లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Hyderabad

ఆర్టీసీ తేలేనా : హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ

Published

on

High Court hearing on RTC strike

ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలని కార్మికులు పట్టుబడుతుండటంతో.. ఆర్టీసీ మెర్జ్ అయ్యే ప్రసక్తే లేదని సీఎం కేసీఆర్ కుండబద్దలు కొట్టి మరీ చెప్తున్నారు. ఈ క్రమంలో 2019, నవంబర్ 07వ తేదీ గురువారం హైకోర్టులో జరిగే విచారణ కోసం ఇరువర్గాలు తమ వాదనలతో సిద్ధంగా ఉన్నాయి. స్వయంగా తమ ముందు రావాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో… జరిగే విచారణకు సీఎస్‌ ఎస్కే జోషి, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి, ఆర్టీసీ ఎండీ, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ హాజరుకానున్నారు. 

ఆర్టీసీ సమ్మెపై అధికారులు హైకోర్టుకు అఫిడవిట్లు సమర్పించారు. ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, ఆర్టీసీ ఇన్‌ఛార్జ్‌ ఎండీ సునీల్‌శర్మ, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్ అఫిడవిట్లు అందజేశారు. ఆర్టీసీకి ప్రభుత్వం ఎలాంటి బకాయిలేదని ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు నివేదికలో పేర్కొన్నారు. ఆర్టీసీకి ఉన్న బకాయిలు 3006 కోట్లు ఉండగా.. ప్రభుత్వం 3,903 కోట్లు చెల్లించిందన్నారు. మోటారు వాహనాల పన్ను కింద ఆర్టీసీయే తిరిగి ప్రభుత్వానికి 540కోట్లు చెల్లించాలని అఫిడవిట్‌లో నివేదించారు. ఆనవాయితీగా వివిధ పద్దుల కింద ఆర్టీసీకి నిధులు ఇస్తున్నామని.. రుణం పద్దు కింద ఇచ్చిన నిధులు వాస్తవానికి విరాళమేనని చెప్పారు. 

ఇదిలా ఉంటే..కేసు విచారణకు రానుండటంతో… రవాణాశాఖ మంత్రి, అడ్వకేట్, ఆర్టీసీ ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్‌ 2019, నవంబర్ 06వ తేదీ ప్రగతి భవన్‌లో దాదాపు 9 గంటల పాటు సుదీర్ఘంగా సమీక్షించారు. హైకోర్టు విచారణతో పాటు విధుల్లో చేరేందుకు కార్మికులకు ఇచ్చిన గడువు ముగియడంతో… ప్రభుత్వం అవలంభించాల్సిన కార్యాచరణపై చర్చించారు. రాష్ట్రంలో 5,100 ప్రైవేటు బస్సులకు అనుమతులు ఇచ్చేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. గడువులోపు కార్మికులు విధుల్లో చేరకపోతే మిగతా రూట్లను కూడా ప్రైవేటుపరం చేస్తామని గతంలో సీఎం తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన అంశాలపైనే కేసీఆర్‌ ప్రధానంగా అధికారులతో చర్చలు జరిపారు. ప్రైవేటు బస్సులకు కేబినెట్‌ అనుమతి ఇచ్చిన నేపథ్యంలో వాటిపై విధివిధానాలతో పాటు కొత్తగా ఎన్నిరూట్లలో ప్రైవేటు బస్సులను అనుమతించవచ్చనే అంశాలపై సీఎం ఆరా తీసినట్లు తెలిసింది. సమ్మె కొనసాగుతున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయనే దానిపైనా ఆయన అడిగి తెలుసుకున్నారు.

ప్రభుత్వం తమ డిమాండ్లు తీర్చేవరకు సమ్మె విరమించేది లేదని జేఏసీ కన్వీనర్ అశ్వత్ధామరెడ్డి పునరుద్ఘాటించారు. తమతో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘం వేయాలని కోరారు. సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. జీహెచ్ఎంసీ బకాయి ఎందుకు ఇప్పించట్లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆర్టీసీకి 5 వేల కోట్ల అప్పులు ఉన్నాయని చెబుతారే తప్ప… సంస్థను సంరక్షించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదన్నారు. హైకోర్టు ఎలాంటి తీర్పునిస్తుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. 
Read More : హయత్‌నగర్‌లో బాలిక కిడ్నాప్‌ కలకలం

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *