వర్క్ ఫ్రమ్ హోం ఎఫెక్ట్.. 90శాతం మందిలో ఆరోగ్య సమస్యలు, మానసిక ఒత్తిడి

వర్క్ ఫ్రమ్ హోం ఎఫెక్ట్.. 90శాతం మందిలో ఆరోగ్య సమస్యలు, మానసిక ఒత్తిడి

work from home creating health problems: కరోనా లాక్‌డౌన్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా పలు సంస్థలు ఉద్యోగులకు ఇంటి నుంచి పని చేసుకునే(వర్క్ ఫ్రమ్ హోమ్) సౌలభ్యాన్ని కల్పించిన సంగతి తెలిసిందే. కొన్ని నెలలుగా ఈ వ్యవహారం సాగుతోంది. ఈ వెసులుబాటు బాగుందని తొలుత ఉద్యోగులు ఆనందించారు. రాను రాను, వారిలో మార్పు వచ్చింది. ఆఫీసులకు వెళ్లి పని చేయడమే మేలని భావిస్తున్నారు. వర్క్ ఫ్రమ్ హోం వల్ల శారీరక, మానసిక అనారోగ్యాలు చుట్టుముట్టడమే ఇందుకు కారణమని హర్మన్ మిల్లర్ అనే ఆఫీస్ ఫర్నిచర్ తయారీ సంస్థ ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో తేలింది.

ఈ సంస్థ సర్వే ప్రకారం.. ఇంటి నుంచే పనిచేస్తున్న ఉద్యోగులు 20 శాతం ఎక్కువ సమయం కూర్చుని పనిచేస్తున్నారు. ఫలితంగా 90 శాతం మంది నొప్పులు వంటి శారీరక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే, మానసిక ఒత్తిడి కూడా వారిపై విపరీతంగా పెరుగుతోంది. వీరిలో 39.40 శాతం మందికి మెడనొప్పి, 53.13 శాతం మందికి నడుమునొప్పి, 44.28 శాతం మందికి నిద్రలేమి, 34.53 శాతం మందికి చేతులు, 33.83 శాతం మందికి కాళ్ల నొప్పులు, 27.26 శాతం మందిలో తలనొప్పి, కళ్లు లాగడం వంటి సమస్యలు ఉన్నట్టు సర్వేలో తేలింది.

ఈ సర్వేలో వెల్లడైన వివరాలు ఉద్యోగులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. కాగా, కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు. కంటిన్యూగా కూర్చోవడం మానుకోవాలి. గంటకు ఒకసారి లేచి తిరగాలి. అలాగే రెగులర్ ఇంటర్వల్స్ లో నీళ్లు తాగాలి. చైర్ సరిగా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. సీటింగ్ పొజిషన్ కరెక్ట్ గా ఉండేలా చూసుకోవాలి. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్య సమస్యల నుంచి కొంతవరకు బయటపడొచ్చని నిపుణులు చెబుతున్నారు. తొలుత ఎక్కడైనా ఎలా అయినా కూర్చుని పని చేస్తున్నారు. కానీ కొన్ని వారాలు నెలల తర్వాత ఆరోగ్య సమస్యలు బయటపడుతున్నాయి.