ఉరుములు, మెరుపులు, పిడుగులు.. హైదరాబాద్‌లో భారీ వర్షం

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. నగరంలో భారీ వర్షం పడుతోంది. సాయంత్రం నుంచి వాన దంచి కొడుతోంది. ఉదయం నుంచి ఎండ కాసింది. సాయంత్రానికి వాతావరణం మారిపోయింది. ఆకాశాన్ని నల్లని మబ్బులు కమ్మేశాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వాన నగరాన్ని ముంచెత్తింది. పలు చోట్ల చెవులు చిల్లులు పడే శబ్దాలతో పిడుగులు పడ్డాయి. వర్షం నీరు రోడ్లను ముంచెత్తింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపై నీరు నిలవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.

మాదాపూర్, హైటెక్‌ సిటీ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, మియాపూర్, ఎల్బీ నగర్, సికింద్రాబాద్, కూకట్‌పల్లి ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తోంది. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా కూడా ఆగింది. సాయంత్రం నుంచి పలు ప్రాంతాల్లో వర్షం చిన్నగా మొదలైనా.. క్రమంగా సిటీ అంతటా దట్టమైన నల్లమబ్బులు కమ్ముకుని.. కుండపోత వర్షం ముంచెత్తింది. రోడ్లన్నీ జలమయం కాగా.. ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోయింది. ఒక పక్క కరోనా విజృంభిస్తున్న తరుణంలో ఇలా వర్షాలు కురిస్తే సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశాలు ఉండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ తీరానికి దగ్గరలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో అల్పపీడనం ఏర్పడింది. ఇది ఎత్తుకు వెళ్లే కొద్దీ నైరుతి దిశ వైపునకు తిరిగి ఉంది. మరింత బలపడడంతో భారీ ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో వర్ష బీభత్సం కొనసాగుతోంది. ఇటు తెలంగాణలోనూ వానలు దంచి కొడుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా వర్షం కురిసింది. ఉరుములు మెరుపులతో పిడుగులు కూడా పడ్డాయి. అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో మరో నాలుగు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

Related Posts