Black Fungus : కరోనా నుంచి కోలుకున్నా మరో ముప్పు.. బ్లాక్ ఫంగస్ అంటే ఏంటి? లక్షణాలేంటి? బతికే దారి ఉందా?

బ్లాక్ ఫంగస్.. బతికే దారే లేదే. కోవిడ్ నుంచి కోలుకున్న ఇక దిగులు లేదు అని అనుకోవడానికి లేదు. బ్లాక్ ఫంగస్ రూపంలో మరోక ప్రమాదం ముంచుకొస్తోంది. రోజురోజుకు పెరుగుతున్న కేసులు, నమోదవుతున్న మరణాలు వణుకు పుట్టిస్తున్నాయి. ఇంతకీ ఏంటి ఈ బ్లాక్ ఫంగస్? లక్షణాలు ఎలా ఉంటాయి? ఒక్కసారి అటాక్ అయితే ఇక మరణమేనా?

Black Fungus : కరోనా నుంచి కోలుకున్నా మరో ముప్పు.. బ్లాక్ ఫంగస్ అంటే ఏంటి? లక్షణాలేంటి? బతికే దారి ఉందా?

Black Fungus

Black Fungus : బ్లాక్ ఫంగస్.. బతికే దారే లేదే. కోవిడ్ నుంచి కోలుకున్న ఇక దిగులు లేదు అని అనుకోవడానికి లేదు. బ్లాక్ ఫంగస్ రూపంలో మరోక ప్రమాదం ముంచుకొస్తోంది. రోజురోజుకు పెరుగుతున్న కేసులు, నమోదవుతున్న మరణాలు వణుకు పుట్టిస్తున్నాయి. ఇంతకీ ఏంటి ఈ బ్లాక్ ఫంగస్? లక్షణాలు ఎలా ఉంటాయి? ఒక్కసారి అటాక్ అయితే ఇక మరణమేనా?

కరోనా నుంచి కోలుకున్నా బతుకుతామన్న ధీమా లేదు:
ధైర్యమంతా కూడదీసుకుని కరోనాను జయించినా బతికి బట్టకడతామన్న ధీమా లేకుండా పోతోంది. ఇప్పుడో కొత్త సమస్య వెన్నులో వణుకు పుట్టిస్తోంది. అదే బ్లాక్ ఫంగస్(మ్యూకర్ మైకోసిస్ జైకో మైకోసిన్). వైరస్ ను జయించిన వారిపై అటాక్ చేస్తూ డేంజర్ బెల్స్ మోగిస్తున్న ఈ ఫంగస్ మరణశాసనం లిఖిస్తోంది. ముందుగా మహారాష్ట్రలో కనిపించాయి ఈ కేసులు. ఆ తర్వాత ఢిల్లీని, గుజరాత్ ని టెన్షన్ పెట్టిస్తున్నాయి. తెలంగాణలోనూ బ్లాక్ ఫంగస్ బాధితులు ఉన్నారు. భైంసాలో కొందరిలో ఈ లక్షణాలు కనిపించాయి.

బ్లాక్ ఫంగస్ ఎలా, ఎందుకు అటాక్ చేస్తుంది?
కరోనావైరస్ ఊపిరితిత్తులను టార్గెట్ చేస్తే, బ్లాక్ ఫంగస్ అవయవాలను లక్ష్యంగా చేసుకుంటోంది. ముక్కు నుంచి ప్రారంభమై కళ్లకు వ్యాపిస్తోంది. కంటి చుట్టు ఉంటే కండరాలను స్తంబింపజేసి అంధత్వానికి దారి తీస్తుంది. ముక్కు నుంచి మెదడు వరకు పాకి మరణానికి దారి తీస్తోంది. ఒక్క మహారాష్ట్రలోనే ఈ ఫంగస్ కారణంగా ఇప్పటివరకు 52మంది చనిపోయారు. కరోనా పరిణామాల తర్వాత బ్లాక్ ఫంగస్ అనే పేరు భయపెడుతున్నా, నిజానికి ఇదేమి కొత్తది కాదు. వాతావరణంలో సహజంగా ఉండేదే. కరోనా నుంచి కోలుకున్న వారిని, బలహీనమైన రోగ నిరోధక వ్యవస్థ ఉన్నవారిలో ఈ ఇన్ ఫెక్షన్ ఎక్కువగా కనిపిస్తోంది. కరోనా చికిత్సలో ఎక్కువగా స్టెరాయిడ్స్ వాడటం ఈ ఫంగస్ అటాక్ చేసేలా చేస్తోంది.

బ్లాక్ ఫంగస్ లక్షణాలు:
గాలి పీల్చుకున్నప్పుడు ముక్కు ద్వారా లోపలికి వెళ్లే ఫంగస్ సైనస్, ఊపిరితిత్తుల్లోకి చేరుతోంది. శరీరానికి అయిన గాయాల ద్వారా కూడా లోనికి వెళ్లే అవకాశం ఉంటుంది. బ్లాక్ ఫంగస్ సోకితే ముఖంలో వాపు ఉంటుంది. ముక్కు దిబ్బడ సమస్య కనిపిస్తుంది. ముక్కు ఒకవైపు పూర్తిగా మూసుకుపోయినట్లు అనిపిస్తుంది. జ్వరం, జలుబు, దగ్గు లక్షణాలు కనిపిస్తాయి. ఛాతినొప్పితో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది. రక్తంతో కూడిన వాంతులు అవుతాయి. ఈ ఫంగస్ కానీ, మెదడుకి చేరితే మరణం అంచున నిలబడినట్టే. ఫంగస్ అటాక్ అయిన తర్వాత అది మెదడుకు చేరకుండా ఉండాలంటే ఒక కంటిని శాశ్వతంగా తొలగించే పరిస్థితి ఉంటుంది. దవడను సైతం కోల్పోయే ప్రమాదం ఉంది.

ప్రతి ఇద్దరిలో ఒకరి మరణం:
బ్లాక్ ఫంగస్ కేసుల్లో మరణాల రేటు 50శాతంగా ఉంది. అంటే వ్యాధి సోకిన ప్రతి ఇద్దరిలో ఒకరు చనిపోతున్నారన్నమాట. బ్లాక్ ఫంగస్ సోకిన వారిలో ఇప్పటికే మూడోవంతు మంది కంటి చూపు కోల్పోయారు. అయితే, దీన్ని ముందస్తుగానే గుర్తిస్తే ప్రమాదం నుంచి బయటపడొచ్చని నిపుణులు అంటున్నారు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత కూడా తలనొప్పి, శ్వాస సమస్యలు, కళ్లు ఎర్రగా మారి దురద ఉంటే వెంటనే అప్రమత్తమై డాక్టర్లను సంప్రదించాలని సూచిస్తున్నారు.

బ్లాక్ ఫంగస్ సోకిందో లేదో తెలుసుకోవడం ఎలా? కరోనా నుంచి కోలుకున్న తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏయే అంశాలపై ప్రధానంగా దృష్టి పెట్టాలి?
అసలే కరోనా ఉక్కిరిబిక్కిరి చేస్తోంతే, ఇప్పుడు బ్లాక్ ఫంగస్ రూపంలో మరో టెన్షన్ మహారాష్ట్ర ప్రభుత్వాన్ని వెంటాడుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో 2వేలకు పైగా బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయి. రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే చాన్సుంది. మిగతా రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది.

బ్లాక్ ఫంగస్ కు చికిత్స ఉందా?
బయాప్సీ పరీక్షల ద్వారా ఊపిరితిత్తులను, సీటీ స్కాన్ చేయడం ద్వారా బ్లాక్ ఫంగస్ ఇన్ ఫెక్షన్ సోకిందో లేదో నిర్ధారించవచ్చు. ఒకవేళ ఫంగస్ సోకినట్లు నిర్ధారిస్తే యాపోటెరిసన్ బి వంటి యాంటీ ఫంగల్ ఇంజెక్షన్లు ఇచ్చి ప్రాణాపాయం నుంచి కాపాడతారు. ల్యాంబ్(Lamb) అనే ఔషధాన్ని కూడా చికిత్సకు వినియోగిస్తున్నారు. ఈ బ్లాక్ ఫంగస్ చికిత్సలో భాగంగా ఒక్కొక్కటి రూ.9వేల విలువైన ఇంజెక్షన్లను 21 రోజుల పాటు ఇవ్వాల్సి వస్తుంది.

బ్లాక్ ఫంగస్ రాకుండా ఉండాలంటే:
కరోనా నుంచి కోలుకున్న తర్వాత హైపర్ గ్లూకోమియాను కంట్రోల్ లో ఉంచుకోవాలి. రక్తంలో గ్లూకోజ్ శాతాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించాలి. స్టెరాయిడ్ లను సరైన సమయంలో సరైన మోతాదులో తీసుకోవాలి. ఎక్కువగా ఉపయోగిస్తే ఫంగస్ కు ఎంట్రీ డోర్లు తెరిచినట్టే అని, నిపుణలు హెచ్చరిస్తున్నారు. యాంటీ బయాటిక్స్, యాంటీ ఫంగల్ ఔషధాలను కూడా సరైన మోతాదులో ఉపయోగించాలి. ఇష్టానుసారంగా ఉపయోగిస్తే మరింత ప్రమాదానికి దారి తీసే అవకాశాలు ఉంటాయి. ఇక కరోనా చికిత్స సమయంలో ఆక్సిజన్ అందించేటప్పుడు తేమ కోసం శుభ్రమైన నీటిని ఉపయోగించాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా బ్లాక్ ఫంగస్ ఎంటర్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చని నిపుణులు అంటున్నారు.