స్పెయిన్‌లో ప్రభుత్వ నియంత్రణలోకి ప్రైవేట్ ఆస్పత్రులు.. ఇండియాలో ఇది సాధ్యమేనా?

  • Published By: sreehari ,Published On : March 17, 2020 / 12:26 PM IST
స్పెయిన్‌లో ప్రభుత్వ నియంత్రణలోకి ప్రైవేట్ ఆస్పత్రులు.. ఇండియాలో ఇది సాధ్యమేనా?

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. వేలాదిమంది చనిపోతున్నారు. లక్షల్లో బాధితులు చేరిపోతున్నారు. రోజురోజుకీ వైరస్ తీవ్రస్థాయిలో వ్యాపిస్తోంది. వేలాది మందికి చికిత్స అందించేందుకు ఐసోలేషన్ వార్డులు సరిపోవడం లేదు. వైరస్ బాధితుల సంఖ్య పెరిగిపోతుండటంతో వారికి చికిత్స చేసేందుకు ఐసోలేషన్ వార్డుల అవసరం ఎంతైనా ఉంది.

ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో స్పెయిన్ ప్రభుత్వం కరోనా కంట్రోల్ చేసేందుకు అన్ని ప్రైవేట్ ఆస్పత్రులను తమ నియంత్రణలోకి తీసుకొచ్చింది. చైనా తర్వాత తీవ్రస్థాయిలో కరోనా ప్రభావాన్ని ఎదుర్కొన్న దేశాల్లో స్పెయిన్ దేశం ఒకటి. కరోనా వైరస్ కంట్రోల్ చేసేందుకు స్పెయిన్ ప్రభుత్వం తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తోంది.

అదే భారత్ విషయానికి వస్తే.. ఇక్కడ ప్రైవేట్ ఆస్పత్రులను నియంత్రణలోకి తీసుకునే ప్రక్రియ సాధ్యమేనా? అనే ప్రశ్న తలెత్తుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ విధానం ఆచరణీయమైన విషయం కాదని అనిపిస్తోంది. వైరస్ ప్రభావ పరిస్థితులు మరింత భయాందోళనకరంగా మారినప్పుడు మాత్రమే ఈ తరహా సంసిద్ధతకు దారితీసే అవకాశం ఉండేలా కనిపిస్తోంది.

అంతకంటే ముందుగానే భారత్ తక్షణమే చేయాల్సిన రెండు విషయాలు ఉన్నాయి. పబ్లిక్ ప్రాంతాల్లో ఎక్కువమంది ఒకే చోట చేరకుండా నిషేధం విధించాలి. ప్రజల్లో పరిశుభ్రత, సామాజిక భద్రత అంశాలపై భారీగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. దేశంలో కొన్ని రాష్ట్రాల్లో జనం ఎక్కువ సంఖ్యలో గుమిగూడటాన్ని నిషేధం విధించారు.

షాపింగ్ మాల్స్, దేవాలయాలు, మసీదులు, ఇతర పబ్లిక్ ప్రదేశాలను మూసివేశారు. కానీ, అన్నిరాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కూడా కరోనా వ్యాప్తిపై అవసరమైన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. మరోవైపు కరోనా బాధితుల కోసం ఏర్పాటు చేసే ఆరోగ్య మౌలిక సదుపాయాలపై విస్తృత స్థాయిలో పనిచేయాల్సిన అవసరం ఉంది. వైరస్ వ్యాప్తి జరగకుండా ఉండేలా జాగ్రత్త చర్యలు చేపట్టాలి.

ప్రజారోగ్యం విషయంలో సమర్థవంతమైన ప్రయత్నాలు చేపట్టాలి. ప్రపంచ ఆరోగ్య అత్యవసర పరిస్థితి నుంచి భారతీయ పౌరులను రక్షించుకునేందుకు అవసరమైన చర్యలతో పాటు కంట్రోల్ మెకానిజాన్ని డెవలప్ చేయాల్సి ఉంది. వైరస్ సోకినట్టు అనుమానిస్తున్న బాధితులకు సమర్థవంతంగా టెస్టింగ్ నిర్వహించాలి. అప్పుడే కరోనా వైరస్ పూర్తి స్థాయిలో నియంత్రించగలమని గుర్తించాలి.