హార్ట్ ఎటాక్ వచ్చినా భయపడొద్దు.. శృంగారంతో ఆయుష్షు పెంచుకోవచ్చు : స్టడీ

  • Published By: sreehari ,Published On : September 29, 2020 / 10:01 PM IST
హార్ట్ ఎటాక్ వచ్చినా భయపడొద్దు.. శృంగారంతో ఆయుష్షు పెంచుకోవచ్చు : స్టడీ

Sex after heart attack : గుండెపోటు రాగానే అందరూ భయపడిపోతుంటారు.. ఎక్కువ కాలం బతకలేమని ఆందోళన చెందుతుంటారు. ఎప్పుడు మళ్లీ గుండె పోటు వస్తుందోనని కలత చెందుతుంటారు. గుండె పోటు వచ్చిన తర్వాత కోలుకున్న వారు తమ జీవితకాలాన్ని పెంచుకునే అవకాశం ఉంది.



దానికి శృంగారం ఒక్కటే మార్గం.. శృంగారంలో ఎక్కువగా యాక్టివ్ గా ఉండటమే. శృంగారంతో హృద్రోగ వ్యాధిగ్రస్థుల్లో జీవితకాలం పెరిగిందని ఓ అధ్యయనం వెల్లడించింది. 1992 లేదా 1993లో గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన 65 ఏళ్లు అంతకంటే తక్కువ వయస్సు గల 500 మంది వ్యక్తుల శృంగారానికి సంబంధించి డేటాను పరిశోధకుల బృందం విశ్లేషించింది.

90 శాతం మంది పురుషులే :
హృద్రోగుల్లో జనాభా సగటు వయస్సు 53ఏళ్లు కాగా వారిలో 90% మంది పురుషులే (heart attack survivors) ఉన్నారంట.. డేటా ప్రకారం.. గుండెపోటు వచ్చిన తర్వాత 22 ఏళ్లలో 43% మంది రోగులు మరణించారు. కానీ, గుండెపోటు వచ్చాక కోలుకున్నాక.. మొదటి ఆరు నెలల్లో శృంగారానికి దూరంగా ఉన్న వారితో పోలిస్తే.. ఎక్కువ సార్లు శృంగార కార్యకలాపాల్లో పాల్గొన్న వారిలో మరణానికి 35% తక్కువ ప్రమాదం ఉన్నట్లు కనుగొన్నారు. రెగ్యులర్‌గా లైంగిక కార్యకలాపాలు (regular sex routine) కొనసాగించిన వారిలో హృదయ సంబంధ మరణాలే కాకుండా క్యాన్సర్ వంటి మరణాలు కూడా తగ్గాయని కనుగొన్నారు.



లైంగికత, లైంగిక కార్యకలాపాలే జీవితకాలాన్ని పెంచడానికి దోహదపడతాయని టెల్ అవీవ్ యూనివర్శిటీలోని ప్రధాన పరిశోధకుడు, స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ హెడ్ యారివ్ గెర్బెర్ ఒక ప్రకటనలో తెలిపారు. గుండెపోటు వచ్చిన వెంటనే లైంగిక కార్యకలాపాలను తిరిగి ప్రారంభించడం ఆరోగ్యకరమైన చర్యగా పరిశోధకులు వెల్లడించారు.

శృంగారం.. శారీరక వ్యాయామంలో భాగమే :
ఆరోగ్యకరమైన జీవనశైలికి బాటలు వేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. లైంగిక చర్య అనేది శారీరక వ్యాయామంలో ఒక భాగమన్నారు. హృదయ స్పందన రేటు, రక్తపోటును పెంచుతుందని గుర్తించారు. కొంతమందికి శృంగారం తర్వాత గుండెపోటుకు కారణమయ్యే అవకాశం కూడా ఉందన్నారు.



అయినప్పటికీ, క్రమం తప్పకుండా శారీరక శ్రమ చేయడం వల్ల గుండె సంబంధిత ఫలితాల దీర్ఘకాలిక ప్రమాదాన్ని తగ్గిస్తుందని అధ్యయనంలో తేలింది. యూరోపియన్ జర్నల్ ఆఫ్ ప్రివెంటివ్ కార్డియాలజీలో గత వారం ఈ అధ్యయనాన్ని ప్రచురించారు. వాస్తవానికి.. గుండెపోటు తర్వాత శృంగారం చేస్తుంటే.. దీర్ఘకాలిక జీవితకాల మనుగడను పెంచుతుందని రుజువు కాలేదు. కానీ రెండింటికి జీవితం కాలం పెరగడానికి మధ్య స్పష్టమైన సంబంధం ఉందని ఈ అధ్యయనంలో గుర్తించారు.