పెద్దలపైనే వైరస్ ప్రభావం: పిల్లల జోలికి ఎందుకు పోదంటే?

  • Published By: sreehari ,Published On : February 6, 2020 / 06:02 AM IST
పెద్దలపైనే వైరస్ ప్రభావం: పిల్లల జోలికి ఎందుకు పోదంటే?

ప్రపంచాన్ని వణికిస్తోంది కరోనా వైరస్.. చైనా నుంచి మొదలై భారత్ సహా ఇతర దేశాలకు ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తోంది ఈ మహమ్మారి. గాలిద్వారా వేగంగా వ్యాపించే ఈ వైరస్ ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా 563 మందిని బలితీసుకుంది. మరో 28వేల మంది వైరస్ బారిన పడ్డారు. కానీ, చిన్నపిల్లలపై కరోనా ప్రభావం చాలా తక్కువగా కనిపిస్తోంది.

పిల్లలపై కరోనా కనికరం :
అందుబాటులో ఉన్న డేటా ప్రకారం.. కొంతమంది చిన్నారులకే ఈ వైరస్ లక్షణాలతో బాధపడుతున్నట్టు వెల్లడించింది. పెద్దలపైనే పగబట్టిన ఈ మహమ్మారి.. పిల్లలపై జాలి చూపిందేమో.. అందుకే చిన్నారుల జోలికి వెళ్లడం తగ్గించింది. పెద్దలనే పట్టి పీడిస్తోంది. JAMAలో  ప్రచురించిన ఓ రిపోర్టు ప్రకారం.. కరోనా వైరస్ సోకినవారిలో 49 ఏళ్ల నుంచి 56 మధ్య వయస్సు ఉన్నవారే ఎక్కువ మంది ఉన్నట్టు తెలిపింది. పిల్లలకు కరోనా సోకిన కేసులు చాలా అరుదుగా పేర్కొంది. 

అయితే, ఎక్కువ మంది చిన్నారులపై కరోనా వైరస్ ప్రభావం ఎందుకు ఉండటం లేదంటే? హాంగ్ కాంగ్ యూనివర్శిటీలోని వైరాలజీ చీప్ వైద్యులు మాలిక్ పెయిరీస్ మాట్లాడుతూ..‘నేను గట్టిగా నమ్మేది ఒకటే.. యుక్త వయస్సువారికే వైరస్ సోకుతోంది. కానీ, వారిలో స్వల్ప వ్యాధి ప్రభావం ఉంటుంది’ అని అన్నారు. మరోవైపు శాస్త్రవేత్తలు కూడా చిన్నారుల్లో ఎక్కువగా ఈ వైరస్ సోకినట్టు చూడలేదు. స్వల వ్యాధి ఉన్న కేసులకు సంబంధించి డేటా తమ దగ్గర లేదని మాలిక్ తెలిపారు. ‘ప్రపంచవ్యాప్తంగా ఒకవేళ కరోనా వైరస్ సోకినట్టయితే.. అది సీజనల్ ఫ్లూ మాదిరిగానే వ్యాప్తి చెందుతుంది.. బహుషా మరిన్ని కేసులు మేం చూడాల్సిరావొచ్చు’ అని తెలిపారు. 

10 ఏళ్ల పిల్లాడికి కరోనా వైరస్ :
ఇటీవల తన కుటుంబ సభ్యులతో కలిసి వుహాన్ కు వెళ్లిన 10 ఏళ్ల బాలుడికి కూడా కరోనా వైరస్ సోకినట్టు ఒక కేసు నమోదైంది. దక్షిణ చైనాలోని షెన్‌జెన్ నగరం నుంచి తిరిగి వచ్చే ఇతర కుటుంబ సభ్యుల్లో వైరస్ సోకగా వారి వయస్సు 36ఏళ్ల నుంచి 66 ఏళ్ల మధ్య వయస్సు ఉంది. వీరిలో జ్వరం, గొంతునొప్పి, డయేరియా, న్యూమేనియా వంటి లక్షణాలు ఉన్నాయి.

అలాగే ఆ పిల్లాడికి కూడా ఊపిరితిత్తుల్లో వైరల్ న్యూమెనియా లక్షణాలు ఉన్నట్టు వైద్యులు నిర్ధారించారు. కానీ, బయటకు ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదు. పిల్లల్లో వ్యాపించే ఇదో  రకమైన కరోనా వైరస్ అని కొందరు సైంటిస్టులు అనుమానిస్తున్నారు. ‘ఇది కచ్చితంగా నిజం. పిల్లల్లో ఏ విధమైన వైరస్ లక్షణాలు కనిపించకపోవడం లేదా చాలా స్వల్ప స్థాయిలో ఇన్ఫెక్షన్ సోకి ఉండి ఉండొచ్చు’ అని ఆస్ట్రేలియా, సిడ్నీలోని న్యూ సౌత్ వేల్స్ యూనివర్శిటీకి చెందిన ఎపిడెమిలోజిస్ట్ రెయినా మాక్లింటైర్ పేర్కొన్నారు. 

అనేక విధాలుగా చూసినా.. ఇతర ప్రాణాంతక SARS, MERS వైరస్ ల వ్యాప్తిలో ఈ వైరస్ వ్యాపించే విధానం ఒకేలా సమాంతరంగా ఉన్నట్టు కనిపిస్తోంది. 2012లో సౌదీ అరేబియాలో వైరస్ MERS ప్రబలింది. ఆ తర్వాత 2015లో నూ సౌత్ కొరియాలో ఈ MERS మహమ్మారి విజృంభించింది.

ఈ రెండు సంవత్సరాల్లో MERS వైరస్ బారిన పడి మొత్తంగా 800 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో ఎక్కువ మంది చిన్నారులకు ఈ వైరస్ సోకినప్పటికీ లక్షణాలు బయటపడలేదు. 2003లో అంటువ్యాధి SARS ప్రబలిన సమయంలో కూడా పిల్లలెవరూ చనిపోలేదు. అయితే 45ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారిలో ఎక్కువమందికి ఈ వైరస్ సోకగా.. అందులోనూ పురుషులపైనే అధిక ప్రభావం ఉన్నట్టు నివేదికలు తెలిపాయి.

12ఏళ్ల లోపు పిల్లల్లో తక్కువ :  
SARS ప్రభావిత కేసుల్లో 8వేలకు పైగా కేసులు నమోదు కాగా వారిలో 135 మంది చిన్నారులకు వైరస్ సోకినట్టు నివేదికలు వెల్లడించాయి. 12ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల్లో అతి తక్కువ మంది ఆస్పత్రిలో చేరే అవకాశం ఉంటుంది లేదా ఆక్సీజన్ అవసరం లేదా ఇతర చికిత్స అవసరం ఉంటుందని రీసెర్చర్లు గుర్తించారు. 12ఏళ్ల వయస్సు కంటే ఎక్కువగా ఉన్న పిల్లల్లో పెద్దవారిలో మాదిరిగానే లక్షణాలు ఎక్కువగా ఉన్నట్టు గుర్తించామన్నారు.

వయస్సు రీత్యా మనుషుల్లో ఈ వైరస్ తీవ్రత ఉంటుంది అనడానికి సరైన కారణాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాల్సి ఉందని పరిశోధకులు అంటున్నారు. పెద్దల్లో వైరస్ తొందరగా వ్యాపిస్తుందంటే.. అప్పటికే వారిలో డయాబెటిస్, అధిక రక్తపోటు లేదా గుండెజబ్బులు వంటి ఇతర వ్యాధులు ఉండటం కారణంగా వారి శరీరంలోని వ్యాధినిరోధక శక్తి తగ్గిపోయి వైరస్ ఇన్ఫెక్షన్లు సోకేందుకు ఎక్కువగా అవకాశం ఉంటుందని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.