తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం మరింత తీవ్రమైంది. దీని ప్రభావంతో తెలంగాణలో మరో రెండ్రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు రాష్ట్రానికి ఒకటో నంబరు హెచ్చరిక జారీ చేసింది. ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని సూచించింది.అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో గత మూడు రోజులుగా ఎడతెరపిలేకుండా వానలు కురుస్తున్నాయి. ఇక ఆది, సోమవారాల్లో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది.

వానలపై సీఎం కేసీఆర్ సమీక్ష
మరోవైపు వర్షాలు, వరదలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ శనివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, మంత్రులతో మాట్లాడారు. శనివారం రాష్ట్రంలో 4.52 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, సహాయక చర్యలు ముమ్మరం చేయాలని సీఎం కేసీఆర్ సూచించారు. జిల్లాల వారీగా పరిస్థితిని సమీక్షించారు. హైదరాబాద్‌లో రెండు కంట్రోల్‌ రూమ్‌లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.మంత్రులు తమ జిల్లాల్లోనే ఉండాలని, కలెక్టర్, పోలీస్‌ అధికారులతో కలసి నిరంతరం పరిస్థితిని పర్యవేక్షించాలని సూచించారు. అలాగే తెలంగాణవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగుతున్నాయి.

పరిస్థితులను పర్యవేక్షించండి: సీఎస్
రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న వర్షాలు, వరదలపై జిల్లా అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ జిల్లా కలెక్ట ర్లను ఆదేశించారు. ప్రధాన కార్యాలయాల్లో అందుబాటులో ఉంటూ పరిస్థితులను పర్యవేక్షించి ప్రజల ప్రాణాలు, ఆస్తులకు నష్టం జరుగకుండా చూడాలని చెప్పారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు వర్షాలు, వరదల నేపథ్యంలో తీసుకుంటున్న చర్యలపై బీఆర్కే భవన్‌ నుంచి శనివారం ఆయన జిల్లా కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు.కంట్రోల్ రూం లు ఏర్పాటు చేయండి
ప్రస్తుత పరిస్థితులను పర్యవేక్షించడానికి కలెక్టర్లు తమ కార్యాలయాల్లో 24 గంటలు పనిచేసేలా కంట్రోల్‌ రూమ్‌లను ఏర్పాటుచేయాలని ఆదేశించారు. రాష్ట్రస్థాయిలోనూ కంట్రోల్‌ రూం ఏర్పాటైందని, ఎవరికి ఎలాంటి కష్టం ఉన్నా 040- 23450624 నంబర్‌కు ఫోన్‌ చేయవచ్చని తెలిపారు. జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమైతే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. టెలికాన్ఫరెన్స్‌లో డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ కార్యదర్శి రాహుల్‌ బొజ్జా, పోలీసు, రెవెన్యూ శాఖల అధికారులతో పాటు పలు శాఖల ఉన్నతాధికారులు పాల్గోన్నారు.


20 వేల ఎకరాల్లో పంట నష్టం
గత నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షాలు, ఎడతెరపి లేని ముసురు కారణంగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 20 వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్టు వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా వేసింది. ఇందులో పత్తి అత్యధికంగా 7,500 ఎకరాలు, వరి 5,700 ఎకరాలు, కందులు 3 వేల ఎకరాల్లో నష్టపోయినట్టు భావిస్తోంది. రాష్ట్రంలోని 7 జిల్లాల్లో ఈ పంట నష్టం వాటిల్లినట్టు ఆ శాఖ ప్రాథమిక అంచనాల్లో తేల్చింది.

READ  కరోనా ఎఫెక్ట్ : వీడియో కాలింగ్ ద్వారా శుభాకాంక్షలు

Related Posts