ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో అయోధ్యలో హైఅలర్ట్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఆగస్టు 5న అయోధ్యలో రామమందిర నిర్మాణానికి భూమిపూజ వేడుకను భగ్నం చేయడంతోపాటు అయోధ్యతోపాటు ఇతర ప్రాంతాల్లో ఉగ్రదాడులకు పాకిస్థాన్ ఐఎస్ఐ కుట్రలు పన్నిందని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో అయోధ్యలో హైఅలర్ట్ ప్రకటించారు.

అయోధ్యలో భూమి పూజ నిర్వహించబోయే రోజు, జమ్మూకాశ్మీర్ ఆర్టికల్ 370ని రద్దు చేసిన రోజు ఆగస్టు 5 కావడంతో భద్రతా బలగాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాయి. అయోధ్యతోపాటు ఢిల్లీ, జమ్మూకాశ్మీర్‌లో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. అన్ని ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలతోపాటు నిఘావేసి ఉంచాయి.


కాగా, ఆగస్టు 5న అయోధ్యలో జరగనున్న భూమిపూజ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీతోపాటు బీజేపీ అగ్రనేతలు ఎల్‌కే అద్వానీ, మురళీమనోహర్ జోషీ, ఉమా భారతి, అరెస్సెస్ అగ్రనేతలు మోహన్ భగవవత్, దేశంలోని దిగ్గజ పారిశ్రామికవేత్తలు, అధికారులు పాల్గొననున్నారు. ప్రధాని హెలికాప్టర్ దిగే సాకేత్ మహా విద్యాలయం నుంచి రామ జన్మభూమి స్థలం వరకు ఇప్పటికే భద్రతా దళాలు భారీ ఎత్తున మోహరించాయి.

అలాగే, రాంకోట్ ప్రాంత నివాసితుల రాకపోకలకు సంబంధించి ప్రత్యేక పాస్ లను కూడా జారీ చేశారు. మాక్ డ్రిల్స్ తోపాటు ఇంటింటి తనిఖీలు నిర్వహిస్తున్నారు. అంతేగాక, డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టారు. ఇది ఇలావుంటే, అయోధ్య భూమి పూజ కోసం ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే అయోధ్యను సుందరంగా తీర్చిదిద్దే పనిలో పడింది. వాడవాడలను అందంగా రూపుదిద్దుతున్నారు.

Related Posts