WHO జాబితాలో అత్యవసర వినియోగానికి ఫైజర్ కరోనా వ్యాక్సిన్..

WHO జాబితాలో అత్యవసర వినియోగానికి ఫైజర్ కరోనా వ్యాక్సిన్..

WHO lists Pfizer COVID-19 vaccine for emergency use : ప్రపంచాన్ని పట్టిపీడుస్తోన్న కరోనా మహమ్మారిని నిర్మూలించే వ్యాక్సిన్లు ఒక్కొక్కటిగా అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వ్యాక్సిన్లు ఇంకా అందుబాటులోకి రావాల్సి ఉంది. ముందుగా అత్యవసర వినియోగానికి మాత్రమే వ్యాక్సిన్లకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అనుమతినిస్తోంది. అత్యవసర వినియోగం కోసం WHO ఎంపిక చేసిన వ్యాక్సిన్ల జాబితాలో ఫైజర్ కరోనా వ్యాక్సిన్‌కు చోటు దక్కింది. కరోనా విజృంభిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యమైనంత తొందరగా అందరికి కరోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రపంచ దేశాలు పోటీపడుతున్నాయి.

అందులో భాగంగానే అత్యవసర వినియోగానికి కరోనా వ్యాక్సిన్లకు అనుమతి కోసం ఎదురుచూస్తున్నాయి. కొన్ని దేశాల్లో సొంత నియంత్రణ ఆమోద ప్రక్రియలను వేగవంతం చేసేందుకు WHO అనుమతినిస్తోంది. తద్వారా ఆయా దేశాలు కరోనా టీకాను త్వరగా దిగుమతి చేసుకోవచ్చు.. అలాగే వేగంగా వ్యాక్సినేషన్ నిర్వహించేందుకు అవకాశం ఉంటుందని WHO ఒక ప్రకటనలో పేర్కొంది. అత్యవసర వినియోగానికి ఆమోదం ఇవ్వడం ద్వారా ఎక్కువ సంఖ్యలో ప్రజలకు టీకా అందుబాటులోకి వచ్చేందుకు ఆస్కారం ఉంటుందని WHO అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ Mariângela Simão పేర్కొన్నారు.

కరోనా వ్యాక్సిన్లకు ప్రపంచమంతా అందించేందుకు ఇదే సరైన సమయమని ఆయన అన్నారు. ప్రపంచంలో ప్రతిచోటా ప్రాధాన్యత జాబితాలోని జనాభాకు తగినంత టీకా సరఫరాను అందించాల్సిన అవసరం ఉందని అంటున్నారు. ప్రపంచంలోని అన్ని దేశాలకు టీకాను సరఫరా చేయడంతో పాటుమహమ్మారిని నివారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. కానీ, టీకా సరఫరాను భద్రపరచడం చాలా ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. యునిసెఫ్, పాన్-అమెరికన్ హెల్త్ ఆర్గనైజేషన్ టీకాను అవసరమైన దేశాలకు పంపిణీ చేయడానికి వీలు కల్పిస్తుంది. ఐరోపా, యుఎస్ లేదా ఇతర సంపన్న దేశాలతో పాటు తక్కువ-ఆదాయ దేశాలు, ఉప-సహారా ఆఫ్రికాలో ఇతరులకన్నా ముందుగానే ఫైజర్ కరోనా వ్యాక్సిన్‌ను పొందే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది.