ దశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నాయి. ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ/ఆస్ట్రాజెనికా భాగస్వామ్యంలో సీరమ్ పూణె ల్యాబరేటరీలో Covishield వ్యాక్సిన్ అభివృద్ధి చేశారు.



యూకేలో రూపొందిన ఈ వ్యాక్సిన్ ప్రస్తుతం యూకే, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా, అమెరికాలో పెద్ద ఎత్తున టెస్టింగ్ జరుగుతోంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం.. భారతదేశంలో కరోనా కేసుల సంఖ్య 86,83,916కు చేరింది.



మరణాల సంఖ్య 1,28,121కి చేరింది. కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 80,66,501 మందికి చేరింది. వరుసగా రెండో రోజున దేశవ్యాప్తంగా కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 5 లక్షల కంటే తక్కువగా నమోదయ్యాయి.