Hand Sanitizers: శానిటైజర్‌ అతిగా వాడుతున్నారా? ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? అసలు ఎప్పుడు వాడాలో తెలుసుకుందాం

కరోనా భయంతో శానిటైజర్ వాడకం మొదలైంది. తెగ వాడేస్తున్నారు. అయితే, శానిటైజర్ అతిగా వాడితే ప్రమాదమా? ఆరోగ్యానికి హానికరమా? అసలు వీటిని ఎప్పుడు వాడాలి?

Hand Sanitizers: శానిటైజర్‌ అతిగా వాడుతున్నారా? ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? అసలు ఎప్పుడు వాడాలో తెలుసుకుందాం

Hand Sanitizers

Hand Sanitizers : ప్రస్తుతం మనిషి జీవితం కరోనాకు ముందు, తర్వాత అని చెప్పొచు. గత ఏడాది(2020) నుంచి కరోనావైరస్ మహమ్మారి మనల్ని వెంటాడుతూనే ఉంది. కరోనా ఎప్పుడైతే ఎంటర్ అయ్యిందో అందరి జీవన శైలి మారిపోయింది. మన జీవితంలోకి మాస్కులు, శానిటైజర్లు ఎంట్రీ ఇచ్చాయి. కరోనాను కట్టడి చేయాలంటే చేతులను తరచుగా శుభ్రపరచుకోవడం, మాస్కులను ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరిగా పాటించాలని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ఇక ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. బయటకు వెళితే మాస్కులను తప్పనిసరిగా ధరిస్తూనే.. చేతులను శుభ్రపరచుకోవడానికి శానిటైజర్స్ ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అలా, కరోనా భయంతో శానిటైజర్ వాడకం మొదలైంది. కాగా, కరోనా వెలుగులోకి రాకముందు ఈ హ్యాండ్ శానిటైజర్లను మెడికల్ సిబ్బంది మాత్రమే ఎక్కువగా ఉపయోగించేవారు. ఇప్పుడు కరోనా దెబ్బతో అంతా తెగ వాడేస్తున్నారు.

అయితే, శానిటైజర్ అతిగా వాడితే ప్రమాదమా? ఆరోగ్యానికి హానికరమా? అసలు వీటిని ఎప్పుడు వాడాలి? దీనిపై క్లారిటీ ఇచ్చారు వైద్య నిపుణులు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి శానిటైజర్స్ అందుబాటులోకి వచ్చాయి. వ్యక్తిగత శుభ్రత కోసం ఎక్కువగా శానిటైజర్స్ వినియోగించడం కూడా అనారోగ్యానికి కారణమని వైద్య సిబ్బంది హెచ్చరిస్తున్నారు. ఎక్కువసార్లు చేతులను శుభ్రపరచుకోవడానికి శాని టైజర్ వాడటం వల్ల మన అర చేతుల్లోని మంచి బ్యాక్టీరియాకు హాని జరుగుతుందట. ఈ మంచి బ్యాక్టీరియా మన చర్మాన్ని, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచటంలో ఎంతో ఉపయోగపడుతుంది. అటువంటి ఈ మంచి బ్యాక్టీరియా మన శరీరంలోకి వెళ్లకపోతే మనం రోగాల బారిన పడటం ఖాయమట.

* శానిటైజర్‌ అతిగా వాడటం వల్ల చేతుల్లోని మంచి బ్యాక్టీరియా చనిపోతుంది. చెడు బ్యాక్టీరియా శక్తివంతంగా తయారవుతుంది. చెడు బ్యాక్టీరియా శానిటైజర్‌కు అలవాటు పడి, నిరోధక శక్తిని పెంచుకుంటుంది. దీంతో అప్పుడు మనం శానిటైజర్‌తో స్నానం చేసినా లాభం లేకుండా పోతుందని అంటున్నారు. అందుకే అవసరం ఉన్నప్పుడు మాత్రమే వాడితే ఏ ఇబ్బందులూ ఉండవు.

* ఎక్కుగా శానిటైజర్స్ వాడే బదులు.. సబ్బు, నీళ్లను చేతులను శుభ్రపరచుకోవడానికి ఉపయోగించాలని నిపుణులు సూచిస్తున్నారు. సబ్బుతో శుభ్రంగా చేతులను కడుక్కోవడం ద్వారా క్రిములను నివారించవచ్చని చెబుతున్నారు.

* సబ్బు, నీళ్లు అందుబాటులో ఉన్నప్పుడు శానిటైజర్‌ ఉపయోగించకండి. అవి లేకపోతేనే దీని అవసరం ఉందని గుర్తించండి. సబ్బుతో 20 సెకన్ల పాటు రుద్దితే క్రిముల్ని తరిమికొట్టొచ్చని వైద్యులు చెబుతున్నారు. భయంతో అస్తమానం రాసుకోవడం వల్ల అదొక వ్యసనంలా మారుతుంది.

* చేతులకు విపరీతమైన దుమ్ము ఉన్నప్పుడు శానిటైజర్‌ రాసుకున్నా ఫలితం ఉండదు. అవి క్రిములను చంపలేవు సరికదా ఇంకా అపరిశుభ్రతను సృష్టిస్తుంది. కాబట్టి నీళ్లు అందుబాటులో లేనప్పుడు, రద్దీ ప్రదేశాల్లో, ప్రయాణాల్లో మాత్రమే శానిటైజర్‌ ఉపయోగించండి.

* మరికొందరు కోవిడ్ భయంతో దగ్గినా తుమ్మినా వెంటనే చేతులకు శానిటైజర్ రాసుకుంటున్నారు. ఇలా చేయటం వల్ల ఏ లాభమూ ఉండదని డాక్టర్లు అంటున్నారు. గాల్లోని క్రిములను శానిటైజర్ చంపలేదని.. అందుకని భయాందోళనకు గురి కాకుండా తరచుగా శానిటైజర్స్ వాడకం తగ్గించుకోవాలని సూచిస్తున్నారు.

* ఇక లాక్ డౌన్ సమయంలో మద్యం దొరక్కపోవడంతో కొందరు మందుబాబులు కిక్ కోసం శానిటైజర్స్ తాగి మరణించారు. ఇది తాగడం వల్ల అనారోగ్యానికి గురవుతారని.. ఊపిరితిత్తులు దెబ్బతిని లిపిడ్ న్యుమోనియా వస్తుందని వైద్య నిపుణులు తెలిపారు. అంతేకాదు క్రమంగా కిడ్నీలు పాడవుతాయని.. స్వల్ప కాలంలోనే వాంతులు, విరేచనాలతో చనిపోతారని అన్నారు. అందుకని శానిటైజర్ తాగడం ప్రాణాంతకం అని హెచ్చరించారు.