కరోనా బారిన పడ్డ యువత కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది, స్టడీ

  • Published By: naveen ,Published On : July 25, 2020 / 12:13 PM IST
కరోనా బారిన పడ్డ యువత కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది, స్టడీ

కరోనా వైరస్ మహమ్మారి ఎక్కువగా వృద్ధులపై ప్రభావం చూపుతుందని వైద్య నిపుణులు అంటున్నారు. దీనికి కారణం ఏజ్ ఫ్యాక్టర్. వయసు మీద పడటం, పలు అనారోగ్య సమస్యలు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం.. ఇలాంటి కారణాలతో వృద్ధులు ఎక్కువగా కరోనా బారిన పడుతున్నారని, ఆ ఏజ్ గ్రూప్ లో మరణాలు ఎక్కువగా ఉంటున్నాయని వైద్యు నిపుణులు అంటున్నారు. దీంతో 65ఏళ్లు పైబడ్డ వృద్ధులపై అంతా ఎక్కువగా ఫోకస్ పెట్టారు. వారిని హై రిస్క్ కేటగిరి జాబితాలో చేర్చారు.

కోలుకున్నా, కొన్ని వారాల పాటు ఆరోగ్య సమస్యలు:
అయితే, సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(CDC) అధ్యయనంలో కొత్త విషయం వెలుగుచూసింది. కరోనా బారిన పడ్డ యువత పూర్తిగా కోలుకోవడానికి అనుకున్న దాని కంటే చాలా ఎక్కువ సమయం పడుతోందట. కరోనా నుంచి కోలుకున్న తర్వాత కూడా కొన్ని వారాల పాటు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారట. దగ్గు, జ్వరం, అలసట, శ్వాస సంబంధ సమస్యలతో బాధపడుతున్నారట. యథాతథ, సంపూర్ణ ఆరోగ్య స్థితికి చేరుకోవడానికి బాగా సమయం పడుతోందట.

పెరుగుతున్న కరోనా బారిన పడుతున్న యువత సంఖ్య:
సీడీసీ అధ్యయనం ప్రకారం, కరోనా బారిన పడుతున్న వారిలో యువత సంఖ్య పెరుగుతోంది. ఆరోగ్యంగా ఉన్నప్పట్టికి, రోగనిరోధక శక్తి మెండుగా ఉన్నా కొవిడ్ బారిన పడుతుండటం గమనార్హం. అయితే చాలా కేసుల్లో లక్షణాలు కనిపించడం లేదు. లేదా తీవ్రత చాలా తక్కువగా ఉంటుంది. ఇది యంగర్ అడల్స్ట్ కు మంచి విషయం కాదని సీడీసీ చెప్పింది. కరోనా బారిన పడ్డ యువత కోలుకోవడానికి అనుకున్న దానికంటే చాలా ఎక్కువ సమయం పడుతోందని సీడీసీ తెలిపింది.

కోలుకున్న తర్వాత కూడా హెల్త్ ప్రాబ్లెమ్స్:
సీడీసీ ఓ అధ్యయనం చేసింది. దాని రిపోర్టును జూలై 24న విడుదల చేసింది. కరోనా బారినపడ్డ 274 మంది యువతపై ఈ అధ్యయనం చేసింది. ఏప్రిల్ 15 నుంచి జూన్ 25వ తేదీ వరకు స్టడీ చేసింది. వారిలో కరోనా లక్షణాలు ఎలా ఉన్నాయి? వైరస్ తీవ్రత ఎంత మేర ఉంది? ఎన్ని రోజులకు కోలుకుంటున్నారు? యథాతథ ఆరోగ్య స్థితికి రావడానికి ఎన్ని వారాల సమయం పడుతోంది? కోలుకున్న తర్వాత కూడా వారు ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా? ఇలాంటి అంశాలపై సీడీసీ స్టడీ చేసింది.

ఎలాంటి లక్షణాలు లేకుండానే కరోనా బారిన పడ్డ వారిని సీడీసీ అబ్జర్వ్ చేసింది. వీరిలో కరోనా నుంచి కోలుకున్న తర్వాత కూడా అంటే, 14 నుంచి 21 రోజుల తర్వాత కూడా చాలామంది యథాతథ ఆరోగ్య స్థితికి రాలేకపోయారని గుర్తించారు. 274 మందిలో 35శాతం మందిది ఇదే పరిస్థితి. 18 నుంచి 34 ఏళ్ల వయసున్న వారిలో 26శాతం మంది ఇదే మాట చెప్పారు.

దగ్గు, అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు:
తీవ్రమైన కరోనా వైరస్ తో ఆసుపత్రిలో చేరిన పెద్దల్లో దీర్ఘకాలిక లక్షణ వ్యవధి మరియు వైకల్యం సాధారణం. అయితే స్వల్ప కరోనా లక్షణాలు ఉన్న యువతలో పాజిటివ్ అని రిపోర్టు వచ్చిన కొన్ని వారాల తర్వాత కూడా దగ్గు, అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటి సమస్యలు పడుతున్నట్టు గుర్తించారు. దీని బట్టి, కరోనా తీవ్రత తక్కువగా ఉన్న వ్యక్తులలోనూ(యువత సహా) ఎక్కువ రోజులు అనారోగ్యానికి గురవుతారని సీడీసీ తేల్చింది. కరోనా నుంచి కోలుకున్నా, మూడు, నాలుగు వారాల తర్వాత కానీ ఆరోగ్యం యథాస్థితికి రావడం లేదు. ఆసుపత్రిలో చేరని కేసుల్లోనూ ఇలాంటి పరిస్థితే ఉంది. కరోనా నుంచి రికవరీ అయినా కొన్ని వారాల పాటు అనారోగ్యంతో, కొవిడ్ లక్షణాలతో బాధపడుతున్నారు.

ముందు జాగ్రత్తలే శ్రీరామరక్ష:
సో, యువత కూడా జాగ్రత్తపడాల్సిన సమయం ఇది. నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదు. కరోనా మనల్ని ఏమీ చేయదనే అతివిశ్వాసం మంచిది కాదు. మనోధైర్యంతో పాటు ముందు జాగ్రత్తలూ ముఖ్యమే. అసలు కరోనా బారిన పడకుండా చూసుకోవడమే ఉత్తమం అని నిపుణులు స్పష్టం చేశారు. భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం, తరుచుగా చేతులు కడుక్కోవడం, పబ్లిక్ ప్లేసుల్లో ఫేస్ మాస్కులు ధరించడం వంటి ముందు జాగ్రత్తలు ప్రతి ఒక్కరూ కచ్చితంగా పాటించాలి. అప్పుడే కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడానికి అవకాశం ఉంటుందని వైద్య నిపుణులు తేల్చారు.