మాస్క్‌ ధరించి వ్యాయామం చేయొచ్చా? ఏమౌతుంది?

  • Published By: srihari ,Published On : May 26, 2020 / 02:02 AM IST
మాస్క్‌ ధరించి వ్యాయామం చేయొచ్చా? ఏమౌతుంది?

కరోనా వైరస్ వ్యాప్తిలో మాస్క్‌లు తొడగడం కామన్. కొందరు మాస్క్‌లతోనే వాకింగ్, జాగింగ్, వ్యాయామాలు చేసేస్తున్నారు. మాస్క్‌ పెట్టుకుని వ్యాయామం చేయడం మంచిదేనా? ఎక్సర్‌సైజ్‌ చేసే సమయంలో మాస్క్‌ తొడగాల్సి వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. మాస్క్ ధరించి వ్యాయామం చేయొచ్చా? దీనిపై వైద్య నిపుణులు ఏమంటున్నారు? మాస్క్‌ తొడిగి వ్యాయామం చేస్తే తప్పనిసరిగా ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఓసారి చూద్దాం.

మాస్క్‌లు మంచివేనంటున్నారు నిపుణులు. వైరస్‌లు, వ్యాధి కారక క్రిములనూ నిరోధిస్తాయి. వ్యాధుల బారిన పడకండా ఉండొచ్చు. వాకింగ్‌గానీ, జాగింగ్‌ గానీ లేదా ఇతర  వ్యాయామాలు చేసే సమయంలో మాస్క్‌ ధరిస్తున్నారా? మీకు ఆయాసం వస్తుంది జాగ్రత్త. ముక్కుకు అడ్డుగా మాస్క్ ధరించినప్పుడు ఎక్కువ సార్లు గాలి పీలుస్తూ ఉంటారు. 

మాస్క్‌ ధరించిన సమయంలో తల తేలికైన ఫీలింగ్‌ గానీ, కళ్లు తిరగడం గానీ, మగతగా అనిపించడం లేదా తగినంత చురుగ్గా లేకపోవడం, ఊపిరి అందకుండా ఉన్న ఫీలింగ్‌ ఉన్నట్టుగా అనిపిస్తుంది. మాస్క్‌ వల్ల అందాల్సినంత ఆక్సిజన్‌ అందడం లేదని అర్థం చేసుకోవాలి. ఈ సమయాల్లో మాస్క్‌ తొలగించి  జనసామాన్యానికి దూరంగా ఉంటూ వ్యాయామం చేయడం మంచిదంటున్నారు. వ్యాయామం ముగించాక మళ్లీ మాస్క్‌ ధరించవచ్చు. తేలికపాటి నడక సాగించే వారు విడిగా ఇంట్లోనే మాస్క్‌ లేకుండా వాకింగ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మళ్లీ మాస్క్‌ ధరించవచ్చు. 

గుండెజబ్బులు ఉన్నవారు.. శ్వాససంబంధమైన వ్యాధులున్నాయా? అలాగైతే వ్యాయామం సమయంలో జాగ్రత్తగా ఉండాలంటున్నారు. శ్వాసలో తగినంత ఆక్సిజన్‌ అందకపోతే ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. వాకింగ్, బ్రిస్క్‌వాకింగ్‌ వంటివి చేస్తున్నప్పుడు మాస్క్‌ తొడగకుండా చేయండి. బయట ఇప్పుడున్న వాతావరణంలో మాస్క్‌ తొడగకపోవడం అంత మంచిది కాదు. మీరు ఇంటి ఆవరణలోనో, మేడపై ఖాళీస్థలంలోనో మాస్క్‌ లేకుండానే నడక కొనసాగించడం మంచిది. ఫేస్‌మాస్క్‌ ధరించక తప్పదంటే వ్యాయామం మొదలుపెట్టే ముందు ఒకసారి మీ డాక్టర్‌ సలహాతో ఎక్సర్‌సైజ్‌ చేయండి. డాక్టర్‌ను నేరుగా కలవడం కుదరకపోతే ఫోన్‌లో సంప్రదించండి. 

వ్యాధినిరోధకత కోసం వ్యాయామాన్ని కొత్తగా ఆరంభించేవారు ఉంటారు. వీళ్లు మాస్క్‌ తొడిగే నేరుగా వ్యాయామం మొదలుపెట్టడం అసలు మంచిది కాదు. తొలుత తేలికపాటి వ్యాయామాలు/వార్మింగ్‌ అప్‌ ఎక్సర్‌సైజ్‌లు చేయాలి. క్రమంగా వ్యాయామాల తీవ్రతను పెంచుకుంటూ పోవడం మంచిది. చాలాకాలం వ్యాయామం చేయకుండా ఇప్పుడు వ్యాయామం చేస్తే.. మగతగా, కళ్లుతిరుగుతున్నట్లుగా, స్పృహ తప్పేలా ఉంటే వ్యాయామం ఆపేసి వైద్యున్ని సంప్రదించండి. మామూలుగా మనం శ్వాసించేటప్పుడు గాలి చాలా ఫ్రీగా ముక్కు నుంచి ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది. అయితే ఫేస్‌కు మాస్క్‌ ఉన్నప్పుడు అది గాలిని నిరోధిస్తూ, దాని కదలికలకు అడ్డుపడుతుంది. దాంతో అందాల్సిన మోతాదులో ఆక్సిజన్‌ అందదు. మాస్క్‌ ఉన్నప్పుడు మన ఊపిరితిత్తులకు అందే ఆక్సిజన్‌లో ఎంతో కొంత కొరత ఉంటుంది. 

దాంతో మళ్లీ మరోసారి గాలి పీల్చినప్పుడు మొదటికంటే ఆక్సిజన్‌ తక్కువ అందుతుంది. ముక్కుకు దగ్గరగానే ఉన్న కార్బన్‌ డైయాక్సైడ్‌ మళ్లీ లోపలికి ప్రవేశిస్తుంది. అందాల్సిన ఆక్సిజన్‌ మరింత తగ్గుతాయి. ఆక్సిజన్‌ అందాల్సినంత మోతాదులో అందకపోతే గుండెకూ, మెదడుకూ తగినంత ఆక్సిజన్‌ అందదు. ఫలితంగా తల దిమ్ముగా ఉండటం, తల తేలికైపోయినట్లుగా ఉండటం, ఊపిరి అందకపోవడం వంటి పరిణామాలు ఎదురవుతాయి. ఆక్సిజన్‌ తగినంతగా అందుతుందా లేదా అన్నది తెలుసుకోడానికి ఉత్తమమైన మార్గం పల్స్‌ ఆక్సీమీటర్‌ను ఉపయోగించడం. దానిద్వారా మన రక్తంలోని ఆక్సిజన్‌ మోతాదు ఎంత ఉందో తెలుసుకోవచ్చు. 

Read: యోగ చేస్తే డిప్రెషన్ లక్షణాలు తగ్గుతాయి: కొత్త రిసెర్చ్ తేల్చేసింది