Home » రాయలసీమను ముంచెత్తిన వర్షాలు
Published
1 year agoon
By
chvmurthyరాయలసీమ జిల్లాల్లో గత రెండురోజులుగా కురుస్తున్న వర్షాలతో జన జీవనం అస్తవ్యస్తం అయ్యింది. కడప జిల్లా జమ్మలమడుగులో రెండు రోజుల నుంచి ఎడతెరపిలేకుండా వర్షం కురుస్తోంది. వర్షం ధాటికి పలు మండలాల్లో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలు ప్రాంతాల్లో వర్షం నీరు గ్రామాల్లోకి రావడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. పెద్దముడియం మండలంలో కుందూ నదికి ఉధృతంగా ప్రవహిస్తోంది. నెమళ్ల దిన్నె బ్రిడ్జిపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. వరద ప్రవాహం పెరగడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కడప జిల్లాలో కురుస్తున్న భారీవర్షాలతో.. గండి శేషాచల కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో గండి – రాయచోటి మార్గంలో రాకపోకలు కొద్ది సేపు నిలిచిపోయాయి. సంబంధిత అధికారులు స్పందించకపోవడంతో ఆ దారిన పోయే కొందరు యువకులు, స్కూల్ విద్యార్థులు కొండచరియలను తొలగించే పనిలో నిమగ్నమయ్యారు. విషయం తెలుసుకున్న అధికారులు ఆలస్యంగా సంఘటన స్థలానికి చేరుకుని .. మిగిలిన కొండచరియలను జేసీబీ సహాయంతో తొలగిస్తున్నారు. కొండరాళ్లు విరిగిపడే సమయానికి వాహనాలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
కర్నూలు జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తాయి. ప్రముఖ ఆలయం మహానంది జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఆలయం మొదటి, రెండో ప్రాకారంలోకి వరద నీరు ప్రవేశించింది. పంచలింగాల మంటపం నీట మునిగింది. కోనేరు వరదలతో మహానంది ఆలయానికి దర్శనాలు రద్దు చేశారు. వరద నీరు రోడ్లపైకి చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మహానంది మండల పరిధిలోని పాఠశాలలకు సెలవు ప్రకటించారు అధికారులు. జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న కుండపోత వర్షాలతో నంద్యాల, మహానంది, ఆళ్లగడ్డ, చాగలమర్రి, రుద్రవరం, సిరివెళ్ల, గోస్పాడు, కోవెలకుంట్ల మండలాలు నీట మునిగాయి. మహానంది, సంజామాల, నంద్యాల, ఆళ్లగడ్డకు దాదాపు రాకపోకలు నిలిచిపోయాయి. వందల ఎకరాలపంట నీట మునిగింది. సంజామల మండలం ముదిగేడు గ్రామం వద్ద పాలేరు వాగులో ఆర్టీసీ బస్సు చిక్కుకున్న ఘటన చోటుచేసుకుంది. బస్సులో ఎక్కువమంది విద్యార్ధులు, మహిళలు ఉండటంతో ఆందోళన చెందారు. అయితే పోలీసులు, స్థానికుల సాయంతో ఆర్టీసీ బస్సును లాగడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
అనంతపురం జిల్లా పుట్టపర్తిలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. దేవాలయాలలోకి, సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహంలో వర్షపు నీరు రావడంతో భక్తులు, విద్యార్ధినులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విద్యార్ధినులతో పాటు వార్డెన్కూడా నీటిని బకెట్లతో తోడాల్సిన పరిస్థితి ఏర్పడింది. వర్షం వచ్చిన ప్రతీసారి ఇదే పరిస్థితి ఉంటుందని..అధికారులకు , నేతలకు ఎన్నిసార్లు చెప్పినా.. పట్టించుకోవడంలేదని ప్రజలు వాపోతున్నారు.